మేనిఫెస్టో.. ఆద్యంతం డౌట్ఫుల్!

ఎక్కడైనా జనానికి మేలు చేసే ఒక పథకం కనిపిస్తే.. దానిని కాపీ కొట్టి మన ప్రజలకు కూడా మేలు చేద్దాం అనుకోవడం తప్పు కాదు. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో జనాన్ని ఆకట్టుకొన్ని ఒక్కొక్క పథకాన్ని,…

ఎక్కడైనా జనానికి మేలు చేసే ఒక పథకం కనిపిస్తే.. దానిని కాపీ కొట్టి మన ప్రజలకు కూడా మేలు చేద్దాం అనుకోవడం తప్పు కాదు. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో జనాన్ని ఆకట్టుకొన్ని ఒక్కొక్క పథకాన్ని, హామీని కాపీ కొట్టి.. వాటన్నింటినీ కలిపి కిచిడీ మేనిఫెస్టో తయారుచేసి జనానికి వడ్డించి మార్కులు కొట్టేయానుకోవడం కరక్టేనా?

ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఎంతో మేధావి, అనుభవజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అని భక్తులు కీర్తించే చంద్రబాబునాయుడు వద్ద.. రాష్ట్ర ప్రజల కోసం కనీసం ఒక్క సొంత ఆలోచన లేకపోయిందా? చంద్రబాబు నాయుడు బుద్ధి ఎంత దుర్బలమైన స్థితిలో ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది. సొంత ఆలోచన ఒక్కటైనా లేని నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

పది దిక్కుల నుంచి అరువు తెచ్చుకున్న ఆలోచనలను అడ్డగోలుగా కలిపేసి మాయమాటల ముసుగులో అందిస్తున్న తెలుగుదేశం మేనిఫెస్టో విశ్లేషణే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘‘చంద్ర ‘కిచిడీ’!’’

‘చిత్తశుద్ధి లేని శివపూజ యేలరా?’ అని సామెత. చిత్తశుద్ధి లేని ప్రజాసంక్షేమం గురించి, రాజకీయ ఓటు బ్యాంకు లక్ష్యాలతో ఆలోచనలు చేస్తే అది అచ్చంగా తెలుగుదేశం పార్టీ తొలివిడత మేనిఫెస్టో మాదిరిగానే ఉంటుంది. ఒక్క విషయంలోనైనా స్పష్టత ఇవ్వకుండా మేనిఫెస్టోను ప్రకటించడం అనేది చంద్రబాబుకు మాత్రమే చెల్లింది. ఈ తరహా మాటలతో ఇదివరకు చేసిన వంచనను ప్రజలు మరచిపోక ముందే.. చంద్రబాబు సరికొత్త పాత, కాపీ ఆలోచనలతో జనం ముందుకు వచ్చారు. చంద్రబాబు చెబుతున్న మాటలను ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మకూడదు? అనే కోణంలో ప్రతి హామీని తర్కించి చూడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రయత్నం.

చంద్రబాబు నాయుడు నిత్యశంకితుడు. తన నీడను కూడా నమ్మని వ్యక్తి. ఒకవేళ ఆయన ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతం అయినా సరే, ప్రజలు దానిని ఆదరిస్తున్నారో లేదో అని అనుమానించే తీరు ఆయనది! అందుకే ఇది అత్యద్భుత మేనిఫెస్టో అని, ఏకపక్షంగా తమ పార్టీని 2024లో అధికార పీఠం మీద కూర్చోబెడుతుందని తెదేపా నాయకులు ఎంతగా డప్పు కొట్టుకుంటున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం సందేహంలోనే ఉన్నారు. 

ఇటీవల విశాఖపట్నంలో పర్యటించినప్పుడు తనను కలిసిన నాయకులతో మేనిఫెస్టోకు ప్రజాదరణ ఎలా ఉన్నదని ఆరాలు తీయడమే అందుకు నిదర్శనం. ప్రజలు దానిని భిన్నాభిప్రాయం లేకుండా ఆదరిస్తున్నారనే విశ్వాసం ఆయనకు లేదు. ఎందుకంటే ఆ మేనిఫెస్టో ముసుగులో ఏయే అంశాలనైతే తాను దాచిపెట్టాడో, ఏయే దొంగచాటు వ్యవహారాలు దాని వెనుక ఉన్నాయో.. అందరికంటే బాగా చంద్రబాబుకే ఎక్కువగా తెలుసు. అందుకే తన లోపాయికారీ తెర వెనుక దాచిపెట్టిన ఆలోచనలను ప్రజలను గుర్తించేస్తారేమో అని ఆయనకు భయం. ఒకసారి జనం తన వంచనాత్మక ఆలోచనలను గుర్తిస్తే గనుక జీవితంలో ఇక ఎప్పటికీ క్షమించరని కూడా ఆయనకు అపారమైన నమ్మకం.

ఒకవైపు జగన్ మరియు ఆయన సచివులు.. చంద్రబాబునాయుడు మేనిఫెస్టో మీద ఎడాపెడా విరుచుకుపడుతూనే ఉన్నారు. కాపీ పేస్ట్ మేనిఫెస్టో అంటున్నారు. కాపీ హామీలా కాదా అనేది తర్వాతి సంగతి. ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలోని ‘హిడెన్ సంగతులు’ ఏమిటి? ఆ హామీల వెనుక ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి ఎంత? ప్రజలకు కలుగుతున్న అనుమానాలు ఎలాంటివి? అనే అంశాలను మాత్రం పరిశీలిద్దాం.

చంద్రబాబు తన తొలివిడత మేనిఫెస్టోలు ప్రధానంగా ఆరు అంశాలే ఉన్నట్టుగా డిజైన్ చేశారు. అందులో మహిళలకు సంబంధించిన ‘మహాశక్తి’ అనే కేటగిరీ కింద మొత్తం నాలుగు వరాలు ఉన్నాయి. అంటే మొత్తం 9 వరాలను, లక్కీనెంబర్ చూసుకుని మరీ, చంద్రబాబునాయుడు తన తొలివిడతగా ప్రకటించారన్నమాట. వాటిని విడివిడిగా పరిశీలిస్తే.. 

మహాశక్తి – ఆడబిడ్డ నిధి

రాష్ట్రంలో 18-59 ఏళ్ల మధ్య వయసు గల ప్రతి మహిళకు నెలకు రూ.1500 రూపాయలు వారి ఖాతాల్లో వేస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒక ఇంట్లో ఎందరు మహిళలు ఉంటే అంతమందికి కూడా ఇది వర్తిస్తుందని అన్నారు. ఈ డబ్బుతో వారిని మహాశక్తిగా తయారుచేస్తానన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు.

సందేహాలు:

‘రాష్ట్రంలోని ప్రతి మహిళకు’ అంటే అర్థం.. కుల మత, ధనిక పేద తేడాల్లేకుండా ప్రతి ఒక్కరికీ ఇస్తారా?

తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేద తరగతికి చెందిన మహిళలకు మాత్రమే ఇస్తాం అని గెలిచిన తర్వాత మెలిక పెడతారా?

వేరే పథకాల లబ్ధి పొందుతున్న, వికలాంగ, విడో పెన్షను లాంటివి పొందుతున్న మహిళలకు కూడా అదనంగా రూ.1500 ఇస్తారా?

ప్రతి మహిళ– అంటే రిటైరై పెద్దమొత్తాల్లో పెన్షను పొందే మహిళలు కూడా ఆ కేటగిరీలో ఉంటారా? వారిని మినహాయించేట్లయితే దానికి ప్రాతిపదిక ఏమిటి? అగ్రవర్ణాలు, సంపన్న వర్గాల వారిని కూడా తప్పిస్తారా?

‘తల్లికి వందనం’ (వైసీపీ- అమ్మఒడి), ‘అన్నదాత’ (వైసీపీ- వైఎస్సార్ రైతుభరోసా) కింద ప్రభుత్వం ఇచ్చే సొమ్ము పొందే తల్లులు, మహిళా రైతులకు కూడా ఈ ‘ఆడబిడ్డ నిధి’ అందుతుందా?

మహాశక్తి- తల్లికి వందనం

వేరే రాష్ట్రాలనుంచి, వేరే దేశాలనుంచి సంక్షేమ పథకాలను దాదాపుగా అందరూ కాపీ కొడుతూనే ఉంటారు. తుల్యంగా తమ బుర్రలోనే పుట్టిన ఆలోచనలను ప్రకటించే వారు అరుదు. కానీ.. చంద్రబాబు చాలా చిల్లరగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు అమలుచేస్తున్న అమ్మఒడి పథకాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టేసి, అదేదో అద్భుతం అన్నట్లుగా గప్పాలు కొట్టుకుంటున్నారు. జగన్ సర్కారు అమ్మ ఒడి కింద ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇస్తోంది. చంద్రబాబు ప్రకటించిన మొత్తం కూడా అంతే. ఏమాత్రం మార్పులేదు. కాకపోతే.. ఎందరు పిల్లలుంటే అందరికి లెక్కవేసి ఇస్తామన్న జగన్ దానిని ఆచరించలేకపోయారు. ఒక ఇంట్లో నలుగురు విద్యార్థులుంటే నలుగురి మొత్తాన్నీ ఆ తల్లి ఖాతాలో జమ చేస్తా అని చంద్రబాబు చెప్పారు. అది తప్ప ఇందులో కొత్తదనం లేదు. కానీ భయాలున్నాయి.

సందేహాలు:

జగన్ సర్కారు ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ తదితర అవసరాల నిమిత్తం ప్రతి తల్లికి ఇచ్చే రూ.15 వేలలో ఒక వెయ్యి రూపాయలు మినహాయించి, ప్రతి ఒక్కరికీ 14 వేలు మాత్రం జమచేస్తోంది. చంద్రబాబు కూడా అలాగే చేస్తారా? లేదా, మాట ఇచ్చినట్టుగా రూ.15వేల మొత్తం తల్లులకు ఇచ్చేస్తారా?

అలా చేస్తే పాఠశాలల నిర్వహణకు విడిగా నిధులు కేటాయిస్తారా? లేదా, వాటిని గాలికొదిలేస్తారా? స్పష్టమైన ఆలోచన, ప్రణాళిక ఉన్నాయా?

జగన్ సర్కారు మాదిరిగా ప్రెవేటు స్కూళ్ల విద్యార్థుల తల్లులకు కూడా ఇస్తారా? లేదా, గవర్నమెంటు స్కూళ్ల వారికి మాత్రం పరిమితం చేస్తారా?

ఈ డబ్బు కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చంద్రబాబు అర్థం లేని మాటలు చెబుతున్నారు. మరి ఎక్కువ మందిని కంటే వారి కాన్పు ఖర్చులు, బడిలో చేర్చే వరకు ఆ పిల్లలను పెంచడానికి అయ్యేఖర్చులు కూడా ఇవ్వడానికి ఏదైనా కొత్త పథకం ఉందా? రెండో విడత మేనిఫెస్టోలో వస్తుందా?

ఏటా మూడు సిలిండర్లు

చంద్రబాబు బుర్రలో పేస్ట్ అయిన మరో కాపీ ఆలోచన ఇది. ఇలాంటి విలువలేని ఆలోచనను కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఇటీవలి ఎన్నికల్లోనే ప్రకటించి బ్యాలెట్ పోరు ముందు ఢమాల్ మంది. అయినా సరే ఫ్లాప్ ఆలోచనను కూడా కాపీ కొట్టిన ఘనుడు చంద్రబాబు. తన చిన్నతనంలో తల్లి కట్టెల పొయ్యితో పడ్డ ఇబ్బందులు చూసి చలించిపోయినట్లు ఎమోషనల్ కలర్ కూడా పూశారు చంద్రబాబు.

సందేహాలు:

ప్రతి ఇంటికీ మూడు సిలిండర్లు అంటున్నారు. పేద వర్గాలకు, తెల్లరేషన్ కార్డు వారికి మాత్రమేనా? సంపన్నులకు కూడానా?

కట్టెల పొయ్యి వాడే పరిస్థితి మళ్లీ రానేకూడదని చంద్రబాబు జాలి కురిపిస్తున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు చాలకపోతే పరిస్థితి ఏమిటి?

ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.1200కు చేరుకుందని అంటున్న చంద్రబాబు.. ఆ ధర తగ్గించడానికి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీ ప్రకటించడం గానీ, రాష్ట్రం విధించే పన్నులను మినహాయించడం గానీ చేయగలరా?

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

ఇదిఇంకో కాపీపేస్ట్ ఆలోచన. మహిళా ఓటు బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టడానికి ఇవన్నీ ఆయన అరువు తెచ్చుకున్న అయిడియాలు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది. చెన్నై నగరంలో కూడా మహిళలకు ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణం ఉచితం. చంద్రబాబునాయుడు ఈ ఉచిత ప్రయాణవసతిని జిల్లాకు పరిమితం చేశారు. ఆడవాళ్లకు బస్సు ఎక్కడం, ఆఫీసులకు వెళ్లడం తానే నేర్పించాను అని చెప్పుకున్న చంద్రబాబు జిల్లావరకు ఉచితం అంటున్నారు.

సందేహాలు :

తెల్లరేషన్ కార్డు, ఆర్థిక తరగతుల విభజన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంలో ఉంటుందా?

నెలకు లక్షల్లో జీతం తీసుకునే మహిళా టీచర్లు, ప్రభుత్వోద్యోగులు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే పని స్థలాలకు వెళుతుంటారు. వారందరికీ ఉచిత ప్రయాణం సదుపాయం అందుతుందా?

ఆర్టీసీ బస్సుల్లో జిల్లా వరకు ఉచితం అంటే.. ఆర్డినరీ బస్సులు మాత్రమేనా? అన్ని రకాల బస్సుల్లో జిల్లా వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తారా?

యువగళం

యువగళం కింద ఒకటేగా కనిపించే రెండు విషయాలను చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రభుత్వోద్యోగాల కల్పన గురించి ఆయన ఎలాంటి హామీ ఇవ్వదలచుకోలేదు. ప్రెవేటు పరిశ్రమలను ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రానికి తీసుకువచ్చి.. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తానని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తానని అన్నారు. యువతకు రాజకీయావకాశాలు లాంటి చెత్తమాటలు చాలా చెప్పారు గానీ.. అసలు సంగతులు మాత్రం పరిగణిద్దాం.

సందేహాలు:

ప్రెవేటు పరిశ్రమల్లో 20 లక్షల ఉద్యోగాలు సరే.. ప్రభుత్వోద్యోగాల నోటిఫికేషన్ల సంగతి స్పష్టత ఉందా?

నిరుద్యోగ భృతి కింద రూ.3000 పొందడానికి అర్హత ఏమిటి?

కనీస విద్యార్హత పదో తరగతి అంటారా, డిగ్రీ అంటారా? పాసు అయితే మాత్రమేనా? ఫెయిలు అయితే కూడా ఇస్తారా?

గరిష్ట వయోపరిమితి ఏమైనా ఉందా? డిగ్రీ చదివి 50 ఏళ్లు దాటిన పురుషులు ఎవరైనా ఖాళీగా ఉంటే వారికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తుంటారా?

ఈ భృతి అందడానికి కూడా కులమతాల అడ్డుగోడలు, తెల్లరేషన్ కార్డు నిబంధనలు ఉంటాయా ఉండవా?

యువకులు ఎవరైనా ఏదైనా చిరుద్యోగంలో ఉండి, పని మానేస్తే వారికి కూడా భృతి అందుతుందా?

ప్రెవేటు పరిశ్రమల్లో ఒకసారి ఉద్యోగావకాశం కల్పిస్తున్నామంటూ యువతకు ఏదైనా అవకాశం చూపించి వారు అందులో జాయిన్ కాకపోతే గనుక.. భృతి ఇవ్వడం కంటిన్యూ చేస్తారా?

ఉద్యోగం అంటే చంద్రబాబు నిర్వచనం ఏమిటి? డిగ్రీ చదివి ఏ కిరాణాకొట్టులోనో, అసమీకృతరంగంలోనే పనిచేసుకుంటున్న వారికి నిరుద్యోగ భృతి వర్తిస్తుందా? వర్తించదు అంటే గనుక.. వారిని ఎలా గుర్తిస్తారు?

అన్నదాత

రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల రూపాయలు వారి ఖాతాల్లో వేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాన్నే , కొద్దిగా ఇంప్రొవైజ్ చేసి కాపీ కొట్టారు. జగన్ సర్కారు ప్రస్తుతం ప్రతి రైతుకు రూ.13,500 సాయం అందిస్తోంది. క్రమం తప్పకుండా వారి ఖాతాల్లో వేస్తున్నారు. దాన్నే చంద్రబాబునాయుడు, ‘అన్నదాత’ పేరుతో రామోజీరావు మూసేసిన పత్రిక పేరును అరువు తీసుకుని ఈ పథకాన్ని ప్రకటించారు.

సందేహాలు :

జగన్ ఇస్తున్న రూ.13,500 లో కేంద్రం ఇస్తున్న 7,500, రాష్ట్రం ఇస్తున్న 6,000 ఉంటున్నాయి. చంద్రబాబు కూడా ఇదే తీరుగా కేంద్రం ఇచ్చే దానికి అదనంగా రూ.12,500 జోడించి ఇస్తారా?

తాను హామీ ఇచ్చినట్లుగా ప్రతిరైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడాదికి రూ.20 వేలు ఇస్తారా? కేంద్రసాయం వారికి అదనంగా అందుతుందా?

ఈ పథకం ద్వారా ఇప్పుడు అందుతున్న వారికి మాత్రమే ఇస్తారా? తాను ప్రతి రైతుకు అని అంటున్నారు గనుక.. తెలంగాణ సర్కారు ఇస్తున్నట్లుగా ధనిక రైతులకు కూడా ఇస్తారా?  తెల్లరేషన్ కార్డుల నిబంధనలను వర్తింపజేస్తారా?

రూ.20 వేలు అనేది ఒక్కో రైతుకు ఇచ్చే మొత్తమా? ప్రతి రైతుకు వారికి ఉన్న ఒక్కో ఎకరాకు ఇచ్చే మొత్తమా? పది ఎకరాలు ఉన్న రైతులకు ఏడాదికి రెండు లక్షల వంతున ఇస్తారా?

ఒక కుటుంబంలో వేర్వేరు పేర్ల మీద యాభై ఎకరాలు ఉంటే పదిలక్షల మొత్తం కూడా ఇస్తుంటారా?

ప్రతి ఇంటికీ మంచినీళ్లు

ఈ పథకం అచ్చంగా తెలంగాణ సర్కారు నుంచి కాపీ చేసిన పథకం. మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ అమల్లోకి తెచ్చిన పథకం. ప్రతి ఇంటికీ తాగునీళ్లు ఇవ్వడం అనేది మంచి ఆలోచన. సంక్షేమం పేరుతో డబ్బు పంచి పెట్టే ఎన్నో రకాల పథకాల కంటె ఇది నిర్దిష్టమైన, నిర్మాణాత్మకమైన మంచి ఆలోచన. కాపీ కొట్టినా సరే, మంచి ఆలోచనను చంద్రబాబు కాపీ కొట్టారు.

సందేహాలు:

తెల్లరేషన్ కార్డు వంటి నిబంధనలు లేకుండా ప్రతి ఇంటికీ ఉచితంగా మంచినీళ్లు అందిస్తారా?

ఉచితంగా ఇచ్చే నీటికి ఒక లిమిట్ ఉంటుందా? లేదా? లిమిట్ దాటితే వడ్డించే రుసుములు ఎలా ఉంటాయి?

అపార్టుమెంటులు లాంటి వాటికి కూడా ఇదే పథకం కింద ఉచితంగా ఇస్తారా?

బీసీలకోసం చట్టం

ఇది ఒక మాయాపూరితమైన, వంచనాత్మకమైన హామీ. బీసీల రక్షణకు చట్టం అంటే ఏమిటి? ఎలాంటి ప్రమాదాల నుంచి ఎలాంటి రక్షణను చంద్రబాబు ఉద్దేశిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం లాంటిదే దుర్వినియోగానికి గురవుతున్నదని, ప్రత్యర్థుల మీద కేసులు బనాయించడానికి నాయకులు దీనిని వాడుకుంటూ ఉంటారని అనేక ఆరోపణలు వినిపిస్తుంటాయి. అలాగ బీసీ చట్టం కూడా తయారవుతుందా? దానిని మించి కులాల ప్రాతిపదికన రాష్ట్రప్రభుత్వం ఒక చట్టం తయారుచేసేస్తే.. దానికి కేంద్ర ఆమోదం లభిస్తుందా? జగన్ సర్కారు దిశ చట్టం వంటి అద్భుతమైన చట్టం తెస్తేనే, కేంద్రం వద్ద అతీగతీ లేదు. కానీ, జగన్ సర్కారు దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి.. దిశ యాప్ ను తీసుకువచ్చి.. దిశ చట్టం అలాగే కార్యరూపం దాల్చకపోయినా సరే.. దానికి తగ్గట్టుగా సేవలు అందిస్తోంది. 

సందేహాలు:

బీసీలను ఎటువంటి ప్రమాదాలనుంచి రక్షించడానికి ఈ చట్టం.

కేంద్రం ఈ చట్టాన్ని తిరస్కరిస్తే ఏం చేస్తారు. కేంద్రం మీద నెట్టేసి చేతులు దులిపేసుకుంటారా?

చట్టం రూపుదాల్చకపోయినా సరే.. చట్టం రూపంలో తాను సంకల్పించిన మేలు, రక్షణ బీసీలకు అందడానికి చంద్రబాబు ఏదైనా ప్రత్యామ్నాయ ఆలోచనలతో సిద్ధంగా ఉన్నారా? 

‘పూర్ టూ రిచ్’

చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలివిడత మేనిఫెస్టోలో బ్రహ్మపదార్థం వంటి వరం ఇది. చంద్రబాబు పేదలను ధనికులుగా మార్చేస్తారట. ఆయన వద్ద అబ్రకదబ్ర మంత్రదండం ఏమైనా ఉన్నదేమో తెలియదు. కానీ ‘పీ4’ అనే ఒక మంత్రాన్ని మాత్రం ఆయన బయటపెట్టారు. పీ4 అంటే ప్రభుత్వ, ప్రెవేటు, ప్రజల భాగస్వామం అట! సమాజంలో బాగా స్థిరపడిన వారు (?) ఒకరిని గానీ అంతకంటె ఎక్కువ మందిని గానీ దత్తత తీసుకుని పేదరికంనుంచి బయటకు తెచ్చి ధనికులుగా మార్చేయాలట.  ఆయన ప్రకటించిన మొత్తం తొమ్మిది వరాలలో ఇది చంద్రబాబునాయుడు సొంత, కొత్త ఆలోచన అందుకే కాబోలు ఇది పెద్ద కుట్ర లాగా, వంచనలాగా భయాలు రేకెత్తిస్తోంది.

సందేహాలు : 

బాగా స్థిరపడిన వారు అంటే ఎవరు? కొలబద్ధ ఏమిటి?

స్థిరపడిన వారు- అనే కొలబద్ధ కింద ఆ వర్గానికి చెందిన ప్రభుత్వోద్యోగులకు ఇలా దత్తత తీసుకోవడం అనేది కంపల్సరీ చేస్తారా? అలాంటి ఆలోచన ఉందా?

ఒక పేద కుటుంబాన్ని ధనిక కుటుంబంగా మార్చేయాలంటే.. బాగా స్థిరపడిన వారు ఏం చేయాలి? ధనవంతుల కొలబద్ధ చేరుకునే వరకు తాము సంపాదించిన మొత్తాన్ని ఆ పేదలకు దానం ఇవ్వాలా? అప్పు ఇవ్వాలా?

స్థిరపడిన వారు.. అలా పేద కుటుంబాలను దత్తత తీసుకుంటే వారికి ఒనగూరే లబ్ధి ఏమిటి? వారికేమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయా? లేదా ఇతరత్రా ప్రభుత్వం తరఫున రాయితీలు ఏమైనా అందుతాయా?

పూర్ టూ రిచ్ ప్రోగ్రాం కింద.. పేదవాళ్లు ధనికులుగా మారినట్టు ముద్ర వేయించుకుంటే.. ఇప్పుడు వాళ్లు పొందుతున్న సంక్షేమ పథకాలు అన్నీ వాళ్లకు ఆ తర్వాత కూడా అందుతాయా? లేదా?

రిచ్ గా మారినట్లు పేదల మీద బ్రాండ్ వేసేస్తే వారికి ఇచ్చే సకల సంక్షేమ పథకాలు ఎగవేయవచ్చుననే కుట్ర ఇది.. అవునా? కాదా?

క్రెడిబిలిటీ లేని నాయకుడు

చంద్రబాబునాయుడుకు ప్రజల దృష్టిలో ఉన్న క్రెడిబిలిటీని పరిగణనలోకి తీసుకోకుండా పరిశీలిస్తేనే.. ప్రతి వరం గురించి ఇన్ని సందేహాలు రేకెత్తుతున్నాయి. గెలిచే దాకా ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడే చంద్రబాబు బ్యాడ్ క్రెడిబిలిటీని పరిగణిస్తే గనుక.. ప్రతిదీ భయమే. పేదల్ని బాగు చేయడం కాదు కదా.. నట్టేట ముంచేస్తారనే అనుమానాలు ముప్పిరిగొంటాయి.

ముందే చెప్పుకున్నట్టు, చంద్రబాబునాయుడు తన నీడను కూడా నమ్మరు. నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజలను కూడా నమ్మరు. ఆయన తీరుకు తగ్గట్టుగానే ఆయనను కూడా ప్రజలు నమ్మరు. అందుకే వరాలు బాగున్నా సరే.. రాగాలుతీసి మరీ ప్రకటించిన చంద్రబాబు.. ఒకవేళ గెలిస్తే ఆచరణలో ప్రతి పథకానికి ఎన్నెన్ని ఫిటింగులు పెడతారో అని ప్రజలు భయపడుతున్నారు.

చంద్రబాబునాయుడును ఒక విషయానికి అభినందించాలి. ప్రజల్లో క్రెడిబిలిటీ విశ్వసనీయత లేకుండానే.. సుదీర్ఘానుభవం ఉన్న నాయకుడిగా, సుదీర్ఘ కాలం ఏపీని పాలించిన సీఎంగా ఆయన రికార్డులు సృష్టించారు. ఈ మేనిఫెస్టో వరాలు ఓకే. అయితే గ్రేట్ ఆంద్ర వ్యక్తం చేసిన సందేహాలు అన్నింటినీ ఆయన నివృత్తి చేయగలగాలి. ఆ వరాలను ప్రజలు ఆశిస్తున్నట్టుగా అమల్లోకి తెస్తే తప్ప (ఒకవేళ గెలిస్తే) ఆయన జనం విశ్వసనీయతను పొందడం జరగదు గాక జరగదు.

.. ఎల్. విజయలక్ష్మి