వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పరువు పోయింది. తన నియోజక వర్గ పరిధిలోని భీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహాష్కరణకు ప్రధాని మోదీ వస్తుండడంతో, ఆయనతో పాటు పాల్గొనాలని రఘురామకృష్ణంరాజు తపించారు. ఎలాగైనా అక్కడికి వెళ్లాలని గట్టి పట్టు పట్టారు. తనకెలాంటి అడ్డంంకులు సృష్టించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఒకటికి రెండుసార్లు ఆయన ఆశ్రయించారు. అంతా చేసి, చివరికి పలాయనం చిత్తగించారు.
కోటలు దాటేలా మాటలు మాట్లాడే రఘురామకృష్ణంరాజులో పిరికితనం ఏ స్థాయిలో గూడుకట్టుకుని వుందో అల్లూరి 125వ జయంతి వేడుక నిరూపించింది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్లాలని కలలుగన్న పెద్ద మనిషి, ఆ మహనీయుడి స్ఫూర్తి తీసుకుని భీమవరంలో ఎందుకు అడుగుపెట్టలేదో అర్థం కాదు.
నిజంగా అల్లూరి సీతారామరాజు అంటే రఘురామకు గౌరవం వుంటే ఆయన్ను ఆదర్శంగా తీసుకుని భీమవరం వెళ్లేవారు. అక్కడికి వెళితే ఏమవుతుంది? ఎవరేమంటారు? ఆయనకెందుకంత భయం? ఒకవేళ అడ్డంకులు ఎదురైతే మాత్రం తిప్పికొట్టలేని అసమర్థ, చేతకాని నాయకుడా రఘురామ? ఇంతకాలం ఆయన తొడకొట్టడాలు, మీసాలు తిప్పడాలు… అన్నీ ఆంధ్రాకు అవతలి వైపేనా? ఆంధ్రాకు వస్తే ఆయన పిల్లిలా …లేదు లేదు తనను అవమానిస్తున్నారని మార్జాలం పరువు నష్టం కేసు వేస్తుందేమో!
అల్లూరి సీతారామరాజు… రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు. బ్రిటీష్ పాలకుల చేతిలో ప్రాణాలు కోల్పోయే నాటికి ఆయన వయసు కేవలం 27 ఏళ్లు. అయితేనేం, ఆయన తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు. ఆంగ్లేయుల తుపాకులకు ఎదురొడ్డి దమ్ముంటే కాల్చుకోండ్రా అని గుండెలు చూపిన అల్లూరి సీతారామరాజే మనకెప్పటికీ గుర్తుండిపోతారు. అల్లూరి సీతారామరాజు అంటే వ్యక్తి కాదు, ఆయనో శక్తి. ఆయన్ను తలచుకుంటే ఓ ఉత్తేజం, ఉత్సాహం. అల్లూరి పోరాటాలు గుర్తుకొస్తే పిరికివాళ్లు సైతం పిడికిళ్లు బిగిస్తారు. అల్లూరి అంటే ధైర్యం, సాహసం.
మరి రఘురామకృష్ణంరాజు ఎందుకు వెనకడుగు వేసినట్టు? భీమవరం వెళ్లేందుకని లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. వెంటనే బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగిపోయారు. ఏపీ పోలీసులు తనను అనుసరిస్తున్నారనే సాకు చూపి ఆయన పలాయనం చిత్తగించారు. మరోవైపు ఇప్పటికే తన అనుచరులపై కేసులు పెట్టారని, తాను వెళితే వారికి మరిన్ని ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో వెనుదిరిగినట్టు ప్రచారం చేస్తున్నారు.
ఆల్రెడీ కేంద్ర బలగాల భద్రతలో ఉన్న రఘురామకృష్ణంరాజు తనకు రాష్ట్ర పోలీసులు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో ఏపీ పోలీసులు తనను వెంబడిస్తున్నారనే అనుమానంతో కనీసం హైదరాబాద్ కూడా దాటకుండానే వెనక్కి పరుగుతీయడం దేనికి నిదర్శనం? ఏపీ పోలీసుల రక్షణ కోరినప్పుడు బుద్ధి ఏమైంది? ఇప్పుడు అదే పోలీసులు వెంటాడుతున్నారని సాకు చెప్పడం ఏంటి?
అల్లూరి సీతారామరాజును మనసులో తలుచుకుని, ఆయన స్ఫూర్తితో అవసరమైతే ఏపీ పోలీసులకు గుండెలు చూపి కాల్చుకోండ్రా అని రఘురామ అని వుంటే… ఆయన క్రేజ్ అమాంతం పెరిగేది. అల్లూరి సీతారామరాజు మళ్లీ పుట్టాడురా అని సొంత సామాజిక వర్గం వాళ్లే కాదు, తెలుగు సమాజం గర్వపడేది. భీమవరం వెళుతున్నట్టు బిల్డప్ ఇచ్చి… పక్క స్టేషన్‌లో దిగిపోయిన ఆయనకు ఎలా వుందో కానీ, అభిమానులు మాత్రం అవమానంతో కుంగిపోతున్నారు. ఈ బతుక్కంటే ఏ నీళ్లు లోని బావిలో దూకడం మంచిదేమో అన్నంత విరక్తి కలుగుతోందని ఆయన అభిమానులు తీవ్ర నిరాశనిస్పృహతో వాపోతున్నారు. పిరికివాళ్లకు రాజకీయాలెందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రఘురామకృష్ణంరాజు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పిరికితనానికి, చిల్లరతనానికి, కృతఘ్ఞతకు …అన్నింటికి మించి ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, మనిషిగా కూడా ఎలా వుండకూడదో భావి తరాలకు తెలియజెప్పడానికి ఈ కాలం మహనీయుడి విగ్రహం పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుందని నెటిజన్లు సెటైర్స్ విసురుతుండడం గమనార్హం. ఒకే ఒక్క వెనకడుగు రఘురామ పరువు మొత్తాన్ని గంగలో కలిపేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సొదుం రమణ