ధర్మం దారి తప్పితే దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు. జర్నలిజం దారి తప్పితే కూడా ఒక కొత్త అవతారం తెరమీదికి వస్తుంది. ఆ దేవుడు పేరు రవిప్రకాశ్. తెలుగు వాళ్లందరికీ ఈ పేరు తెలుసు. కొంత కాలంగా కేసుల్లో ఇరుక్కుని కనపడలేదు. ఇప్పుడు Rtv రూపంలో వచ్చారు.
న్యూస్ చానల్స్‌ని ఒక రేంజ్‌కి తీసుకెళ్లిన ఘనత రవిప్రకాశ్‌దే. TV9 కి క్రేజ్ పెంచింది ఆయన. అయితే అన్ని గీతల్ని చెరపేసి పడక గదుల్లోకి కూడా కెమెరాను పంపి జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన మహానుభావుడు కూడా ఈయనే. రేటింగ్ కోసం ఈయన చేయని పనిలేదు. వ్యాపారంలో నీతికి తావు లేదు. ప్రొఫెషనల్‌గా ఎదిగాను అనుకుంటూ మనిషిగా, జర్నలిస్టుగా పాతాళంలో నివాసం ఉంటున్న వ్యక్తి రవిప్రకాశ్.
అందరూ బట్టలిప్పేసి వున్నప్పుడు రవిప్రకాశ్‌నే అనాల్సిన పని ఏముంది? వుంది. సవాలక్ష యూట్యూబ్ చానల్స్‌లో ఆయనదొకటి. ఇష్టమొచ్చింది చెబుతారు. నచ్చితే జనం చూస్తారు. అక్కడి వరకూ ఏ సమస్యా లేదు.
కానీ రవిప్రకాశ్ ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ కులాలతో కుళ్లి పోయిందట. మీడియా అంతా ఎవరో ఒకరికి తోకలా మారిపోయిందట. కులరహిత సమాజం కోసం, నిష్పక్షపాత జర్నలిజం కోసం ఆయన వచ్చారట. కామెడీ కాదా? ఇది.
రాజకీయ నాయకులు మోసం చేస్తారు. అది వాళ్ల వృత్తి. జర్నలిస్టులు కూడా మోసం చేయడానికే వస్తున్నారు. అది వాళ్ల కులవృత్తి. ఎంతో మంది వ్యక్తిగత జీవితాల్ని కనీస మానవ విలువలు లేకుండా బజారుకీడ్చిన ఈయన నీతి ముక్తావళి అందుకున్నారు.
ఒక మహిళా పోలీస్ అధికారి, భర్తతో విడిపోయి, నచ్చిన వాళ్లతో లివింగ్ టు గెదర్‌లో వుంటే, దీంట్లో సమాజానికి కానీ, టీవీ9కు కానీ ఇబ్బంది ఏమైనా వుందా? ఇలా ఎందరో జీవితాల్ని బజారుకెక్కించిన జర్నలిస్టు ఈ రోజు విలువల సంరక్షణార్థం మళ్లీ వచ్చారు.
చిన్నచిన్న ఉద్యోగుల్ని కెమెరాకి పట్టించిన ఈయన, టీవీ9 విలేకరులకి ఏరియాలు రాసిచ్చారు. అనేక మంది రిపోర్టర్లు కోటీశ్వరులు అయ్యారంటే ఈయన ఇచ్చిన జీతాలతోనే అయ్యారా? జర్నలిస్టుగా ప్రారంభమైనప్పుడు ఈయన సంపద ఎంత? ఇప్పుడెంత? ఇది చాలదా కొలమానానికి?
ఈయన్ని బయటికి పంపి, కేసులు పెట్టించిన కేసీఆర్ మీద కోపం. కేసీఆర్‌కి జగన్ అనుకూలుడు. అందుకే Rtv పేరుతో వైసీపీ మీద విషాన్ని చల్లడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన చానల్, ఆయన ఇష్టం. ఎంత రేటుకైనా అమ్ముకుంటారు, ఎవరికైనా అమ్ముకుంటారు. అయితే భ్రష్టు పట్టిన జర్నలిజాన్ని పైకి లేపుతానంటున్నాడే. అక్కడే మండేది. జర్నలిజం అమ్ముడుపోయి చాలా కాలమైంది. ఆ తూకం రాళ్ల సృష్టికర్తల్లో రవిప్రకాశ్ ఒకరు కాదు, ఆయనే ప్రముఖుడు. కాకపోతే ఆయన వెల కొంచెం ఎక్కువ. హాయిగా వార్తలు అమ్ముకోకుండా మీకెందుకు సార్ సుభాషితాలు, సుమతి నీతి శతకాలు!
-పీ.ఝాన్సీ