ఇదేదో కొత్తరకం లిక్కర్ అనుకోవద్దు. హోమియోపతి మందులతో అక్రమంగా, అత్యంత ప్రమాదకరంగా తయారుచేస్తున్న మద్యం బాటిళ్లు ఇవి. కల్తీ మద్యాన్ని ఎలా తయారుచేస్తారో చాలామంది వార్తల్లో చూసేఉంటారు. కానీ ఇది నెక్ట్స్ లెవెల్.
హోమియోపతి మందుగా ఉపయోగించే బెల్లడోనా అనే ద్రావణాన్ని వాడి విశాఖలో కల్తీ మద్యం తయారుచేస్తున్నారు. ఒరిస్సా నుంచి విశాఖకు తరలివచ్చిన ఓ భార్యాభర్తకు ఇది కుటీర పరిశ్రమగా మారింది.
ఒక బెల్లడోనా సీసా నుంచి 2 క్వార్టర్ల కల్తీమద్యాన్ని తయారుచేయొచ్చు. బెల్లడొనా అనేది శక్తివంతమైన మెడిసిన్. హోమియోపతిలో మెగ్రైన్ లాంటి లక్షణాల్ని నియంత్రించేందుకు దీన్ని వాడతారు. దీనికి కార్బో వెజిటబుల్, అస్పిడోస్పెర్మా లాంటి ద్రావకాలు కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఇలా తయారుచేసిన మద్యాన్ని క్వార్టర్ కాదు, అందులో సగం తాగినా కిక్కిస్తుంది, ఆ వెంటనే ఆరోగ్యం పాడవుతుంది.
ఇలా అక్రమంగా తయారుచేసిన 775 మద్యం బాటిళ్లను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తిలోని ఓ అపార్ట్ మెంట్ లో జరుగుతున్న ఈ దందాలో శిరీషను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాటిని విక్రయిస్తున్న అతడి భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు.