నాకు నేను నచ్చను!

పిల్ల నచ్చింది. కానీ తెల్లగా వుంది. అదే పెద్ద సమస్య అయ్యింది నీల్‌కి. కారణం: తాను నల్లగా వుండటం. భిన్న ధ్రువాలేనా.. భిన్న వర్ణాలు ఆకర్షించుకోవా? ఈ ప్రశ్నలు అతన్ని ముందుకు నెట్టేశాయి. కానీ…

పిల్ల నచ్చింది. కానీ తెల్లగా వుంది. అదే పెద్ద సమస్య అయ్యింది నీల్‌కి. కారణం: తాను నల్లగా వుండటం. భిన్న ధ్రువాలేనా.. భిన్న వర్ణాలు ఆకర్షించుకోవా? ఈ ప్రశ్నలు అతన్ని ముందుకు నెట్టేశాయి. కానీ జాగ్రత్తగా అడుగులెయ్యాలి. 

రంగును బట్టి పిల్ల పేరు శ్వేత, మల్లి.. ఇలా అయివుండాలి. ‘శ్వేత గారూ?’ అనేశాడు. ‘నేను శ్వేతను కాను. నర్సమ్మ’ను అనేసింది. ‘అనుకుంటూనే వున్నాను అలాంటిపేరే అయి వుంటుందని.’ అని నాలుక కరచుకున్నాడు.  

మాటామాటా కలిపాక, వ్యవహారాన్ని రెస్టారెంట్‌ వరకూ తెచ్చాడు. ‘తెల్లగా వుందిగా, శాకాహారే అయివుంటుంది.’ అని  వెజ్‌ శాండివిచ్‌ ఆర్డర్‌ చేశాడు. ఆమె శాండివిచ్‌ను నోట్లో పెట్టు కోకుండా, ముక్కు దగ్గరపెట్టుకుని, ‘చికెన్‌ శాండ్‌విచ్‌ కాదా..?’, అని నీరుగారిపోయింది. 

అలాగే ‘తెల్లగా సుకుమారంగా’ వుంది కదా, అని ‘సెంటిమెంటు’న్న సినిమాకు తీసుకువెళ్ళాడు. ‘ఇంటర్వెల్‌బ్రేక్‌’లో ‘ఇంకా పుట్టని లవ్‌ను బ్రేక్‌ చేసినంత’ పని చేసింది. మధ్యలో ధియేటర్‌ బయిటకు వచ్చేసి,  ‘ఇది క్రైమ్‌, థ్రిల్లర్‌ సినిమా అనుకున్నాను. దెబ్బతిన్నాను. నేరుగా ఆసుపత్రికి వెళ్తున్నాను’ అని వాట్సాప్‌ చేసింది. 

నీల్‌ తంటాలు పడి ఆమె వున్న ఆసుపత్రికి వెళ్ళాడు. ఆమె అప్పటికే నర్స్‌ దుస్తుల్లో వుంది. ‘ఇదేమిటీ?’ అన్నాడు. ‘చెప్పానుగా. నర్సమ్మ’ని అని. 

నీల్‌కీ ఏపేరయినా ఒకటే. నీల్‌ కీ చికెన్‌ అంటేనూ ఇష్టమే. అసలు నీల్‌కే క్రైమ్‌ సినిమాలు అంటే పిచ్చి. కానీ ఆమె మెప్పుకోసం అలా చేశాడు. 

నీల్‌ పక్కింటి పిల్లా ఇంతే అందంగా వుంటుంది. మరీ పక్కింటి పిల్లను ప్రేమిస్తే  ప్రేమ కాదేమోనని, ఇలా వెలుపల గాలిస్తున్నాడు. నీల్‌ ఎప్పుడూ తనలోని తనని తొక్కేస్తూ వుంటాడు. 

నీల్‌కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఇష్టమే. కానీ హైదారాబాద్‌లో వుండటమూ ఇష్టమే. కారణం తెలీదు. మొత్తానికి హైదరాబాద్‌లోనే వున్నాడు. ఇలా అయిదేళ్ళు గడిపేశాడు. ఆ పక్కింటి పిల్లా ఈ అయిదేళ్ళూ వచ్చిన సంబంధాలన్నీ తిరగ్గొట్టేస్తోంది.

చివరకు నీల్‌ ఏం చేశాడో తెలుసా? పక్కింటి పిల్లతో పాటు తానూ, పెళ్ళిచేసుకోకుండా తనింట్లో తాను వుండిపోయాడు. అందుకే మరి… నీల్‌ ఎప్పుడూ తనకీ తాను నచ్చడు. 

-గౌరీపతి