మరో పది రోజుల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్ల లెక్క తేలింది. సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,03,39,851 మంది. మహిళా ఓటర్లు 2,10,58,615 మంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 7,18,764 మంది ఎక్కువ ఉన్నారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే 154 చోట్ల మహిళా ఓటర్లు అధికంగా కనిపిస్తున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం కూటమిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనతో మహిళలను తన ఓటు బ్యాంక్‌గా మలుచుకున్నారు.
లక్షలాది మంది గృహిణులకు సొంతింటి కల నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలను వారి పేరుతోనే ఇచ్చారు. అలాగే అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా మహిళల ఖాతాల్లోకి జగన్ ప్రభుత్వం పంపుతూ వచ్చింది. డ్వాక్రా రుణాలను మాఫీ చేసి వారి పాలిట శ్రేయోభిలాషిగా మారారు.
దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే మహిళా పక్షపాతి అనే ముద్ర వేయించుకోగలిగారు. మరోవైపు చంద్రబాబునాయుడును నమ్మక ద్రోహిగా మహిళలు చూస్తున్నారు. గతంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని, అలాగే బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొస్తానని నమ్మబలికి, ఆ తర్వాత అందర్నీ నట్టేట ముంచారు. బాబు అంటే నమ్మించే మోసగించే నాయకుడిగానే మహిళలు గుర్తు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉండడం రాజకీయంగా కూటమికి ఆందోళన కలిగించే అంశం. మరోవైపు వైసీపీలో ఆనందం కనిపిస్తోంది. మహిళల్లో 60 శాతం వైసీపీకి వేస్తారని పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ గణాంకాలే కూటమిని కలవరపెడుతున్నాయి. మరోసారి సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని జగన్ స్పష్టం చేయడంతో మహిళల్లో ఒక నమ్మకం ఏర్పడింది. జగన్ చెబితే చేస్తాడనే నమ్మకంతో వైసీపీకి మెజార్టీ మహిళలు అండగా నిలుస్తారనే చర్చకు తెరలేచింది.