తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు షెడ్యూలు ప్రకారం డిసెంబరులో మాత్రమే జరుగుతాయని, ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవలి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విస్పష్టంగా ప్రకటించారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. అనేతరహా సిద్ధాంతం రాజకీయాలకు కూడా వర్తిస్తుందని, బయటకు చెప్పే మాటలకు, తీసుకునే నిర్ణయాలకు పొంతన ఉండదని కొందరు భావిస్తున్నారు.
ప్రత్యేకించి జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఇలాంటి సంకేతాలు ఇస్తోంది. రెండు నెలల్లోగా నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నాయకులందరూ కలిసి కార్యకర్తలు, శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయాలని అనడం.. ఖచ్చితంగా యుద్ధ సన్నాహమే.
తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుకు వెళ్లడం అనేది కేసీఆర్ కు అవసరం అనే అంచనాలు ఉన్నాయి. భారాస పెట్టిన తర్వాత.. వచ్చే ఏడాది ఏప్రిల్ ప్రాంతంలో జరిగే జాతీయస్థాయి సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలంటే.. అందుకు ఆయన చాలా సమయం వెచ్చించాలి. కేవలం భారాసను సిద్ధం చేయడం మాత్రమే కాకుండా జాతీయ స్థాయి ఇతర పార్టీలతో మంతనాలు, బేరసారాలు లాంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. డిసెంబరు దాకా అసెంబ్లీ ఎన్నికలు జరగకపోతే ఆ తర్వాత కేసీఆర్ కు జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టడానికి కేవలం నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంటుంది. అది చాలదు.
పార్టీ సారథ్య బాధ్యతలను, ఇంచుమించుగా ప్రభుత్వాధికార బాధ్యతలను ఎంతగా ఆయన కొడుకు తారక రామారావు చేతుల్లో పెట్టేసినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఆయన తెలంగాణ పర్వంతోనే ‘లాక్’ అయిపోతారన్న మాట నిజం.
అదే సమయంలో ఎన్నికల సంఘం తమకు ఉన్న వెసులుబాటును వాడుకుని, డిసెంబరులో జరగాల్సి ఉన్న ఎన్నికలను ఒకటిరెండు నెలలు వెనుకకు నెట్టిందంటే గనుక.. కేసీఆర్ పుట్టి మునుగుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్ కు శ్రేయస్కరం అవుతుంది.
ఆయన బహిరంగ ప్రకటనల్లో అలాంటిదేం లేదంటున్నారు గానీ.. కేటీఆర్ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం గమనిస్తోంటే.. ముందస్తు ఎన్నికలు తప్పవేమో అనే అభిప్రాయం కలుగుతోంది. ఇతర పార్టీల నుంచి చేరికల మీద కన్నేసిన బిజెపి, తమ సొంత పార్టీలోనే ముఠా కుమ్ములాటలను సర్దుకోలేకుండా సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈలోగా ఏమేరకు సన్నద్ధం అవుతాయో చూడాలి.