రానున్న ఎన్నికల్లో రెడ్డి నాయకుడి మీద కాపు నాయకత్వం, కమ్మ నాయకత్వం కలిసి పోరాటం చేస్తున్నట్టు కాపు నాయకుడు ప్రకటించాడు. ఆ ప్రకటనలో భాగంగా తమతో భాజపా కూడా కలుస్తుందని గట్టిగానే చెప్పాడు.
ఎప్పటి నుంచో “భాజపా కటాక్ష యాగం” చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు. ఆ యాగంలో హవిస్సుగా పవన్ కళ్యాణ్ ని వాడుకుంటూనే ఉన్నారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ భాజపా-తెదేపా పొత్తుకి ఉపయోగపడతాడని ఆయన నమ్మకం. అందుకే పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడిగా దగ్గరకు తీసుకోవడం, ఆలనా పాలనా చూడడం ఆయన బాధ్యతగా తీసుకున్నాడు.
భాజపా పొత్తు లేని తెదేపా-జనసేన కూటమి జగన్ మోహన్ రెడ్డి ని రాజకీయంగా కొట్టేందుకు సరిపోదని చంద్రబాబు-పవన్ ల ప్రగాఢ నమ్మకం. అంటే వారి మీద వారికి అంత అపనమ్మకం.
ఒకవేళ భాజపా ఆఖరి నిమిషంలో కలిస్తే ఏంటి? కలవకపోతే ఏలా ఉంటుంది?
ఈ రెండు విషయాలూ ఇప్పుడు చర్చించుకుందాం.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టినా మొహం చూపించని వైనం నరేంద్రమోదీ, అమిత్ షా లది. ఏవో ఒకటి రెండు కార్యక్రమాల్లో మోదీ ఎదురుపడగానే చంద్రబాబు కరచాలనం చేస్తేనో, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా పక్కన చంద్రబాబు కూర్చునే పరిస్థితి వస్తేనో… ఆ ఫోటోలనే స్వకుల తెలుగు మీడియాల్లో ఊదరగొట్టి తృప్తి చెందారు. భాజపాకి-తెదాపాకి సంబంధాలు బలపడుతున్నాయనే సంకేతాలు జనంలోకి పంపే ప్రయత్నాలు చేసారు.
అంతే తప్ప ఇంతవరకూ నిజంగా భాజపాకి, తెదేపాకి మాటల్లేవు.
అయినప్పటికీ ఒకవేళ భాజపా అకస్మాత్తుగా పొత్తుకి సై అంటే తెదేపా, జనసేన వర్గాల్లో అనందానికి హద్దులుండవు. ఇక వైకాపా పని అయిపోయినట్టే అని రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తుని ఊహించుకుంటారు.
కానీ గుజరాతీ రాజకీయ నాయకుల తెలివితేటల ముందు మన కమ్మ, కాపు నాయకుల అరకొర తెలివి పనికిరాదు.
మనల్ని శత్రువుగా భావించేవాడు మనం వేడుకున్నామని పొత్తుకు రమ్మంటే ఏ ఆలోచనతో వస్తాడో ఊహించాలి.
ఆ ఆలోచనని ఊహించే ముందు ఒక్కసారి నేపథ్యాన్ని నెమరేసుకుందాం.
2014-2019 మధ్యన భాజపాతో అంటకాగిన చంద్రబాబు సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకి ఆర్నెల్ల ముందు భాజపాతో తెగ తెంపులు చేసుకుని, మోదీని అనరాని మాటలూ అని, అమిత్ షాని అవమానించి, ఆ పైన కాంగ్రెసుతో జట్టు కట్టాడు.
దానికి కారణం “ప్రత్యేక హోదా” డిమాండు కోసమని తెలుగు వోటర్స్ ని మభ్యపెట్టే పని చేసినా అసలు విషయం అది కాదు.
మోదీపై దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, కనుక మోదీతో సంబంధం పెట్టుకునే కంటే కాంగ్రెసు పక్కలో దూరడం మంచిదని ఒక మీడియా ప్రబుద్ధుడి సలహాని విని చంద్రబాబు అంతటి సాహసం చేసాడు.
తీరా ఏమయ్యింది?
కొంప మునిగింది.
సెంటర్లో భాజపా నెగ్గింది, స్టేట్ లో తెదేపా ఓడింది.
నిజంగా ఇక్కడ తెదేపా ఓడినా భాజపాతో పొత్తు వీడకుండా ఉండుంటే చంద్రబాబుని మోదీ-షాలు శత్రువుగా చూసేవారు కాదు.
ఆ శత్రుత్వమే మోదీ-షాలని జగన్ ని దగ్గరకు చేర్చుకునేలా చేసింది. శత్రువుకి శత్రువు మిత్రుడనే ఫార్ములా ఇక్కడ పనిచేసింది.
ఆ తర్వాత ఎప్పుడూ జగన్ వల్ల మోదీ-షాలకి ఇబ్బంది తలెత్తలేదు.
2019 నుంచి ఇప్పటివరకు మోదీ-షాల లక్ష్యం ఒక్కటే. తమని వెన్నుపోటు పొడిచి అవమానించిన నమ్మకద్రోహి చంద్రబాబుని రాజకీయంగా భూస్థాపితం చేసేయాలన్నది.
అంటే కేవలం కక్షసాధింపేనా అంటే కాదు!
ఇక్కడ రాజకీయ దూరదృష్టి కూడా ఉంది.
అందుకే గుజరాతీ బుర్రలన్నది!!
అదేంటంటే…తెదేపా తెలంగాణాలో ఎలాగో చచ్చిపోయింది. ఆంధ్రలో కూడా పూర్తిగా చచ్చిపోతే ప్రస్తుత తెదేపా నాయకులు, కేడర్ అంతా భాజపాలోకి జంపవ్వడం తప్ప వేరే మార్గముండదు.
తమని తాము కాపాడుకోవాలంటే ఆ నాయకులకి అదొక్కటే దారవుతుంది.
2019లో ఎన్నికల ఫలితం రాగానే సుజనా చౌదరి, సీయం రమేష్, టీజీ వెంకటేషులు కాషాయ కండువా కప్పుకుంటే ఈసారి 2024లో అలా కప్పుకునేవాళ్లు చాలామంది ఉండొచ్చు. తెదేపా-జనసేన కూటమి ఓడితే మాత్రం జరిగేది ఇదే.
అలా తమ పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులతో ఆంధ్రలో భాజపాకి కాస్త ఫేస్ వేల్యూ తీసుకురావొచ్చు. ఇప్పుడు మిత్రుడిగా కనిపిస్తున్న జగన్ మోహన్ రెడ్డి అప్పుడు రాజకీయ ప్రత్యర్థి కావొచ్చు. అది పరిస్థితుల్ని బట్టి అమలు పరచగలిగే భవిష్యత్ ప్రణాళిక.
ఇదంతా జరగాలంటే ముందుగా తెదేపా-జనసేనలు ఆంధ్రా మ్యాపులో కనపడకుండా చేయడమే భాజపా లక్ష్యం.
ఇంత నేపథ్యం నెమరేసుకున్నాక ఒక్కసారి భాజపా కూటమిలో కలిస్తే ఏమౌతుందో ఆలోచించండి!
పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కచ్చితంగా మహాభారతంలో శకునిలాగ తేదేపా-జనసేనలకి చావుదెబ్బ కొట్టడానికే కలుస్తుంది.
మొత్తం175 సీట్లలో కొన్ని జనసేనకి పోను మిగిలిన వాటిల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లను అడుగుతుంది భాజపా. ఒప్పుకుంటేనే పొత్తుకు ఒప్పుకుంటాననొచ్చు. అసలే డిస్పరేట్ గా ఉన్న చంద్రబాబు-పవన్ లు వెంటనే సై అనొచ్చు.
ఎందుకంటే ఆ పుచ్చుకున్న సీట్లను గెలవడానికి భాజపా తన యుక్తిని, అధికార శక్తిని బలంగా వాడుతుందని మన కమ్మ-కాపు పెద్దలు నమ్మొచ్చు. భాజపా కూడా నమ్మించొచ్చు.
కానీ ఆ సీట్లల్లో అధిక శాతం తెదేపా గ్యారెంటీగా గెలిచే సీట్లను కోరచ్చు భాజపా. పొత్తు కోరుకున్నది చంద్రబాబే కాబట్టి చచ్చినట్టు కోరిన సీట్లు భాజపాకి రాసిచ్చే దుస్థితి తలెత్తొచ్చు.
తమ అధికార బలాన్ని వాడతాం తప్ప ఖర్చులు తమకి సంబంధం లేదని, తమకి ఇచ్చిన సీట్లకి సంబంధించిన ఖర్చులు కూడా చంద్రబాబునే పెట్టుకోమని చెబుతుంది భాజపా.
ఆల్రెడీ జనసేన కేడిడేట్స్ ఖర్చులన్నీ తెదేపాయే పెట్టుకోవాలి. ఇప్పటికే జనసేన కోసం బోలెడంత ఖర్చు పెట్టుకుంది తెదేపా.
ఇంతేసి ఖర్చులు పెట్టుకున్నాక అసలీ పొత్తుకి అర్ధముంటుందా అనేది ఒక లెక్క!
పోనీ, ఇంతా చేస్తే ఫలితం ఏమవుతుందో తెలుసా?
భాజపా ఏమీ పట్టించుకోకుండా చూస్తూ కూర్చోవచ్చు. లేదా ఏదో చేస్తున్నట్టుగా నటిస్తూ వైకాపాకి అడ్డు లేకుండా చేయొచ్చు. గట్టిగా అరిస్తే 2019లో చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుకి ఇది రెటర్న్ గిఫ్ట్ అని చేతులు దులుపుకోవచ్చు.
ఈ మాత్రం ఊహించడానికి పెద్ద రాజకీయ విశ్లేషణాశక్తి కూడా అవసరం లేదు. జస్ట్ కామన్ సెన్స్ అంతే!
అయితే డిస్పరేషన్లోనూ, ఫ్రస్ట్రేషన్లోనూ ఉన్నవాళ్లకి ఈ కామన్ సెన్స్ పని చెయ్యదు.
కాబట్టి, ఈ కథలో నీతి ఏంటంటే, కారడవిలో చిక్కుకున్న జింకపిల్లలు బయటికి దారి చెప్పమని సింహాన్ని సాయం అడక్కూడదు. నమిలి చప్పరించేస్తుంది.
కనుక భాజపాతో పొత్తు అనే పిచ్చి ప్రయత్నాలు మాని, తెదేపా-జనసేనలు కలిసి విజయమో, వీరస్వర్గమో అనుకుని ముందుకి దూకడమే సమంజసం.
గెలిస్తే రాజభోగం అనుభవించవచ్చు. ఓడితే భాజపాని తిట్టాల్సిన అవసరం లేకుండా పరస్పరం తిట్టుకుని కూర్చోవచ్చు.
ఎలా లెక్కేసుకున్నా 2024 లో మళ్లీ భాజపాయే కేంద్రంలోకి అధికారంలోకి వచ్చేది.
కనుక ఆ పార్టీని ఇప్పుడు పొత్తుకి పిలిచి రేపు తేడా వస్తే ఆ పార్టీ తొండాట ఆడిందని, “హిస్టారికల్ మిస్టేక్” అని స్టేట్మెంట్లు ఇచ్చి మరింత శత్రుత్వాన్ని పెంచుకోవడం మూర్ఖత్వమవుతుంది.
ఒకవేళ భాజపా కినుక రుచి ఇన్నళ్లుగా అనుభవిస్తున్న చంద్రబాబు నోరు మెదపకుండా కూర్చున్నా స్వకుల మీడియా, స్వకుల సోషల్మీడియా జనాలు భాజపా మీద విషం చిమ్మకుండా కూర్చోరు. చంద్రబాబుపై వారికున్న భక్తిప్రపత్తులు అలాంటివి మరి!
దానిని మోదీ-షాలు చంద్రబాబే వెనకుండి చెయిస్తున్నాడని నమ్మి కన్నెర్ర చేయొచ్చు. దాని ఫలితం ఇప్పటికంటే తీవ్రంగా ఉండొచ్చు.
ఎందుకిదంతా! అందుకే చేసే యుద్ధమేదో భాజపా లేకుండానే తెదేపా-జనసేన కూటమి చేస్తే కాలం కరుణించినా కరుణించవచ్చు. అలా కాదనుకుని భాజపాతో కలిస్తే తమ గొయ్యి తాము తీసుకున్నట్టే!!
శ్రీనివాసమూర్తి