రాణిగారి తమ్ముడంటే రాజుగారి బావమరిది. రాజు కంటే పవర్ ఫుల్. రాజకీయ నాయకుల అనుచరులు, బంధువుల అతి లేని ఆ రోజుల్లోనే ఈ క్యారెక్టర్ని కెవి.రెడ్డి కనిపెట్టాడు. నిజానికి రాజుగారి పేరు మీద బావమరుదులు చెలాయించడం ప్రాచీన కాలంలోనే వుంది. భారతంలో కీచకుడు, మృచ్ఛ కటికం నాటకంలో శకారుడు వీళ్లే.
ఈ నమూనాతో పాతాళభైరవిలో శీను (రేలంగి)ని కెవి సృష్టించాడు. రేలంగి హాస్యానికి హాస్యం, కథని మలుపు తిప్పే కీలక పాత్ర కూడా. ఇతని అసూయ వల్లే మాంత్రికుడికి పాతాళభైరవి దొరుకుతుంది.
రేలంగి ఇంట్రోనే తమాషాగా వుంటుంది. ఒకడు భయంగా చూస్తూ రాణిగారి తమ్ముడు అని అరుస్తాడు. అన్నట్టుగానే వచ్చి వినోదానికి పన్ను ఇవ్వమంటాడు. అక్కడ జనం ఒంటిమీద ఉన్న కండువా, తలపాగా, పాత్రలు ఏవీ వదలడు. హీరో తంతూ వుంటే నేను రాణిగారి తమ్మున్ని అని బెదిరిస్తాడు. అయినా తన్నులు తప్పవు. మా బావతో చెప్పి మీ తల తీయిస్తా అని పారిపోతాడు.
అన్నట్టుగానే రావడం రావడమే ఏం చెబుతాడంటే “రాజద్రోహం, పన్నులు కట్టరట, రాజు ఎంత” అన్నట్టు చాడీలు చెబుతాడు. వాస్తవంగా జరిగింది ఒకటైతే, రాజుకి చేరే సమాచారం ఇంకొకటి. తమకు అనుకూలమైన సత్యాన్ని తయారు చేసి చెప్పాడు. తమ్ముడి మాటలు నిజమో కాదు అవసరం లేని రాణి వెంటనే ద్రోహుల తలలు తీయమని రాజుకి చెబుతుంది. రాజుకి విజ్ఞత లేకపోతే నిజంగానే తలలు పోయేవి. ఒక మనిషి చేస్తే హత్యే. అదే పని రాజ్యం చేస్తే శాంతిభద్రతల రక్షణ. రాజుల కాలం నుంచి ఇదే.
తాను తన్నులు తిన్న విషయం వదిలేసి తోట రాముడు రాజు కావాలట, వాడి స్నేహితుడు మంత్రి కావాలట అని రేలంగి చెబుతాడు. అధికారానికి ముప్పు, కుట్ర జరుగుతోంది అంటే ఎవరైనా విచక్షణ కోల్పోతారు. కానీ రాజుకి బావమరిది సంగతి తెలుసు. అలాగని రాణిని చిన్నబుచ్చలేడు.
తోట రాముడుని పిలిపిస్తాడు. జరిగింది అర్థమవుతుంది. బావమరిది చాడీలు వినే అలవాటే వుంటే తోట రాముడూ లేడు, పాతాళభైరవి లేదు.
హీరో రహస్యంగా కోటలో ప్రవేశించినప్పుడు వెలుగునీడల్లో రేలంగి ముఖంలో కనిపించిన క్రూరత్వం కెవి.రెడ్డి, కెమెరామన్ మార్కస్ బారట్లే ప్రతిభ.
వీధిలో నేపాళ మాంత్రికుడు వినోద ప్రదర్శన చేస్తున్నప్పుడు రేలంగి అవసరం లేదు. కానీ మాంత్రికున్ని రేలంగి చూడడం తర్వాత ఎప్పుడో వచ్చే సీన్లో అవసరం. అది కెవి స్క్రీన్ ప్లే ప్రతిభ.
మాంత్రికునితో కూడా రేలంగి వినోదపు పన్ను అడుగుతాడు. ఫలితంగా ఆడవేషం. చివరికి మాంత్రికుని కాళ్ల మీద పడి శరణు కోరుతాడు. తోట రాముడు సంపదలతో వచ్చి, విగ్రహం సాయంతో మాయామహల్‌ని సృష్టిస్తాడు. అసూయతో తోట రాముడి గొప్పతనాన్ని రేలంగి ఒప్పుకోడు.
ఇందుమతి (హీరోయిన్) తనకు దక్కలేదనే బాధతో రేలంగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. నిజానికి చనిపోయేంత ధైర్యవంతుడు కాడు. కానీ ఆ సీన్‌ని అట్లా డిజైన్ చేస్తేనే మాంత్రికుడి మాటలు నమ్మి విగ్రహాన్ని తెచ్చిస్తాడు.
అసూయపరుడు, క్రూరుడు, అమాయకుడు ఇన్ని లక్షణాలని రంగరించి అతని ప్రతిమాటని, కదలికని స్క్రీన్ మీద కెవి చూపించాడు. అందుకే 60 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమా గుర్తుంది.
జీఆర్ మహర్షి