cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Opinion

పెదరాయుడు పవన్ కల్యాణ్

పెదరాయుడు పవన్ కల్యాణ్

‘‘ఈ రోజుల్లో అంతా సినిమాలు చూసి చెడిపోతున్నార్రా..’’ అనే డైలాగు మనం పెద్దవాళ్ల నుంచి చాలా సార్లు వింటూ ఉంటాం. ఈ మాట ప్రతి జెనరేషన్లోనూ వినవస్తూ ఉంటుంది. సినిమా అనే ఒక పవర్ ఫుల్ మీడియం.. ప్రతిసారీ కూడా.. సాధారణంగా ప్రజలకు అలవాటు అయిన పద్ధతి, సంగతి కంటె అతిగా ఉండే, ఓవరాక్షన్ విషయాలే సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. పవన్ కల్యాణ్ ను చూస్తే.. ‘సినిమాలు చూసి చెడిపోవడం’ కాదు.. ‘సినిమాలు చేసి చెడిపోతున్నట్టు’గా అనిపిస్తోంది. 

సినిమాల్లో హీరో పాత్రలు చేయడం మాత్రమే తెలిసిన పవన్ కల్యాణ్.. తానొక మెసయ్య అనే భావిస్తున్నారా? ప్రజల్ని ఉద్ధరించడానికే తాను పుట్టానని అనుకుంటున్నారా? ఏ భ్రమల్లో ఆయన బతుకుతున్నారో మనకు తెలియదుగానీ.. తనను తాను ఒక ‘పెదరాయుడు’ పాత్రలోకి ఆవిష్కరించుకోడానికి ఇప్పుడు ఆయన రంగం సిద్ధం చేశారు! వచ్చి నాకు మీ కష్టాలు చెప్పుకోండి.. మీ కష్టాలన్నీ తీర్చేస్తా.. మీ కన్నీళ్లన్నీ తుడిచేస్తా.. అనే బిల్డప్ ఒక సరికొత్త డ్రామాకు పవన్ తెరలేపారు! ఈ ముసుగులో ప్రజలను ఎంత మేర బురిడీ కొట్టించగలరో.. ఎంతగా తాను నవ్వులపాలు అవుతారో వేచిచూడాలి!

పవన్ కల్యాణ్ ఇటీవలి సినిమాలు గమనించారా? అందులో ప్రధానంగా మనకు రెండు కీలకాంశాలు కనిపిస్తాయి. తన ఇమేజికి, స్థాయికి తగిన కథను సొంతంగా ఎంచుకుని ఆ సినిమా చేయడానికి ఆయనకు ఓపిక లేదు. ఇతర భాషల్లో విడుదలై హిట్ అయిన సినిమాలైతే ‘టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్’ గనుక అవి మాత్రమే ఎంచుకుంటున్నారు. అంటే రీమేక్ లు మాత్రమే చేస్తున్నారు. 

ఇది ఒక అంశం! రెండోదేంటంటే.. తాను రీమేక్  కోసం ఎంచుకున్న మాతృక ఎలాంటిదైనా కావొచ్చు గాక.. ఆ సబ్జెక్టులో క్రియేటివ్ అడాప్టేషన్ చేస్తూ వెళ్తారు. ఒరిజినల్ సినిమాలో చేసిన స్టార్లు ఎంతటి వారైనా.. వారు సబ్జెక్టులో ఎంతగా ఒదిగిపోయి చేసినా.. దానిని పవన్ కల్యాణ్ కోసం క్రియేటివ్ అడాప్టేషన్, మార్పుచేర్పులు చేస్తారు. ఆ సినిమా ఎలాంటిదైనా సరే.. పవన్ పోషించే హీరో పాత్రకు ఒక ‘ప్రజాబంధు’ ఇమేజిని పులమడానికి ప్రయత్నిస్తారు. 

సామాన్యుల కోసం పోరాడే, పేదల పక్షాన నిలబడే ఒక మహానుభావుడిలాగా హీరో పాత్రను, కథకు సంబంధం లేకపోయినా సరే, తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇటీవలి కాలంలో విడుదలైన అనేక సినిమాలు ఇందుకు ఉదాహరణలే గానీ.. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకు చేస్తారంటే.. పవన్ కు సినిమా బాగోగుల కంటె.. ఆ సినిమా తన ‘పేరలల్ ఇన్నింగ్స్’ రాజకీయాలకు ఉపయోగపడడం చాలా అవసరం! 

ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా.. సినిమాలు చూసి కాదు, సినిమాలు చేసి పాడైపోవడం పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంలో కనిపిస్తోంది. ఆయనకు అర్జంటుగా ‘దీనజనబంధు’ లాంటి ఇమేజీ మీద మనసు పుట్టింది. ఇన్ని సినిమాల్లో ప్రజల సమస్యలన్నింటినీ చిటికెలో పరిష్కరించేస్తున్నానే.. వారి కష్టాలు తీర్చేస్తున్నానే నిజజీవితంలో కూడా నా స్థాయి అదే కదా అనే భ్రమ కలిగింది. 

పార్టీ స్థాపించిన అయిదేళ్ల తర్వాత.. ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కల్యాణ్ ఎంత దారుణమైన రీతిలో ప్రజల తిరస్కారానికి గురయ్యాడో అందరికీ తెలుసు! ఒక విషయాన్ని అయిదేళ్లపాటు అధ్యయనం చేసిన విద్యార్థి.. 1/175 మార్కులు సాధిస్తే వాడిని మనం ఏమంటాం? 90 శాతం మార్కులు వచ్చినా కూడా ర్యాంకులు మిస్సయ్యాయని ఆత్మహత్యలు చేసుకునే పిల్లలున్న ఈ రోజుల్లో 175కు ఒక్క సీటు (అది కూడా జారిపోయింది) సాధించిన పవన్ కల్యాణ్, ఈ రోజుల్లో ఏ నాయకుడికీ లేనంత భీతితో, తాను స్వయంగా రెండు చోట్ల పోటీచేసి రెండుచోట్లా పరాభవం పాలైన పవన్ కల్యాణ్.. రెట్టించిన ఉత్సాహంతో ఆ తర్వాతి నుంచి పనిచేస్తున్నారు. 

రాజకీయ కార్యకలాపాలు అనేవి ఆయనకు పేరలల్ ఇన్నింగ్స్ మాత్రమే. షూటింగ్ షెడ్యూల్స్ నడుమ గ్యాప్ లో మాత్రమే ఆయన ప్రజలకు సమయం కేటాయించగలరు. ‘‘మీలాగా నాకు అవినీతి సొమ్ము లేదు.. నేను కష్టపడి సంపాదించుకోవాల్సందే కదా’’ అనే అద్భుతమైన డైలాగు ఆయన వాడుతుంటారు గనుక.. దానిని అర్థం చేసుకోవచ్చు. ఆ పేరలల్ ఇన్నింగ్స్ లో కూడా, ఇంతటి పరాభవం తర్వాత ఇంత దూకుడుగా రాజకీయం ప్లే చేయాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతటి కాన్ఫిడెన్స్ ఉన్నందుకు.. ఈ మార్షల్ ఆర్ట్స్ యోధుడిని అభినందించాల్సిందే. 

ఆ చురుకైన రాజకీయ ప్రస్థానం సాగుతున్నప్పటికీ.. ఆయనకు పూర్తి కిక్ రాలేదు. అధికారంలో ఉన్న వ్యక్తి/నాయకుడు ప్రజల సమస్యలను తీరుస్తూ ‘ప్రజా బంధు’ ఇమేజీని కూడగట్టుకుంటూ ఉండడం సహజం. వారి చేతిలో అధికారం నిధులు అన్నీ ఉంటాయి గనుక.. ఖర్చు పెట్టేది వారి సొంత డబ్బు కాకపోయినా.. ఆ ఇమేజీ వారికి అయాచితంగా వస్తూ ఉంటుంది. కానీ.. తనకు కూడా అదే ఇమేజీ కోరుకునే పవన్ కల్యాణ్ కొత్త ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రతిపక్షంగా.. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన పవన్ కల్యాణ్ పరిష్కారం తానే చేయాలనే మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రయత్నాలు మిక్స్‌డ్ రిజల్ట్ ఇచ్చాయి.

ఒక్కోతీరుగా..

మామూలుగా ఏ ప్రాంతంలో ప్రజాసమస్యల మీద ఉద్యమాలు ప్రారంభించినా అదొక సీజనల్ బిజినెస్ లాగా కొన్నాళ్లు నడిపి తర్వాత విడిచిపెట్టే అలవాటున్న పవన్ కల్యాణ్ భిన్న అంశాలు టేకప్ చేశారు. రోడ్లు బాగా లేవని కొన్నాళ్లు ఉద్యమాలు చేశారు. రోడ్లు తానే స్వయంగా రిపేర్లు చేయిస్తానని, తన సొంత డబ్బుతో చేస్తానని ఒక ఎపిసోడ్ నడిపించారు. 

రెండో ఎపిసోడ్.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష వంతున ఆర్థిక సాయం చేయడం. ఈ రెండింటిలో రోడ్ల రిపేర్ల ఎపిసోడ్ ప్రహసన ప్రాయంగా జరిగింది. తూతూమంత్రపు పనులతో పవన్ తానేదో చేసినట్టుగా భావించారు తప్ప ప్రయోజనం దక్కలేదు. మళ్లీ ప్రభుత్వం ప్రతిచోటా రిపేర్లు చేయించాల్సి వచ్చింది. కౌలు రైతుల ఆత్మహత్యలకు సొమ్ములివ్వడం మాత్రం మంచి పని.. అందుకు అభినందించాలి. 

ప్రభుత్వం చేయూత అందించడానికి ఉండగల కొన్ని టెక్నికల్ ఇబ్బందులను తనకు అనుకూలంగా వాడుకుంటూ.. పవన్ కల్యాణ్ మొత్తానికి ఈ రైతుల కుటుంబాలతో సభలు పెట్టి.. వారికి చెక్కులు ఇచ్చి.. కొంత మైలేజీ సృష్టించుకున్నారు. ఈ రాజకీయ ఎత్తుగడ వర్కవుట్ అయింది. అక్కడితో.. తాను మెసయ్య పాత్రలో ఉన్నట్లుగా ఆయనకు ఓ నమ్మకం కూడా కలిగింది.

అలా ‘జనవాణి’కి శ్రీకారం..

ఇప్పుడు జనసేన తరఫున మరో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు. ‘జనవాణి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అయిదు ఆదివారాల పాటు పవన్ కల్యాణ్.. ప్రజల నుంచి నేరుగా వారి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారట. ఆ అర్జీలను సంబంధింత ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్తారట. అర్జీలు ఇచ్చిన వారికి ఒక రసీదు కూడా ఇస్తారట. ‘‘పవన్ కల్యాణ్ గారికి విన్నవించుకుంటే తమ సమస్య పరిష్కారం అయిపోతుందనే భావన ప్రజల్లో బలపడిపోయిందిట’’ అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నారట. 

ప్రజలు తమ సమస్యలను పవన్ కల్యాణ్ కు చెప్పుకుంటే ఆయన ఏం చేస్తారు? కనీసం శాసనసభలో ఆ అంశాన్ని వినిపించే స్థాయి, బలం కూడా లేని నాయకుడు ఏం చేస్తాడు. ఉదాహరణకు తీసుకుంటే.. అమరావతి, విశాఖ ఉక్కు విషయంలో ఏం చేశాడు. కేంద్రంలోని బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని.. వారిద్వారా తనకు చేతనైతే ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేకపోయాడు? 

తనకు ఎంపీలు లేరని బీద మాటలు కాదు.. మోడీ , అమిత్ షా తాను చిటికేస్తే పలుకుతారని చెప్పుకునే నాయకుడు వారిద్వారా రాష్ట్రానికి అనుకూలంగా ఏం సాధించాడని ప్రజల ముందుకు వెళ్లగలడు? అమరావతి రైతుల విషయంలో ఒకటి రెండు సార్లు షూటింగ్ గ్యాప్ లో వారి శిబిరాల్లో కూర్చోని మాటలు చెప్పడం తప్ప క్రియాశీలంగా ఏమీ చేయలేకపోయిన అసమర్థుడు పవన్ కల్యాణ్. 

విశాఖ ఉక్కు విషయంలో ఒకే సభలో పాల్గొని.. తన అజ్ఞానాన్ని చాటుకుంటూ ఆ విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని జగన్ ను నిందించి, కేంద్రాన్ని పల్లెత్తు మాట అనుకుండా.. ఆ సమస్యను తన మిత్రపక్షం బిజెపి దృష్టికి తీసుకెళ్లకుండా అక్కడి విశాఖ ఉక్కు పోరాటాన్ని వంచించిన నాయకుడు పవన్ కల్యాణ్! 

ఆయన ఇప్పుడు ప్రజలు వచ్చి నేరుగా తనకు ‘జనవాణి’ రూపంలో సమస్యలు చెప్పుకుంటే వాటిని తీర్చేస్తాడట. ఏమిటీ కామెడీ!

జనవాణి ఓ రాజకీయ డ్రామా

తన పార్టీని ఇప్పటినుంచే ఎన్నికలకు ఆయత్తం చేస్తున్నారు పవన్ కల్యాణ్. ప్రజలందరినీ నేను ఉద్ధరించేస్తాను అనే బిల్డప్ కోసం ఈ జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లూ పవన్ నడిపించిన ప్రజా ఉద్యమ ఎపిసోడ్ లన్నీ ఒక ఎత్తు. తాజా డ్రామా ‘జనవాణి’ ఒక ఎత్తు! ముఖ్యమంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించే తరహాలో.. పవన్ కల్యాణ్ ఒక చోట కూర్చుంటే ప్రజలంతా వచ్చి ఆయనకు తమ కష్టాలు అర్జీల రూపంలో ఇచ్చుకోవాలి. వాళ్లకు రసీదులు ఇస్తారు. ఆ అర్జీలను ప్రభుత్వాధికారులకు పంపిస్తారు. 

చూడబోతే ఇది కొరియర్ పాత్ర లాగా కనిపిస్తోంది తప్ప.. రాజకీయ కార్యకలాపం లాగా లేదు. ఆ సమస్యపై అధికారులు ఏం చేశారో ఫాలో అప్ చేస్తారట. కొరియర్ పాత్రను ఇంకా పచ్చిగా చెప్పాలంటే దళారీ పాత్ర. మామూలు దళారీలో ఒక పని చేసి డబ్బులు కమిషన్ అడుగుతారు. పవన్ కల్యాణ్ ఇక్కడి అర్జీలు అక్కడ చేరవేసి.. ఓట్లు అడుగుతారు. దానికి తగ్గట్టుగానే.. ఇదివరకు కార్యక్రమాలకు లేని రీతిలో.. జనవాణి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సి బ్యానర్ల మీద ‘‘గ్లాసు గుర్తుకే మీ ఓటు’’ అనే ముక్క కూడా జత చేశారు. బహుశా ప్రజలకు ఇచ్చే రసీదుల మీద కూడా ‘గ్లాసు గుర్తుకే మీ ఓటు’ అని ముద్రించినా ఆశ్చర్యం లేదు. 

వీళ్ల ఫాలో అప్ ఎవడికి కావాలి? ప్రజలు చెప్పిన  సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, అధికారులకు ఒక మెయిల్, ఒక వాట్సప్.. ఆ తర్వాత ‘ఫాలో అప్ చేశాం’ అంటూ అర్జీ ఇచ్చిన ప్రజలకు, పేదలకు ఒక మెసేజీ.. ఈ డ్రామా కాకుండా.. వారు అర్జీలు ఇచ్చిన సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వంతో పోరాడే దమ్ముంటేనే పవన్ కల్యాణ్ ఇలాంటి కార్యక్రమం చేయాలి. అలా కాకుండా.. కొరియర్ పాత్ర కోసం ఇంత ప్రహసనం ఎందుకు? 

పవన్ కు స్పష్టత ఉండాలి..

‘ఆకలేసిన వాడికి చేపను యివ్వడం కాదు.. చేపలు పట్టడం నేర్పు’ అంటుంది ఇంగ్లిషు సామెత. ఇలాంటి సామెతల్ని పవన్ కల్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. అలాగే.. ప్రజల సమస్యల అర్జీలను తాను కొరియర్ గా అధికార్లకు చేరవేయడం, ఫాలో అప్ చేయడం కాదు.. ఆ అర్జీలు ప్రజలు ఇస్తేనే.. వాటికి పరిష్కారం దొరికేలా ప్రభుత్వంలో మార్పు వచ్చేలా పోరాడడం నాయకుడి లక్ష్యం. 

దమ్ముంటే అలాంటి పోరాటం చేయాలి! సమస్యలను ప్రజలు ప్రభుత్వంతో చెప్పుకోవాలి.. ప్రభుత్వం ద్వారా పరిష్కారం పొందాలి అనే వాతావరణం సృష్టించాలి. ప్రభుత్వం అంటే వైఎస్సార్సీపీ పార్టీ కాదు. అది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలి. ఆ మార్పును తేగలిగితే, కనీసం ఆ మార్పుకోసం ఎటెంప్ట్ చేయగలిగితే పవన్ హీరో కింద లెక్క!

అలా కాకుండా ప్రజల అర్జీలకు కొరియర్ పాత్ర పోషిస్తూ.. తనకు దీనజన బంధు కితాబు కోరుకుంటే తప్పు! పవన్ ద్వారా వచ్చిన అర్జీలను ప్రభుత్వం పనిగట్టుకుని పక్కన పెడితే.. అందువలన ప్రజలకు, పేదలకు.. నేరుగా ప్రభుత్వాన్ని ఆశ్రయించడం ద్వారా కాగల పని కూడా ఆగిపోతే.. అందుకు పవన్ బాధ్యత వహిస్తారా? ఇలాంటి సందేహాలు అనేకం కలుగుతున్నాయి. 

ప్రజలకోసం పోరాడే స్ఫూర్తి లేకుండా.. జనవాణి లాంటి డ్రామాలు ఎన్ని నడిపించినా ఉపయోగం లేదు. పోరాడే స్ఫూర్తి అంటే.. మళ్లీ సీజనల్ మీటింగుల్లా కాదు.. ఒక సమస్యను టేకప్ చేస్తే అది పరిష్కారం అయ్యేవరకు ఆ పోరాటాన్ని కొనసాగించడం. అది కూడా ఒక షూటింగ్ లాగా కాల్షీట్లు కేటాయించకుండా.. అంకిత భావంతో పనిచేయడం. ఆ సంగతి పవన్ గుర్తించాలి.

.. ఎల్. విజయలక్ష్మి

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి