చంద్రబాబుకి సింపతీ ఎందుకు రావట్లేదంటే!

స్వర్గం,నరకం అనేవి ఎక్కడో ఉండవు..మన కర్మల్ని బట్టి ఇక్కడే కనిపిస్తుంటాయి అని అంటుంటారు.  Advertisement మనం గొప్పగా చేస్తున్నామనుకుని ఏ పని చేసినా, అదే విషయంలో గతంలో మనం చేసిన విరుద్ధకర్మని గుర్తుచేసి జనం…

స్వర్గం,నరకం అనేవి ఎక్కడో ఉండవు..మన కర్మల్ని బట్టి ఇక్కడే కనిపిస్తుంటాయి అని అంటుంటారు. 

మనం గొప్పగా చేస్తున్నామనుకుని ఏ పని చేసినా, అదే విషయంలో గతంలో మనం చేసిన విరుద్ధకర్మని గుర్తుచేసి జనం వెక్కిరించడం అనేది కర్మసిద్ధాంతం వెంటబడి దాడి చెయడం తప్ప మరొకటి కాదు. 

ఉదాహరణకి, నిన్న నారా భువనేశ్వరి నిరాహారదీక్షా శిబిరంలో ఒక హైందవ పండితుడిచేత, ఒక ముస్లిం మతపెద్ద చేత, ఒక పాస్టర్ చేత ప్రార్ధనలు చేయించారు. మామూలుగా చూస్తే అది రొటీన్ సీన్ లాగానే ఉంటుంది. 

కానీ సోషల్ మీడియా యోధులు పాస్టర్ ప్రార్ధనకి ఒక పాత చంద్రబాబు వీడియో బైట్ ని జతచేసి వీడియో వదిలారు. అదేంటంటే గతంలో చంద్రబాబు ఊరికొక చర్చ్ వెలుస్తోందని, పాస్టర్లకి ప్రభుత్వం నెల నెల జీతాలివ్వడమేంటని నిరసిస్తూ ఒక ప్రసంగంలో అన్న మాటలు ఇక్కడ గుర్తుచేసారు. 

నిజమే మరి! ఈ ప్రజాస్వామ్యంలో పాస్టర్ల మీద, చర్చిల మీద అంత నెగిటివ్ భావాన్ని పబ్లిక్ గా వ్యక్తపరచడం ఎంత తప్పు! తప్పు మాట అటుంచితే ఎంత అవివేకం!?

ఏం! క్రైస్తవులు మాత్రం చంద్రబాబుకి ఓటర్లు కారా? అలాంటప్పుడు అలా ఎందుకు మాట్లాడాడు అప్పట్లో! మతమనేది వ్యక్తిగతం. ఆ భావాల్ని ఫిల్టర్ లేకుండా మైక్ ముందు మైకం వచ్చినట్టు మాట్లాడితే సహజంగానే కార్నర్ అయిపోతారు ఎవరైనా! పైగా ప్రతి చిన్న మేటర్ కూడా రికార్డవుతోంది అన్న స్పృహలో మాట్లాడాలి కదా!

కేవలం జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవపక్షపాత ముఖ్యమంత్రి అని జనంలోకి మెసేజ్ పంపే దురుద్దేశ్యంతో ఆ మాటలన్నాడు. ఇప్పుడవే మాటలు వెక్కిరింపు రూపంలో వెంటాడుతున్నాయి. అప్పుడవసరం లేదనుకున్న పాస్టరు ఇప్పుడు జైల్లో పడ్డాక గుర్తుకొచ్చాడా అని!
ఇలాంటి గతకర్మల వల్ల ఇప్పుడు బాబు మీద సింపతీ రావట్లేదు. 

అలాగే సోషల్ మీడియాలో చంద్రబాబు వేలు చూపిస్తూ జగన్ కి ఇచ్చిన వార్ణింగులు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. 

ఒక సందర్భంలో తాను సీయం అయ్యాక జగన్ కి ఇవ్వబోయే ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉంటుందన్నాడు బాబు. అలాగే తాను తొక్కేస్తానని, మళ్లీ లేవలేడని అన్నాడు ఒక బహిరంగ సభలో.

“నాకు రాజెకీయం నేర్పుతావా జగన్ మోహన్ రెడ్డి! మీ నాన్నే నా దగ్గర తోక ఊపలేదు” అన్నాడు వీరోచితంగా.

కట్ చేస్తే ఇప్పుడు జైల్లో ఉన్నాడు చంద్రబాబు అని జనానికి అర్ధమయ్యేలా ఆ వీడియోలుంటున్నాయి.

ఇదంతా యాక్షన్ కి రియాక్షన్ అన్నట్టుగా తీసుకుంటారు జనం. అందుకే సింపతీ రావట్లేదు.

అలాగే లోకేష్ మీద కూడా సింపతీ లేదు. తండ్రి జైల్లో ఉంటే బయట ఇబ్బంది పడుతున్న బిడ్డ అని ఎవరూ అనుకోవట్లేదు.

ఎందుకంటే “ఉచ్చ పోయిస్తా”, “కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తా” లాంటి అతని పంచ్ డైలాగులు కూడా వైరలవుతున్నాయి. అలాంటి మాటలన్నవాడిని రేపు అరెష్టు చేసినా జనం సినిమా చూసినట్టు చూస్తారు తప్ప సింపతీ కురిపించరు. 

ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరతాడు.” నువ్వెంత నీ బతుకెంత” అని జగన్ ని అనడం, “కొడకల్లారా” అంటూ చెప్పు చూపించడం..ఇవన్నీ జనం కళ్ల ముందు ఉన్నాయి. అతన్ని అరెష్టు చేసేటంత విషయం, అవసరం లేకపోయినా చేస్తే చేయొచ్చని అనుకుంటున్నవారున్నారు. ఒకవేళ చేసినా ఇతనికి కూడా సింపతీ రాదు.

అరెష్టవడం సరదాగా ఉందో ఏమో! అరెష్టవడం రాజకీయజీవితానికి బలం చేకూరుస్తుందని అనుకుంటున్నాడో ఏమో!- పవన్ కూడా మొన్న అవనిగడ్డ స్పీచులో అరెష్టు ప్రస్తావన ఎత్తి తనను కూడా అరెష్టు చెయొచ్చేమోనని “ఆశాభావాన్ని” వ్యక్తపరిచాడు. 

ఇంతలో బండారు సత్యనారాయణ నోటికి నరం లేకుండా మంత్రి రోజాపై గతంలో దేశచరిత్రలో ఏ రాజకీయనాయకులూ చేయనంత అసహ్యమైన దాడి చేసాడు. జనం ఛీ కొట్టారు. పోలీసులు జైల్లోకి నెట్టారు. ఇలాంటి నాయకుల వల్ల సానుభూతి మాట అటుంచి తెదేపా ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టమనిపిస్తుంది. 

ఏమన్నా అంటే మా భువనేశ్వరమ్మను అన్నప్పుడు లేదా, రోజాని అంటేనే అరెష్టా అంటున్నాడు బండారు.

భువనేశ్వరమ్మని అన్నది ఎవరు? తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే కదా! అక్కడికేదో వైకాపా వాళ్లే ఆమెను ఏదో అన్నారని ఫిరాయింపులెందుకు? “అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో…” అంటూ పెద్ద ద్రౌపదికి జరిగిన అవమానం టైపులో బిల్డప్పుస్తున్నారు తెదేపా వాళ్లు.

ఆ పోలికే నిజమైతే ఈ పాటికి సింపతీ రావాలి కదా!

ప్రజలంతా రోడ్ల మీద పడి నిరసనలు చెయ్యాలి కదా!

ఒక వర్గానికి చెందిన ప్రజలే వస్తున్నరంటే ఏమనుకోవాలి!

ఇవన్నీ ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి తెదేపా సానుభూతిపరులు. 

ఇదంతా ఒకెత్తైతే పోనీ భువనేశ్వరి, బ్రాహ్మణిల్ని చూసైనా సింపతీ వస్తోందా అంటే అదీ లేదు. దానికీ కారణాలున్నాయి. 

పార్టీల సానుభూతితో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ప్రజలు ఒక విషయానికి తిట్టిపోస్తున్నారు. ఎలిమిమెంటరీ స్కూల్ పిల్లలకి స్క్రిప్ట్ ఇచ్చి, బట్టీ కొట్టించి వేదికల మీద మాట్లాడిస్తున్నారు. ఆ మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉంటున్నాయి. 

నారా భువనేశ్వరి సమక్షంలో ఒక పిల్లవాడు, “అయ్యా జగన్ మోహన్ రెడ్డి! తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా, మీ నాన్నకు మాంసం అన్నా దొరికింది నీకు అదికూడా దొరకదు” అన్నాడు. దానికి పక్కనున్న ఆదిరెడ్డి భవాని, చూస్తున్న భువనేశ్వరి మురిసిపోయారు. ఆదిరెడ్డి భవాని అయితే చిన్నపిల్లవాడైనా గొప్పగా మాట్లాడాడు అంటూ కితాబిచ్చింది. 

వారం క్రితం ఒక బహిరంగ సభలో మరొక పిల్లవాడి చేత కూడా “మీ అయ్య చచ్చిన ఇడుపులపాయ..”, “ఏం పీకుతున్నావ్”, “వైసీపీ పిచ్చనాకొడకా” లాంటి మాటలు మాట్లాడించారు. 

ఈ వీడియో బైట్లని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పిల్లల్ని ఇలా టెర్రరిస్టులుగా మారుస్తున్న వారి పెద్దవాళ్లని సుమోటోగా అరెష్టు చెయ్యాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. 

ఇలాంటి చర్యల వల్ల తెదేపా మీద ఏ మాత్రం సానుభూతి కలగకపోగా మరింత అసహ్యమేస్తోంది జనానికి. ఏదో చేస్తే సానుభూతి వస్తుందనుకుంటే అంతా బెడిసికొట్టి జుగుప్స, అసహ్యం కలుగుతున్నాయంటే బుద్ధి కూడా వక్రంగా పనిచేసేలా చేస్తోందన్నమాట ప్రకృతి. 
“బుద్ధి కర్మానుసారిణి” అంటారు. చేసిన కర్మల్ని బట్టే బుద్ధి కూడా పని చేస్తుంది. వక్రమైన పనులు చేస్తే వక్రబుద్ధే వస్తుంది కర్మసిద్ధాంతం ప్రకారం. 

చంద్రబాబు అరెష్టు నేపథ్యంలో బయటికొచ్చిన నందమూరి-నారా కుటుంబ సభ్యుల్ని చూస్తుంటే ఒక్కళ్లకి కూడా బుద్ధి సక్రమంగా పని చేయట్లేదని అర్ధమవుతోంది. బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్..ఇలా సకుటుంబ సపరివార సమేతంగా బుద్ధిమాంద్యంతో కూడిన మాటలతో, చర్యలతో ట్రోలింగ్ కి గురవ్వడం తప్ప ఇంకేమీ లేదంటే దాని సారాంశం కర్మపండిందనే చెప్పుకోవాలి. 

మామగారు జైల్లో ఉన్నాడని డప్పులు కొట్టమని పిలుపునిచ్చిన బ్రాహ్మణి నవ్వుతూ ఆ పని చేయడం బుద్ధిమాంద్యమే. అసలా పిలుపే శుద్ధదండగ. కామెడీ తప్ప సెంటిమెంటు లేని పని అది. 

వీళ్లందరికీ తోడు యెల్లో మీడియా కమెడియన్స్ చేస్తున్న “అతి” కూడా తెదేపాని సానుభూతికి కొన్ని కాంతిసంవత్సరాల దూరంలో ఉంచుతోంది. 

ఏదైనా “అతి సర్వత్ర వర్జయేత్”. గతంలో చేసిన, ఇప్పుడు చేస్తున్న “వక్రకర్మలు”, “అతి” తెదేపాని వెక్కిరిస్తూ వెంటాడుతున్నాయి.

తాజాగా ఈ రోజు అయ్యన్నపాత్రుడు బ్రాహ్మణిని అన్నమట కూడా చెప్పుకోవాలి. బ్రాహ్మణి స్వయాన బాలకృష్ణ పెద్ద కూతురు, చంద్రబాబు కోడలు అని అందరికీ తెలుసు. అయితే ఆ పార్టీ సీనియర్ నేత అయ్యనపాత్రుడికి ఆమె పేరు తెలియకపోవడం ఆశ్చర్యం. 

వృద్ధాప్యంలో ఒక్కోసారి కొన్ని పేర్లు గుర్తురావనుకుందాం. అదే అయితే “ఆవిడ పేరు ఏంటి” అని అడగొచ్చు. కానీ “దాని పేరు ఏం పేరు” అని మీడియా సాక్షిగా అయ్యన్న! 

పనిమనిషిని కూడా “అది” ఇది” దాని” దీని” అనడం తప్పని కరెక్ట్ చేస్తున్న సమాజంలో ఉన్నాం. సాక్షాత్తు తన పార్టీ యువరాజు భార్యని పట్టుకుని “దాని పేరు” అన్నాడంటే అయ్యన్నకి చంద్రబాబు కుటుంబంలోని ఆడవాళ్లపై ఉన్న గౌరవమేంటో అర్ధమవుతుంది. వాళ్లకే గౌరవమివ్వలేనివాడు ఇక ఇతర స్త్రీలకెందుకిస్తాడు?

ఆత్మపరిశీలన చేసుకుంటే ఆడవాళ్లని అసభ్యంగానో, అగౌరవంగానో ప్రస్తావించేది తెదేపా నాయకులే. అందుకే ఎప్పటికీ సానుభూతి పొందలేని పార్టీ తెలుగుదేశం. 

– హరగోపాల్ సూరపనేని