ఆకర్షణ.. మనిషికి ఉండే సహజమైన లక్షణాల్లో ఇదీ ఒకటి. దేనికైనా ఆకర్షితులు అవుతారు, అవతలి వారిని ఆకర్షించనూ గలరు! ఇది మనుషులకు ఉండే శక్తియుక్తుల్లో ఒకటి. అయితే ఇది ఎంత సహజమే.. ఇదే సమయంలో దీని కోసం ప్రత్యేకంగా అలవరుచుకోవాల్సిన అంశాలూ కొన్ని ఉంటాయి. కొందరు తమ ప్రమేయం లేకుండానే అందరినీ ఆకట్టుకుంటారు, ఆకర్షించేస్తారు! మరి కొందరు మాత్రం ప్రయత్నించి ఈ విషయంలో విఫలం అవుతూ ఉంటారు. ఈ టాపిక్ ఎడ తెగనిది కూడా!
ప్రేమ విషయంలోనో, స్నేహం కోసమో.. మనుషులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. శృంగారానికి కూడా ఆకర్షణ అనేది ఒక సహజమైన కీ. సంబంధబాంధవ్యాలు సరిగా కొనసాగాలన్నా.. ఆకర్షణ ప్రమేయం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇలా మనిషికి ఆకర్షించగలగడం కూడా ఒక కీలకమైన అర్హత. మరి సహజంగానే.. అవతలి వారిని, అవసరమైన అన్ని అంశాల్లోనూ కట్టిపడేయగలిగే వారికి ఇదో సమస్యే కాదు! అయితే.. ఆకర్షించడం విషయంలో కొందరు కొన్ని మార్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి. వాటి గురించి సైకాలజిస్టులు అధ్యయనాలు చేస్తూనే ఉంటారు. అలాంటి అధ్యయనాలు చెప్పే అంశాల్లో ఇవి కీలకమైనవి.
కాన్ఫిడెంట్ మేనరిజమ్స్!
మనుషుల్లో ఆకర్షణీయమైనవి.. శారీరకమైన రంగు, పొంగులు మాత్రమే కావు. ఇవి ఉన్నా.. లేకపోయినా.. కాన్ఫిడెంట్ గా కనిపించకపోవడం మైనస్ పాయింటే. మిగతా అంశాలు ఎలా ఉన్నా.. కాన్ఫిడెంట్ గా కదిలితే మాత్రం అవతలి వారిని మీరు ఎంతో కొంత ఆకట్టుకోగలరు.
ఇది ప్రజెన్స్ లో మాత్రమే కాదు, మాటలు ఆలోచనా తీరులో కూడా విశ్వాసం ఎంతో కీలకమైనది. ఈ కాన్ఫిడెన్స్ మీరంటే ఎవరో తెలియనివారిని, మీరంటే తెలిసిన వారిని కూడా ఆకట్టుకునేలా చేస్తుంది.
తగిన మోతాదులో నిద్రపొండి!
నిద్రమొహాలు ఎవరినీ ఆకట్టుకోవేమో కానీ, తగినంత నిద్రను కలిగిన ఫేస్ లు మాత్రం గ్లో తో ఎవరినైనా ఆకర్షిస్తాయి. మొహంలో చార్మింగ్ ఉండాలంటే.. ముందు రోజు నిద్ర చాలా ముఖ్యమైన అంశం. అవసరమైన మేరకు రాత్రిపూట కనీసం ఆరేడు గంటల నిద్రపోతే.. మరుసటి రోజు మీ మొహంలో వర్చస్సు ఉంటుంది. అది అవతలి వారిని సులువుగా ఆకట్టుకుంటుంది.
ప్రశాంతంగా కనిపించడం!
సైకాలజిస్టుల అధ్యయనం ప్రకారం.. ప్రశాంతంగా కనిపించే వారు ఎవరినైనా సులువుగా ఆకట్టుకోగలరు. ఎప్పుడూ ఏడో డిస్ట్రబెన్స్ తో, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో అశాంతితో అరుస్తూ, అసహనంతో కనిపించే వారు మాత్రం వారితో అవసరం ఉన్న వారిని తప్ప మరొకరిని ఆకట్టుకోలేరు! కూల్ గా ఉండే వారు సులువుగా ఎవరైనా ఆకట్టుకుంటారు.
సువాసనను వెదజల్లండి!
మంచి స్ప్రే వాడండి, సెంట్ వాడి సుగంధాన్ని వెదజల్లండి. అప్పుడు మీకు సమీపంలో రావడానికి ఎవరికైనా కాస్త ఆసక్తి కలుగుతుంది. సిగరెట్ అలవాటు, నోటి నుంచి దుర్వాసన వస్తే.. మీతో మాట్లాడటానికి కూడా ఎవరూ ఉత్సాహం చూపించరు. మీ కంపు మీకు తెలియకపోవచ్చు. కానీ అవతలివారికి అదే రిజిస్టర్ అవుతుంది. సెంట్ లు, స్ప్రేలు కూడా అంతే. మీకు దగ్గరగా వచ్చే వారికి మంచి ఫీలింగ్ ఇస్తాయి. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా పాజిటివ్ గా ఉంటే మరింత చేరవుతారు ఎవరైనా!
అర్థవంతమైన సంభాషణలు!
ఇదంతా జబర్దస్త్ యుగం అనుకోవద్దు. అర్థరహితమైన జోక్ లు, నాన్ సెన్సికల్ మాటలు వింటే ఎవరికైనా చిరాకు వస్తుంది. అయితే కొందరు మీతో అవసరం కాబట్టి.. మీరు వేసే పనికిమాలిన జోక్ లకు విరగబడి నవ్వొచ్చు. అయితే అదంతా అప్పటికే. అయితే అర్థవంతమైన సంభాషణలు, మేధో చర్చలు మాత్రం మంచి ఇమేజ్ ను ఇస్తాయి. మీతో మాట్లాడితే నాలుగు మంచి విషయాలు తెలుస్తాయనుకుంటే.. అది మీ వెయిట్ ను పెంచేదే తప్ప తగ్గించేది కాదు!
మాటే మంత్రం!
మాటలు మంత్రాల్లాంటివి. అవతలి వారిని సమ్మోహన పరచడంలో మాటలది, కమ్యూనికేషన్ ది కీలక పాత్ర. ఈ మాటలు అవసరానికి తగ్గట్టుగా, సందర్భానికి సెట్ అయ్యేలా ఉంటే.. మీరో ఆయస్కాంతం అవుతారు. కమ్యూనికేషన్ ఇలా చాలా కీలకమైనది. మీ మాటలు నచ్చితే చాలా విషయాల్లో మీతో అడ్జస్ట్ అయ్యే వాళ్లు ఎంతో మంది ఉంటారు!