ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం ఫలితం ఎప్పుడూ రాజకీయంగా ఆసక్తికరంగానే ఉంటుంది. ఫైర్ బ్రాండ్ అనదగిన నేత మాజీ మంత్రి టీడీపీ సీనియర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన వరసగా చూస్తే పదవ సారి పోటీ చేస్తున్నారు. తన మొత్తం రాజకీయ జీవితంలో తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు ఓడి ఆరు సార్లు గెలిచారు. అనేక సార్లు మంత్రిగానూ ఉన్నారు.
అయ్యన్న తనకు ఇవే చివరి ఎన్నికలు అని సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దూకుడు రాజకీయం చేస్తున్నారు. అయ్యన్న వ్యతిరేక శక్తులను తన వైపు తిప్పుకున్నారు. దాంతో ఇక్కడ భీకరమైన పోరుకు తెర లేచింది. నాదే మెజారిటీ అని ఇప్పటికి పలు సార్లు పెట్ల ధైర్యంగా చెబుతున్నారు. ముప్పయి వేలకు తగ్గితే చూడండి అని సవాల్ చేస్తున్నారు.
దీంతో ఒక రకమైన ఉత్సుకత ఏర్పడింది. ఈ తరుణంలో ఒక డీఎస్ ఐకానిక్ పీపుల్స్ సర్వే పేరుతో వచ్చిన ఒక సర్వే ఫలితం ఆసక్తికరంగా ఉంది. ఈ సర్వే చేసిన వారు చెప్పేది ఏంటి అంటే ఈసారి కూడా వైసీపీదే నర్శీపట్నంలో విజయం అని. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళలలో ఆదరణ బాగా ఉందని పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 55 శాతం పైగా ఓటు షేర్ వస్తూంటే టీడీపీకి 44 శాతం ఓటు షేర్ దక్కుతోందని వివరిస్తున్నారు.
గ్రామ పంచాయతీని ఒక యూనిట్ గా తీసుకుని సర్వే చేశామని ఇది తాము స్వచ్చందంగా చేసిన సర్వే అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితం వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. విశాఖ జిల్లా రూరల్ లో మొదట్లో వైసీపీకి కొంత ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితులు ఉన్నా ఇప్పుడిప్పుడే ఆ పార్టీ స్పీడ్ అందుకుంటోంది. చాలా నియోజకవర్గాలలో వైసీపీ గెలుపు బాటన పయనిస్తోందని సంకేతాలు వస్తున్నాయి. అందులో నర్శీపట్నం కూడా చేరుతోంది అన్నది ఈ సర్వే అంచనా. ఇది ఎలా ఉన్నా అసలు రిజల్ట్ కూడా ఇలాగే ఉండబోతోంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు.