బీజేపీ జాతీయ మేనిఫెస్టోకు తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ ప్రకటన ఇవ్వడంపై ఏపీ ప్రజానీకం అవాక్కవుతున్నారు. మోదీ గ్యారెంటీకి మీరు కట్టుబడి వుండడం ఏంటని జనం నిలదీస్తున్నారు. ఇటీవల ప్రజాగళం పేరుతో కూటమి మేనిఫెస్టో విడుదలైంది. ఈ మేనిఫెస్టో బుక్‌లెట్‌పై చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. అలాగే మేనిఫెస్టో అమలు బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటాయని బాబు చెప్పారు.
మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ ప్రతిని తాకడానికి కూడా బీజేపీ ఏపీ సహ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. దీంతో కూటమి మేనిఫెస్టో అమలుపై నీలి నీడలు అలుముకున్నాయి. బాబు, పవన్ ఇస్తున్న హామీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండదని తేలిపోయిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. బీజేపీ చాలా స్పష్టంగా తమకు, టీడీపీ-జనసేన మేనిఫెస్టోకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మేనిఫెస్టో అమలుపై విశ్వసనీయత కొరవడింది.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఉమ్మడిగా ఒక ప్రకటన ఇచ్చారు. ఇందులో రాష్ట్రంలో ప్రతి పేదవాని సొంతింటి కలను నెరవేర్చటం …మోదీ గ్యారెంటీకి మేము కట్టుబడి ఉన్నామంటూ బాబు, పవన్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, ఎన్డీఏ కూటమికి ఓటు వేద్దాం…మోదీని గెలిపిద్దాం అని బాబు, పవన్ పిలుపునివ్వడం గమనార్హం.
ఈ ఎన్నికల ప్రకటన చూస్తుంటే… బాబు, పవన్ తమపై ప్రజల్లో విశ్వసనీయత లేదనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ ఇస్తున్న గ్యారెంటీలకు వీళ్లు ష్యూరిటీ ఇవ్వడం ఏంటో జనానికి అర్థం కావడం లేదు. కేంద్రంలో బీజేపీ వస్తే, సొంతింటి కలను నెరవేరుస్తారు. ఇందులో బాబు, పవన్ పాత్ర ఏంటి? తమ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఇవ్వకపోవడం, కనీసం మోదీ ఫొటో పెట్టుకోడానికి కూడా అనుమతించకపోవడంతో జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళ్తున్నాయని బాబు, పవన్ గ్రహించారు.
అందుకే మోదీ గ్యారెంటీకి తాము కట్టుబడి ఉన్నామని పొంతనలేని నినాదంతో ముగ్గురి ఫొటోలు కనిపించేలా బాబు, పవన్ వ్యూహాత్మకంగా వాణిజ్య ప్రకటన ఇచ్చారు. ఇలాంటి జిమ్మిక్కులతో జనాన్ని మోసం చేయలేరనే చర్చకు తెరలేచింది. తమ హామీలకు చేతనైతే కట్టుబడి ఉన్నామని బీజేపీతో ప్రకటన ఇప్పించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు బాబు, పవన్ ఎత్తుగడలను పసిగట్టలేని స్థితిలో ప్రజలు లేరు.
ఏదో రకంగా మోదీతో కలిసి గ్యారెంటీల పేరుతో ప్రకటన ఇస్తే, తమ మేనిఫెస్టోకు మద్దతు బీజేపీ ఉందని జనం అనుకుంటారని బాబు, పవన్ ఆశిస్తున్నారు. ఇలాంటివి ఎన్ని ప్రకటనలు ఇచ్చినా బాబు, పవన్ హామీలకు భవిష్యత్‌లో కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు వుండదని, అమలు సాధ్యం కాదని ప్రజానీకం ఫిక్స్ అయ్యింది. ఇక నిర్ణయమే తరువాయి.