మగవాడి సహజసిద్ధమైన ఎన్నో సమస్యల్లో ఇదీ ఒకటి. వివాహం తర్వాత, తనకు ఒక భార్య అంటూ వచ్చాకా.. నెలలకో, సంవత్సరాలకో… మరొకరి భార్య పర్ఫెక్ట్ అనిపిస్తుంది! మరొకరికి భార్య అయిన మగువ తమకు భార్య అయి ఉంటే బాగుంటుందనో, లేదా తనతో సాన్నిహిత్యం కావాలనో అనిపిస్తుంది! ఈ సమస్య ఒకరిదో ఇద్దరిదో కాకపోవచ్చు. చాలా మందికి ఇలాంటి భావనలు కలగడంలో పెద్ద ఆశ్చర్యం లేదని అంటున్నారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. దీనికి పలు కారణాలు ఉన్నాయనే మాటను వారు చెబుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఉన్న మగవాళ్లలో కూడా ఇలాంటి ఆలోచనలు రావొచ్చని, దీనికి వారి పరిస్థితులను బట్టి వివిధ కారణాలు ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.
ఆకర్షణ.. ఆకర్షణ!
ఆకర్షణకు ఒక హద్దు లేకపోవచ్చు! మనిషి జీవితంలో ఆకర్షణ ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఆకర్షణల ప్రభావంతోనే జీవితం మొత్తం మనుగడగా సాగిపోవచ్చు! ఆకర్షణతోనే ఎన్నో నిర్ణయాలను మనిషి తీసుకుంటాడు. స్త్రీకి అయినా, మగవాడికి అయినా ఆకర్షించే అంశాలుంటాయి. వీటిల్లో ఆపోసిట్ సెక్స్ పట్ల ఆకర్షణ కలగడం కూడా సహజమైనదే. ఇలాంటి ఆకర్షణ వివాహం తర్వాత కూడా ఉండకూడదని నియమం ఏమీ లేదు! సామాజిక నియమం అయితే ఉండొచ్చు కానీ, మనిషిలో నిద్రాణమైన జంతుతత్వం మాత్రం వివాహం తర్వాత మరొకరి పట్ల ఆకర్షితం కాకుండా ఉండనీయదు. స్త్రీకి కూడా ఇలాంటి ఆకర్షణ ఉండవచ్చు. అయితే సామాజికంగా స్త్రీని ట్రీట్ చేసే తీరు వల్ల ఈ ఆకర్షణల వెంట వారు పడటం తేలిక కాకపోవచ్చు. మగవాడు మాత్రం ఇలాంటి ఆకర్షణల వెంట పడే అవకాశాలుంటాయి.
వైవాహిక జీవితంపై ఎక్స్ పెక్టేషన్స్!
వివాహం చేసుకోవాలనుకునే ప్రతి వారికీ వైవాహిక జీవితం పట్ల కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి! పెళ్లి చేసుకుంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకోని మానవుడంటూ ఉండదు! అలాంటి ఎక్స్ పెక్టేషన్స్ కు అనుగుణంగా వైవాహిక జీవితం లేనప్పుడు పక్క చూపులు ఉండవచ్చు! ఈ ఎక్స్ పెక్టేషన్స్ ఒక్కోరివి ఒక్కో లెవల్లో ఉంటాయి. వైవాహిక జీవితం గురించి ఈ అంచనాలు ఎప్పుడు నిజం కానప్పుడు ఒకింత ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఈ ఫ్రస్ట్రేషన్ మరొకరి పట్ల ఆకర్షణను పెంచవచ్చు.
ఎంతకూ తృప్తి లేకపోవడం!
మగవాడి లైంగిక వాంఛలకు అంతు ఉండకపోవచ్చు. మంచి భార్య, అందమైన వైవాహిక జీవితం, ఉన్నా.. కూడా మరొక స్త్రీ పట్ల వాంఛను పెంచుకోవడం కూడా మగాడి తత్వమే. ఈ విషయంలో వ్యక్తులను ప్రత్యేకంగా నిందించాల్సిన అవసరం లేకపోవచ్చేమో! ఇదంతా నేచర్ ఇచ్చిందేనేమో! అర్థం చేసుకునే స్త్రీ భార్యగా ఉన్నా, అంతా బాగానే ఉన్నా.. ఇంకో స్త్రీ పట్ల, అది కూడా వివాహిత పట్లే ఇలాంటి ఆకర్షణలు పెరగవచ్చు. ఇలాంటి మానసిక తృప్తి ని అన్వేషించే వారు కూడా లైంగిక సంబంధాల పట్ల పడే అవకాశాలుంటాయనేది విశ్లేషణ.
భార్య తీరుపై అసంతృప్తి!
తన భార్య అర్థం చేసుకోలేదనే ఫిర్యాదు చాలా మంది మగవాళ్ల వద్ద రెడీగా ఉంటుంది. తనకు అర్థం చేసుకునే భార్య దక్కలేదనే అసంతృప్తితో కూడా ఇలాంటి సంబంధాల కోసం అన్వేషించే వారు ఉంటారు. తమ భార్య మంచిది అయితే ఇలాంటి అవసరం తమకు ఉండేది కాదని తన వల్లనే తాము పక్క ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొందరు కన్ఫెస్ అవుతుంటారు!
లైంగిక అవసరాలు తీరకపోవడం!
కొందరు భార్యాభర్తల మధ్యన లైంగిక అవసరాలకు సంబంధించిన కమ్యూనికేషన్ అవసరమైన రీతిలో ఉండకపోవచ్చు అని విశ్లేషకులు అంటారు. మగవాడు కోరుకున్నది స్త్రీ ఇవ్వకపోవడం, మొహమాటమో, బెరుకో, అసహ్యమో.. ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల శారీరక సంతృప్తి పూర్తిగా అనుభవించిన వారు కూడా పక్క చూపుల పట్ల ఆస్కారం చూపిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. సెక్స్ వల్ ఎక్స్ పెరిమెంట్స్, శాటిస్ ఫ్యాక్షన్ కోసం వీరు వేరే సంబంధాలను వెదుక్కోవచ్చని అంటున్నారు!
తాత్కాలికమే!
అయితే పక్క చూపులు, మరొకరి భార్య అందంగా అనిపించడం.. కమ్యూనికేషన్ ఏర్పడి అలాంటివి సెక్స్ వరకూ వెళ్లినా.. ఆ ఆకర్షణ అంతా తాత్కాలికమే అని కూడా రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ చెబుతారు. కొన్ని సంబంధాలు వ్యవధి నెలలు అయితే, మరికొన్ని ఇంకాస్త ఎక్కువ కాలం కొనసాగవచ్చు. పక్క చూపులు చూసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని అంటున్నారు.