ముందే బిగించిన తాడు మునుగోడు..!?

నిశ్చితార్థమే, పెళ్ళిని మించి పోయినట్లుంది వరస. ఊపు చూస్తుంటే, ఉప ఎన్నిక, ఎన్నికను మించి పోయేటట్లుంది. ఉత్తనే వచ్చే ఎన్నికకు ఇంత హడావిడి వుండదు. ఎవరయినా కాలం చేస్తే వచ్చే ఉప ఎన్నిక అలాగే…

నిశ్చితార్థమే, పెళ్ళిని మించి పోయినట్లుంది వరస. ఊపు చూస్తుంటే, ఉప ఎన్నిక, ఎన్నికను మించి పోయేటట్లుంది. ఉత్తనే వచ్చే ఎన్నికకు ఇంత హడావిడి వుండదు. ఎవరయినా కాలం చేస్తే వచ్చే ఉప ఎన్నిక అలాగే దానంతటదే వస్తుంది. ఎప్పుడో కానీ, అలాంటి ఉప ఎన్నిక ఉత్కంఠ కలిగించదు. కానీ పథకం ప్రకారం తెచ్చి పెట్టుకున్న మాత్రం కుదిపి పారేస్తుంది. తెలంగాణ లోని మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గానికి జరగబోయే ఉపఎన్నిక అలాంటిదే.

ముహూర్తం పెట్టుకుని మరీ ‘సిజేరియన్‌ డెలివరీ’కి  డేట్‌ అడిగినట్లు, అదను చూసుకుని మునుగోడు ఉప ఎన్నికను నిర్ణయిస్తున్నట్టున్నారు. ఈ పని బీజేపీ వ్మూహకర్తలు చేశారు. ఇలా చెయ్యాలంటే వారికో పధ్ధతి వుంటుంది. ముందుగా పక్క పార్టీలో వున్న ఒక శాసన సభ్యుణ్లో, పార్లమెంటు సభ్యుణ్ణో ఒకరిని ఆకర్షించటం, ఆ తర్వాత అతణ్ణి పదవికీ, పార్టీకీ రాజీనామా చెయ్యించటం. ఇంతే. అప్పుడు ఉప ఎన్నిక వచ్చి పడుతుంది. ఈ పని ఇంతకు ముందు ఇదే బీజేపీ, టీఆర్‌ఎస్‌ లోవున్న ఈటల రాజేందర్‌ తో చేయించింది. ఆయన ఇలాగే పార్టీకీ, పదవికీ రాజీనామాలకు విసిరేసి, బీజేపీలోకి వచ్చారు. దాంతో ఆయన ప్రాతినిథ్యం వహించే హుజూరాబాద్‌ కు ఉపఎన్నిక వచ్చిపడిరది. భీకర పోరు జరిగింది. బీజేపీ పార్టీ మీద మళ్ళీ రాజేందరే అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈ విజయం తెలంగాణలో బీజేపీకి విశేష ప్రచారాన్ని తెచ్చి పెట్టింది.

ఇప్పుడూ టెక్నిక్‌ మార లేదు. కాకుంటే ఈ సారి బీజేపీ టీఆర్‌ఎస్‌ లో కాకుండా, కాంగ్రెస్‌ లో వేలు పెట్టింది. మునుగోడు నుంచి 2018 ఎన్నికల్లో గెలుపొందిన కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి చేత ముందు పార్టీకీ, తర్వాత ఎమ్మెల్యే పదవికీ రంగాన్ని బీజేపీ సిధ్ధం చేసింది. ఒక ఉప ఎన్నికను మీదకు తెచ్చింది. కానీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అధికార పక్షానికి చెందిన వాడయితే ఆ కిక్కు వేరుగా వుండేది. అసలు కాంగ్రెస్‌ వున్న శాసన సభ్యుల సంఖ్యే తక్కువ. అందులో ఒకరిని తమ వైపు తిప్పుకోవటమంటే, అదేమీ విశేషం కాదు కదా! కానీ విశేషమే. ఈ ఎన్నికలో మళ్ళీ అదే రాజగోపాలరెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కాకుండా, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి, గెలిస్తే, ఇది ఈటల రాజేందర్‌ గెలుపుకున్నా గొప్పగా వుంటుంది.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక  బీజేపీని టీఆర్‌ఎస్‌ పై విజయం సాధించిన పార్టీగా మాత్రమే నిలబెట్టింది. కానీ మునుగోడులో విజయం సాధిస్తే, బీజేపీకి రెండు ప్రయోజనాలు సిధ్ధిస్తాయి. ఒకటి: బీజేపీ ఓడిన ర‌చ్చ‌గెల‌వ‌డం, రెండు: టీఆర్‌ఎస్‌ను ఢీ కొనగలిగింది ఒక్క బీజేపీ యే కానీ, కాంగ్రెస్‌ ఏమాత్రం కాదు అని నిరూపించటం.

ఒక పక్కన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది దూరంలో మాత్రమే వున్నాయి. అలాంటిది మళ్ళీ ఇప్పుటి ఉప ఎన్నిక వల్ల, ఎన్నికయిన శాసన సభ్యుడి పదవీ కాలం కూడా ఏడాదే. కాబట్టే పదవి పరంగా గెలిచిన అభ్యర్థికి ఒరిగేదేమీ వుండదు. కాబట్టి ఈ ఉప ఎన్నిక ఉత్సాహం రాజీనామా చేస్తున్న శాసన సభ్యుడిది కాదు. పూర్తిగా పార్టీదే. అంటే బీజేపీదే. నిజం చెప్పాలంటే ఇది వ్యూహం కూడాను.

రాష్ట్రంలో ఒకప్పుడు ఈ ‘ఉప ఎన్నిక’ ను ఉద్యమ వ్యూహంగా వాడేవారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర విభజనకు కాస్త ముందు, టీఆర్‌ఎస్‌ సహా ఇతర పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రత్యేక తెలంగాణ కోసం వత్తిడి పెంచటానికి వినియోగించుకునేవి. సిట్టింగ్‌ శాసన సభ్యులతో రాజీనామా చేయించి, తిరిగి వారే ఎన్నికయ్యేలా చూసేవారు. అందుకు ఇతర తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సంస్థలు కూడా సహకరించేవి. నాటి ‘ఉద్యమ రాజకీయ’ వ్యూహాన్ని, బీజేపీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో ‘అధికార రాజకీయ వ్యూహం’ గా వినియోగిస్తున్నది.

ఈ వ్యూహం ఇటు కాంగ్రెస్‌కూ, అటూ టీఆర్‌ఎస్‌కూ విషమ పరీక్షే. కాంగ్రెస్‌ విషయంలో అయితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే అయ్యింది. ఎందుకంటే, ఆ పార్టీ 2018 ఎన్నికల్లో గెలిచన సీట్లే తక్కువ. ఆ కొద్దిలోనూ ఎక్కువ మంది  ‘గులాబీ ఆకర్ష్‌’ కారణంగా టీఆర్‌ఎస్‌ వైపు వెళ్ళారు. అలా బలహీనమయిన పార్టీని బలోపేతం చేసే పేరు మీద, పార్టీ అధ్యక్షణ్ణి మార్చారు. ఆస్థానంలోకి రేవంత్‌ రెడ్డి వచ్చారు. శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చినా, ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల ఫలితాల్లో అది కనిపించటం లేదు. అందుకు దుబ్బాక ఉప ఎన్నిక కూడా ఉదాహరణే. దాంతో తెలంగాణ లో కాంగ్రెస్‌ కోటల్ని కూల్చినట్టు, ఒక్కొక్క రాజకీయ కుటుంబాన్నీ, బీజేపీ తన ఖాతాలో వేసుకుంటోంది. 

పాత మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి డి.కె. అరుణ, నిజమాబాద్‌ నుంచి డి. శ్రీనివాస్‌ తనయుడు అరవింద్‌ ఇప్పటికే బీజేపీలో ప్రకాశిస్తున్నారు. ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి కోమటి రెడ్డి కుటుంబాన్ని కాషాయపార్టీ గురిపెట్టింది కోమటిరెడ్డి సోదరులు ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ పార్టీ అత్యంత విధేయంగా వుంటూ వచ్చారు. రాజగోపాల్‌ రెడ్డి మునుగోడు శాసన సభ్యుడిగా, అలాగే ఆయన సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా వుంటున్నారు. ఇందులో రాజగోపాలరెడ్డి వెళ్ళినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ తోనే వుంటున్నారు.

ఈ సంకట స్థితినుంచి కాంగ్రెస్‌ బయటి పడటానికి ప్రయత్నించటానికి బదులు, దానిని మరింత జటిలం చేసుకుంటోంది. కాంగ్రెస్‌ ను వీడుతున్న రాజగోపాల రెడ్డిని నిందించ బోయి, కోమటి రెడ్డి సోదరులను కలిపి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి విమర్శిస్తున్నారు. దీంతో వెంకటరెడ్డి కూడా నొచ్చుకున్నారు.

ఇదిలా వుంటే, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ బీజేపీ వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని నిర్ణయించుకోవటానికి తాపత్రయపడుతోంది. మరీ ముఖ్యంగా మునుగోడు నుంచి ఎవరిని నిలబెట్టాలనే  విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఇది మాత్రమే సరిపోదు. ఎన్ని పార్టీలు తెలంగాణ బరిలోకి వస్తే, అంతగా ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలుతుందన్న భరోసా ఇక మీదట టీఆర్‌ఎస్‌ కు వుండబోదు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఏకైక ప్రత్యామ్నయి కూర్చోవటానికి అన్ని పావులూ కదుపుతోంది. కేసీఆర్‌ ప్రతి వ్యూహం ఎలా వుంటుందో మరి..!?  

సతీష్ చందర్