Advertisement

Advertisement


Home > Politics - Opinion

నీ యాత్రలో ‘ఉప్పు’ ఉందా?

నీ యాత్రలో ‘ఉప్పు’ ఉందా?

ప్రజాజీవితం అనగానే.. ప్రజల నమ్మకం సంపాదించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ్టి రోజుల్లో.. తన బతుకుతెరువుకోసం తప్పుడు మార్గాలను ఎంచుకోదలచుకుంటున్న ప్రతి ఒక్కడూ ప్రజాసేవ- ప్రజాజీవితం అనే ముసుగు తగిలించుకుంటున్నాడు. అనతికాలంలోనే అడ్డగోలుగా సంపాదించేసి కోటీశ్వరుడు అయిపోవాలని కలగనే వారికి రాజకీయం ఒక్కటే దారిగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో.. ఉన్నంతలో మంచివారిని ఎంచుకోగలమే తప్ప.. నూటికి నూరుశాతం తుల్యమైన సచ్ఛీలుడు, నిజాయితీ పరుడైన నాయకుడు దొరకడం ఏ స్థాయిలోనైనా కష్టం. 

అందుకే నాయకుడన్నాక అన్నింటికంటె ముందు ప్రజల నమ్మకం సంపాదించాలి. ఉప్పులేని కూర ఎంత చెత్తగా ఉంటుందో, ప్రజల నమ్మకం పొందలేని రాజకీయం అంత నీచంగా ఉంటుంది! ప్రజాజీవితానికి అదే పునాది. అధికార హర్మ్యాలన్నీ నిర్మితమయ్యేది ఆ పునాది మీదనే.

అయితే ఇప్పుడు కలుగుతున్న సందేహం ఏంటంటే.. రికార్డు స్థాయి గణాంకాల పాదయాత్ర చేయాలని ఏకబిగిన నడుస్తున్న నారా లోకేష్ ఆ నమ్మకాన్ని సంపాదించారా? ప్రజలు ఆయన మాటలు నమ్ముతున్నారా? అసలు నమ్మకం పుట్టించేలా ఆయన ఏమాటలైనా చెప్పగలుగుతున్నారా? ఆయన యాత్రలో ప్రజల నమ్మకం ఉందా? లోకేష్ యాత్రలో ఉప్పు ఉందా? నిస్సారంగా సాగుతున్న లోకేష్ యాత్ర మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ!

ప్రజానాయకుడికి అన్నింటికంటె ముఖ్యం ప్రజల్లో నమ్మకం. నాయకుడు కాగోరిన వాడు.. ఎన్నికష్ట నష్టాలు వచ్చినా తమ కోసం నిలబడతాడనే నమ్మకం, పోరాడాల్సి వస్తే తనే ముందుంటాడనే నమ్మకం, తమనుంచి ఆశించేవాడు కాదు- తమకోసం ఏం చేయాలో ఆ తపనతో బతికేవాడు అనే నమ్మకం.. ఈ నమ్మకం ఉన్నప్పుడు నాయకుడిగా ఎవ్వరికైనా సరే గుర్తింపు లభిస్తుంది. ప్రజల ఓట్లు రావడం వలన ‘నాయకుడు’ అయిన వాళ్లు మనకు తక్కువగా ఉంటారు. పైన చెప్పినట్టుగా ముందు ఈ నమ్మకాన్ని సంపాదిస్తే.. ఆటోమేటిగ్గా అలాంటి వారికే ఓట్లు దక్కుతాయి. అంటే, రాజకీయ అధికారానికి కూడా ప్రజల నమ్మకమే పునాది. 

చంద్రబాబునాయుడు ఎటూ వార్ధక్యంలో పడిపోయాడు గనుక.. లాస్ట్ చాన్స్ అంటూ తన దౌర్బల్యాన్ని తానే ప్రజల ముందు చాటుకుంటున్నాడు గనుక.. ఈ సమయంలోనే పార్టీ మీద పెత్తనం అప్రకటితంగా తీసుకున్నట్టే.. అధికార పగ్గాలు కూడా తీసుకుని ‘వారసుడు సీఎం’ అయిపోవాలనే కలతో.. రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్న దురాశపరుడు నారా లోకేష్. ఈ మాటను ఆయనకు వాడడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. తన స్థాయికి తగని వాటి మీద ఎవ్వరు ఆశపడినా, ఆశపడే వాటికి తగిన కష్టం చేయలేని వాడెవడైనా దురాశపరుడు అనాల్సిందే. 

నారా లోకేష్ పాదయాత్ర ముమ్మరంగా సాగుతోంది. యాత్ర రోజు వారీ టార్గెట్ ప్రకారం కిలోమీటర్లను పూర్తి చేయడమైతే జరుగుతోంది. ఆయన ఆల్రెడీ 500 కిలోమీటర్లు పూర్తిచేశారు. ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మంచిదే. కానీ.. ఇంత పొడవున సాగించిన యాత్రలో ఎంత మేర ప్రజల నమ్మకాన్ని ఆయన చూరగొన్నారు. దానిని కొలబద్ధ పెట్టి కొలవడం కష్టం.  కానీ.. ప్రజల నమ్మకాన్ని పొందగలిగేలా ఆయన ఏం చెప్పారు? ప్రజల నమ్మకం పొందడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు? అనే అంశాలను మనం పరిశీలింవచ్చు. 500 కిలోమీటర్ల పొడవైన పాదయాత్ర  అనేది చిన్న సంగతేమీ కాదు. ఇప్పటిదాకా చెప్పని విషయాలను ఆయన మిగిలిన మూడున్నర వేల కిలోమీటర్ల యాత్రలో చెప్తారని ఆశించడం కూడా భ్రమ. అందుకే ఆయన చెప్పిన మాటలను మనం గమనిస్తే.. చాలు.. కనీసం ప్రజల నమ్మకాన్ని పొందడానికి కూడా ప్రయత్నించడం లేదనే సంగతి మనకు బోధపడుతుంది. 

నారా లోకేష్ యాత్ర మొత్తం.. కేవలం నిందల యాత్రగానే సాగుతున్నది తప్ప.. నిజాల యాత్రగా సాగడం లేదు. కనీసం వరాల యాత్రగా కూడా సాగడం లేదు. లోకేష్ మాటలను కాస్త లోతుగా గమనించే ఎవ్వరికైనా సరే.. ఆయన ఎంత అర్థంలేని, పసలేని, పనికిరాని మాటలతో కాలయాపన చేస్తున్నారో అర్థమవుతుంది. ఇలాంటిమాటలు చెప్పడానికి ప్రజల్లో పాదయాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా కూడా ప్రజలు ఆదరిస్తారని అనుకోవడం భ్రమ. లోకేష్ ఈ సుదీర్ఘ యాత్రలో చెబుతున్న సంగతులు/ వేస్తున్న నిందలను ఒక్కటొక్కటిగా గమనిద్దాం. అదే విషయంలో ఆయన ఏం చెప్పి ప్రజలను ఆకట్టుకుని ఉండవచ్చో కూడా గమనిద్దాం. మచ్చుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

మద్యనిషేధం

మద్యనిషేధం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారనేది లోకేష్ చేసే ప్రతి ఊరిలోనూ వినిపించే ప్రధాన ఆరోపణల్లో ఒకటి. సంపూర్ణ మద్యనిషేధం తెస్తానని చెప్పి మడమ తిప్పి, ఆడపడచుల తాళిబొట్లు తెంచుతున్నాడని చినబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆడపడచుల ఉసురు పోసుకుంటున్నాడని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఆడపడచుల తాళిబొట్లే తెంచుతున్నాడో, ఉసురే పోసుకుంటున్నాడో.. ప్రతి ఆడపడుచుకు తెలుసు. 

జగన్ ఫెయిలయ్యాడని ఇంతగా నిందలేస్తున్న లోకేష్.. తమ ప్రభుత్వం వస్తే.. సంపూర్ణ మద్యనిషేధం అమల్లోకి తెస్తాం అనే మాట చెప్పవచ్చు కదా. ఆయనకు ఆ దమ్ముందా? జగన్ చాలా స్పష్టంగా దశలవారీగా మాత్రమే రాష్ట్రంలో నిషేధం అమల్లోకి తెస్తాం అని అన్నారు. తెలుగుదేశం హయాంలో ఉన్న దుకాణాల సంఖ్య కంటె ఇప్పుడు సంఖ్య బాగా తగ్గించారు. ధరలు పెంచడం వలన ప్రభుత్వానికి ఎక్సైజు ఆదాయం పెరిగిందే తప్ప, వినియోగం పెరిగి కాదు. 

నిషేధం విషయంలో తాము ఏం చేస్తామో చెప్పకుండా, ఆడపడచుల తాళి బొట్లు తెగకుండా తాము ఏం చేస్తామో చెప్పకుండా.. జగన్ మీద నింద వేయడం వరకు మాత్రమే లోకేష్ పరిమితం అవుతున్నాడు. ఇలా చేస్తోంటే.. ప్రజలు ఆయనను ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి?

చేనేతకు జీఎస్టీ!

ఏ రోటి కాడకు వెళ్తే ఆ రోటి పాట పాడడం.. రాజకీయ నాయకులకు మామూలే. అది తప్పు కాదు కానీ.. అందులో ఔచిత్య భంగం లేకుండా జాగ్రత్త పడాలి. చేనేతి కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతానికి వెళ్లగానే.. నారా లోకేష్ కు ఆ రంగానికి వరాలు కురిపించాలని పూనకం వచ్చేసింది. చేనేత రంగానికి కేంద్రం ఇటీవలి కాలంలో జీఎస్టీ విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ రంగానికి చెందిన వారంతా కుయ్యోమొర్రో అని మొత్తుకున్నా కేంద్రం పట్టించుకోలేదు. తెలుగుదేశం కూడా నోరు మెదపలేదు. 

కానీ.. ఆ వర్గం మనుషులు కనిపించేసరికి.. పాదయాత్రలో ఉన్న లోకేష్ బాబులోని లౌక్యం బయటకు వచ్చేసింది. వారిని మభ్యపెట్టాలనే టేలెంటును ఆయన బయటకు తీశారు. తాము అధికారంలోకి వస్తే.. చేనేత రంగానికి జీఎస్టీ తొలగించడం గురించి కేంద్రంతో మాట్లాడి ప్రయత్నం చేస్తామని వారికి వాగ్దానం చేసేశారు. కుదరకపోతే ప్రభుత్వం తరఫున జీఎస్టీ చెల్లించేస్తామంటూ ఆచరణ సాధ్యం కాని ప్రగల్భాలు పలికారు.  జీఎస్టీ విషయంలో లోకేష్ కాదు కదా.. చంద్రబాబు చెప్పినా సరే.. ఒకవేళ ఆయన సీఎం అయినా సరే.. చేనేత వంటి దేశవ్యాప్తంగా వర్తించే రంగం విషయంలో కేంద్రం పట్టించుకోవడం అనేది కల్లమాట. కేవలం ఆ రంగం ప్రజలు కళ్ల ఎదుట కనిపించగానే వారిని మోసగించేలా ఏదో ఒక మాట చెప్పడానికి  లోకేష్ ఇలా అన్నారు తప్ప మరొకటి కాదు. 

చేనేత రంగం గురించి చినబాబుకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే గనుక.. చేనేత రంగానికి జీఎస్టీని కేంద్రం తొలగించకపోయినా సరే.. రాష్ట్ర వాటాకు వచ్చే జీఎస్టీ మొత్తాలను తిరిగి చేనేత రంగానికే ఇచ్చేస్తామని ప్రకటించవచ్చు. అలాంటిదేమీ చేయలేదు. మాటవరసకైనా తమ ప్రభుత్వం వస్తే ఏం ఒరగబెడతామో చెప్పలేదు. ఇక ఆ రంగం లోకేష్ ను ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి?

లోకేష్ లోని అమానవీయతకు దర్పణం..

నాయకుడు కాగోరే వ్యక్తికి కాస్త మానవత్వం కూడా ఉండాలి. చంద్రబాబునాయుడే కరడుగట్టిన క్రూకెడ్ రాజకీయ నాయకుడు అని అందరూ అంటూ ఉంటారు. నారా లోకేష్ తండ్రి కంటె తాను రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంటున్నాడు. తనలో అధికార లాలసుడైన రాజకీయ నాయకుడే తప్ప మరో కోణం లేనే లేదని ఆయన చాటుకుంటున్నారు. 

పాపం.. నందమూరి తారకరత్న లోకేష్ పాదయాత్రకు ఒక హైప్ తీసుకురావడం కోసం, ఫ్లేవర్ తీసుకురావడం కోసం కుప్పం దాకా కష్టపడి వచ్చారు. యాత్రలో నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోయాడు. 24 రోజులు విధితో పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు. తనకోసం వచ్చి.. తన వెంట నిలిచిన వ్యక్తి, కుటుంబసభ్యుడు ఇంత దారుణంగా చనిపోతే.. వెళ్లి మృతదేహాన్ని చూడడానికి గానీ, అంత్యక్రియల్లో పాల్గొనడానికి గానీ, కుటుంబాన్ని నేరులో పరామర్శించడానికి గానీ.. లోకేష్ కు ఖాళీ లేకపోవడం అనేది అమానవీయం. ఇంతకంటె నీచమైన క్రూకెడ్ వ్యవహారం మరొకటి ఉండదు. బ్రేక్ తీసుకోకుండా పాదయాత్ర చేయడం అనేది ఏదో అద్భుతం అని, భూమిని బద్ధలు కొట్టే రికార్డులను ఆ రకంగా తాను సృష్టిస్తానని లోకేష్ కలగంటున్నట్టుగా ఉంది. ఇంత మానవత్వం లేకుండా తారకరత్న విషయంలో ఇలా వ్యవహరించారేమిటా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

పార్టీ ఎమ్మెల్సీ, పార్టీకోసం పనిచేసిన నాయకుడు బచ్చుల అర్జునుడు కూడా చనిపోయారు. భావి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న నారా లోకేష్ కనీసం చావులకు వెళ్లి పరామర్శించలేరా? చంద్రబాబు వెళ్లారు సరే.. కానీ లోకేష్ కు ఆ బాధ్యత లేదా? కానీ వెళ్లలేదు. 

సొంత పార్టీ వారు, సొంత కుటుంబసభ్యులు చచ్చిపోతే కూడా వెచ్చించడానికి సమయంలేకుండా ఆయన పాదయాత్ర చేసి ఏం సాధిస్తారు. వారి మీద ఆ మాత్రం ప్రేమ లేని వ్యక్తికి, ప్రజల మీద మాత్రం ఎందుకు ఉంటుంది? వారిని ప్రేమించి, వారికోసం నిష్కల్మషంగా పనిచేస్తారని నమ్మడం ఎలాగ? ప్రజలు ఎందుకు నమ్మాలి?

రికార్డులకోసమే నడకా?

ఇలాంటి వ్యవహారాలు చూసినప్పుడే.. నారా లోకేష్ రికార్డులు కోసం నడుస్తున్నారు తప్ప.. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి , వారి కన్నీళ్లు తుడవడానికి నడవడం లేదని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 3800 కిలోమీటర్ల పైచిలుకు చేసిన పాదయాత్రతో గతంలో ఎన్నడూ లేని రికార్డును సృష్టించారు. జగన్ రికార్డును బద్దలు కొట్టాలని లోకేష్ కంకణం కట్టుకున్నారు. తాను 4000 కిలోమీటర్ల పాదయాత్రకు స్కెచ్ వేశారు. ఆ ఒక్క రికార్డు మీద లోకేష్ కు దృష్టి ఉన్నదే తప్ప.. ప్రజల బాధలు పట్టడం లేదు. 

వారిలో నమ్మకం కలిగించడానికి తాను ప్రయత్నించాలని, తన ప్రతి మాట కూడా.. జగన్ పట్ల ప్రజల్లో ద్వేష బీజాలు నాటడానికి కాదు, తెలుగుదేశం పట్ల ప్రజల్లో విశ్వాస బీజాలు నాటడానికి ఉపయోగపడాలనే స్పృహ లోకేష్ కు కలగడం లేదు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్ముతారు?

తప్పు లెన్నడమే తప్ప..

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల రూపేణా కావొచ్చు, ఇతర నవ్యపథకాల రూపేణా కావొచ్చు.. మొత్తానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటోంది. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. అయితే పథకాల అమలులో ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట కొన్ని లోటుపాట్లు లొసుగులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లడమే మంచి పాలకులు చేయాల్సిన పని. ప్రస్తుతం అదే జరుగుతోంది. అయితే ఏవైనా లొసుగులు బయటకు రాగానే.. వాటిని భూతద్దంలో చూపిస్తూ రాద్ధాంతం చేయడం లోకేష్ తన నైజంగా మార్చుకున్నారు. ఆయన ప్రవచించే తప్పులేవీ.. నిజమైన తప్పులుగా ఉండవు. ఆయన సంకుచిత దృష్టి కోణానికి నిదర్శనాలుగా మాత్రమే ఉంటాయి. 

పోనీ ఇంతలావు యాత్ర చేస్తున్నారు.. తాను కొత్తగా ప్రజలకు ఎలాంటి వరాలు ప్రకటిస్తున్నారు? అని వెతికినా మనకు ఒక్క మాట కనిపించదు. ఊరూరా స్థానిక నాయకుల మీద నిందలు వేయడం, జనాంతికంగా జగన్ ను తూర్పారపట్టడం… ఇవే లక్ష్యాలుగా పాదయాత్ర సాగుతోంది. ప్రజల్లో నమ్మకం పొందలేకపోవడం అనేది.. కూరలో ఉప్పులేకపోవడం అంత ఘోరమైన వ్యవహారం. ఆ కూర ఎలా రంజింపజేయదో.. ఆ యాత్ర కూడా అలాగే ప్రయోజనం కలిగించదు. 

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?