వ‌లస‌గానం

స‌ముద్రం చూడాలంటే, నువ్వే వెళ్లాలి. అది నీ ద‌గ్గ‌రికి రాదు. అల‌ల అందం ఆస్వాదించాల‌ని అనుకుంటే తుపానును కూడా ఎదుర్కోవాలి. ఒడ్డున ఉన్న ఓడ సుర‌క్షిత‌మే. అయితే ల‌క్ష్యం అది కాదు. ప్ర‌వాహ వేగ‌మే…

స‌ముద్రం చూడాలంటే, నువ్వే వెళ్లాలి. అది నీ ద‌గ్గ‌రికి రాదు. అల‌ల అందం ఆస్వాదించాల‌ని అనుకుంటే తుపానును కూడా ఎదుర్కోవాలి. ఒడ్డున ఉన్న ఓడ సుర‌క్షిత‌మే. అయితే ల‌క్ష్యం అది కాదు. ప్ర‌వాహ వేగ‌మే ప‌డ‌వ జీవన ప్ర‌యాణం. సునామీలో లంగ‌ర్ వేయ‌డం మూర్ఖ‌త్వం.

ఒక స్నేహితుడితో విడిపోవాల్సిన సంద‌ర్భం, శ‌త్రువుతో చేతులు క‌లిపే అనివార్య‌త‌, ఇదే జీవితం. వేగం గురించి న‌త్త ఉప‌న్య‌సించ‌డ‌మే ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌.

పేడ పురుగుని ఈస‌డించుకోకు, అది భూమిని శుభ్రం చేసే ప‌నిలో వుంది. తోడేళ్ల గుంపు అహింసా దీక్ష‌లో వుండ‌డ‌మే రాజ‌కీయం. మ‌ట‌న్ బిర్యానీ త‌యారీ తెలుసుకుంటే అది గొర్రెల అమాయ‌క‌త్వం.

ఎంత గొప్ప‌వాడైనా ఒక‌రోజు గోడ‌కు ఫొటో కావాల్సిందే. మ‌నుషులంతా జ్ఞాప‌కాల్లోనూ, అల్బ‌మ్‌లోనూ మిగిలిపోతారు. వాయు వేగం గురించి గాలిమ‌ర‌కి వివ‌రించ‌డ‌మే ఆధునిక‌త‌.

నీడ‌లు కూడా మోసం చేసే కాలంలో జీవిస్తున్నాం. మోహం, ద్రోహం క‌వ‌ల పిల్ల‌లు. రైలు రాని స్టేష‌న్‌లో ఎన్నాళ్లు ఎదురు చూస్తావ్‌. బొగ్గు ఇంజ‌న్ ఒక పొగ లాంటి జ్ఞాప‌కం.

గాలానికి దొరికే చేప కూడా గుడ్ మార్నింగ్ అనుకునే నిద్ర లేస్తుంది. సూర్య‌చంద్రులు నీ కోసం రారు. ప‌సిపిల్ల‌ల న‌వ్వులు చూడ్డానికి వ‌స్తారు. గంధ‌పు చెక్క‌ని నువ్వెంత యాత‌న పెట్టినా సువాస‌నే ఇస్తుంది.

ఆత్మ‌ని అమ్ముకున్న వాడు ఆత్మ జ్ఞానాన్ని బోధించ‌డ‌మే ఆధ్మాత్మిక‌త‌. నిద్ర‌పోయే ప్ర‌తివాడికీ క‌ల‌లు రావు. అంద‌మైన క‌ల‌లు వ‌చ్చినా గుర్తుండ‌వు.

న‌దిలో తేలే ప‌డ‌వ ఒక‌ప్పుడు ఆకు ప‌చ్చ‌ని చెట్టు. వాన నీటి కోసం ఎదురు చూసిన చ‌కోర ప‌క్షి. ఇప్పుడు తానే క‌రిగి నీరై పోయింది.

ఎడారిలో బ‌తికే వాడికి మ‌ట్టి ర‌హ‌స్యం తెలుసు. క‌న్ను చేసే క‌ప‌ట‌త్వ‌మే ఎండ‌మావి. గుంపుని విడిపోయిన చీమ ఏకాకిగా మ‌ర‌ణిస్తుంది.

నాగ‌లికి న‌మ‌స్క‌రించు. యుగాలుగా అది మ‌న క‌డుపు నింపుతోంది. గేదెల‌కి పాల ప్యాకెట్లు అమ్మే వ్యాపారులొచ్చారు. కొంచెం భ‌ద్రం.

భిక్ష‌గాడి పాట గాలిలో తేలుతోంది. స్వ‌రం, రాగం, తాళం అన్నీ ఆక‌లే క‌దా! స‌త్యం ఉన్న మాట నిజ‌మే, అది వెయ్యి అబ‌ద్ధాల అడుగున అణ‌గారిపోయింది వుంది. అద్భుతాలు నీ చుట్టూ వుంటాయి. గుర్తు ప‌ట్టే క‌న్ను వుండాలి.

తుపాకి త‌యారు చేసేవాడికి తాను ఎవ‌రి మ‌ర‌ణ‌శాస‌నం లిఖిస్తున్నాడో తెలియ‌దు. మృత్యువుకి ఉన్న అనేక మారుపేర్ల‌లో తూటా ఒక‌టి.

శ్వాస ఆగితే చ‌క్ర‌వ‌ర్తి నుంచి వ‌చ్చేది కూడా కంపే. నీలో క‌ళ లేక‌పోతే వాయిద్యం ఒక ఎండిపోయిన చ‌ర్మం మాత్ర‌మే. రైల్లో నువ్వు కూచున్న‌ప్పుడు జీవం లేనివ‌న్నీ ప‌రిగెడుతూ వుంటాయి.

నువ్వెంత కాలం ఎదురు చూసినా వ‌చ్చేవి దెయ్యాలే త‌ప్ప దేవ‌దూత‌లు కాదు. స‌ముద్రంలో ఉన్న ముత్యం కూడా మ‌నిషి తాకితే అంగ‌డి స‌రుకే.

మ‌ల్లెపువ్వు ఒక రోజు బ‌తికినా ప‌రిస‌రాల్ని ప‌రిమ‌ళం చేస్తుంది. వేటాడే పులికి వెన్నెల అక్క‌ర్లేదు.

ఈ కాలం పిల్ల‌లంతా సైబీరియా ప‌క్షులే. వ‌ల‌సే జీవ‌న విధానం. వీడియోల్లోనే క‌నిపిస్తారు, వినిపిస్తారు. స్ప‌ర్శ లేని వీక్ష‌ణం. బ‌ట్ట‌ల్ని మిష‌న్లో వేసిన‌ట్టు, జ్ఞాప‌కాల్ని కూడా ఉతుక్కుంటూ వుండాలి.

-జీఆర్ మ‌హ‌ర్షి

One Reply to “వ‌లస‌గానం”

Comments are closed.