నలభయ్యేళ్ల సుదీర్ఘమైన చరిత్ర.. సుదీర్ఘకాలం అధికారం కూడా వెలగబెట్టిన చరిత్ర.. మొన్నమొన్నటివరకు కాంగ్రెస్ పార్టీకి తెలుగు నేలమీద ఏకైక ప్రత్యామ్నాయంగా వెలుగొందిన చరిత్ర.. కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ అయినప్పటికీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అతి ఎక్కువ సీట్లతో కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అన్నటువంటి చరిత్ర.. ఏమైపోయాయి ఈ చారిత్రక అద్భుతాలన్నీ!
పార్టీని దిగ్విజయంగా ప్రారంభించి నడిపిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పగ్గాలు పుచ్చుకున్న తర్వాత.. చంద్రబాబునాయుడు చేసిన సంస్థాగత నిర్మాణం మొత్తం డొల్లేనా? ఆయన ఒక్కడూ అరెస్టు అయితే పార్టీ మొత్తం పేకమేడ కూలిపోయినట్లుగా శిథిలమవుతున్నదేమిటి? చంద్రబాబు స్వార్థం, అధికార వ్యామోహం తెలుగుదేశం పార్టీకి ఏరకంగా శాపంగా మారుతున్నాయో.. తాజా నిదర్శనాల నుంచి నిరూపిస్తున్నదే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘అనాథ ‘దేశం’!’
‘‘తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం’’ ఈ మాటను కొన్ని లక్షల, కోట్ల సార్లు తెలుగు ప్రజలు విని ఉంటారు. కార్యకర్తల ఎదుట నిల్చుని వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏదో మెరమెచ్చు మాటలు చెప్పడంలో భాగంగా మాత్రమే కాదు, పార్టీ సంక్షోభంలో పడిన, ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ కూడా ఆ పార్టీ అధినాయకులు ఇదే మాటలు చెబుతూ ఉంటారు. పార్టీ దెబ్బతిన్నప్పుడు కూడా.. ఈ మాటలతోనే గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు.
అక్కడికేదో ఈ మాటలు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతాయనే భ్రమలను వారు వ్యాప్తిచేస్తుంటారు. ఎంత దారుణంగా అంటే.. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంతర్ధానం అయిపోయిన తర్వాత కూడా.. చంద్రబాబునాయుడు మాత్రం.. ఇదే మాటలు వల్లిస్తుంటారు. నాయకులు తమ తమ స్వార్థం చూసుకుని ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు గానీ.. కార్యకర్తల బలం, ప్రజల్లో అభిమానం పార్టీకి ఇప్పటికీ పదిలంగానే ఉంది అని వాళ్లు చెప్పుకుంటూ ఉంటారు.
స్థూలంగా చెప్పాలంటే ఈ మాటలు అతిపెద్ద ఆత్మవంచన. ప్రజల్లో తమ పార్టీ పట్ల అభిమానం, కార్యకర్తల బలం పుష్కలం అని చెప్పుకుంటూ ఉండగా.. ఇటీవలి ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారీ డిపాజిట్టు కోల్పోయింది తెలుగుదేశం. ఆ పార్టీ బలం మరీ అంత డొల్లతనమా? కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయినంత మాత్రాన, కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకోలేకపోయారా? అనేది చర్చనీయాంశం. ఏదైతేనేం తెలంగాణలో తెలుగుదేశం చచ్చినపామే.
కానీ.. ఏపీలో అలాకాదని ప్రజలు ఇన్నాళ్లూ అనుకున్నారు. కాదు కాదు, ప్రజలను అలా నమ్మిస్తూ వచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, తొలిసారి తెలుగుదేశానికి ప్రజలు అధికారం కట్టబెట్టడం కూడా.. వారు అలా నమ్మించే శక్తిని సంతరించుకోవడానికి ఒక కారణం. చంద్రబాబునాయుడు మాయమాటలను ప్రజలు కలకాలం విశ్వసిస్తూ ఊరుకోరనే సంగతి 2019 ఎన్నికల్లో బయటపడింది. టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలకు ప్రజలు డంగైపోలేదు. తెలుగుదేశాన్ని 23 సీట్లకు పరిమితం చేసి దారుణంగా ఓడించారు.
నిజానికి తెలుగుదేశం పార్టీ బలమైదేనా? అంతా డొల్లేనా? అనే సంగతిని అప్పుడే ప్రజలు అంచనా వేసి ఉండాల్సింది! కానీ, చంద్రబాబునాయుడు తన అసాధారణమైన పబ్లిక్ మేనేజిమెంట్ టెక్నిక్ తో, గోబెల్స్ ను తలదన్నే ప్రచార వ్యూహాలతో పార్టీ బలాన్ని గురించి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ వచ్చారు.
ఒకవైపు పార్టీ అసలు సత్తా గుర్తించిన వారు.. బయటకు వెళ్లడానికి క్యూ కడుతూ ఉన్నప్పటికీ.. రకరకాల మభ్యపెట్టే మాటలతో వారిని తన పట్టులోంచి వెళ్లకుండా చూసుకోవడానికి కూడా చంద్రబాబు శతథా ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఒక్క అరెస్టు జరిగే సరికి ఇన్నాళ్ల కష్టం, ఆయన చేస్తూ వచ్చిన మాయ అన్నీ మంటగలిసిపోయాయి.
కూలిన పేకమేడ
చంద్రబాబునాయుడు అరెస్టు విషయంలో, నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సిగ్గు పడాలి. ఎందుకంటే ఇది అవినీతి బాగోతానికి సంబంధించిన కేసు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజాధనాన్ని లూటీచేసిన కేసు. ఇలాంటి కేసుకు అసలు ముందుగా పార్టీ సిగ్గు పడాలి. సరే ఆ సంగతి వదిలేద్దాం. అరెస్టు విషయానికే వద్దాం. కొన్ని అంశాలు ఆలోచిద్దాం.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం గురించి అందరికంటె ఎక్కువగా దానికి ప్రధాన సూత్రధారి, ప్రధాన లబ్ధిదారు అయిన చంద్రబాబునాయుడుకే ఎక్కువగా తెలిసి ఉండే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చాలా సహజంగా పాతప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ శోధించడం మొదలుపెట్టింది. వారి స్వాహా పర్వాల బాగోతం తేల్చాలని కంకణం కట్టుకుంది. అలాంటి వాటిలో భాగమే.. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ తదితర వ్యవహారాలు అన్నీ! అయితే 2021 నుంచి స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరిని అరెస్టు చేశారో.. ఏయే వివరాలు సేకరించారో, దర్యాప్తు ఎలాంటి మలుపులు తిరుగుతున్నదో సమస్తమూ కూడా చంద్రబాబునాయుడుకు అవగాహన ఉన్నది.
కాబట్టే, తాను ఇక తప్పించుకోవడానికి అవకాశం లేని టర్న్ దగ్గరకు చేరుకున్నానని ఆయనకు అర్థమైంది. తన అరెస్టు తప్పదని ఆయన ముందుగానే గ్రహించారు. ‘‘నన్ను కూడా అరెస్టు చేయొచ్చు’’ అంటూ కొన్ని రోజుల ముందుగా ఆయన చెప్పుకున్న మాటలు ఒక రకంగా అహంకారానికి నిదర్శనాలు. ఎందుకంటే.. ‘నన్ను కూడా’ అనడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయనేమైనా దైవాంశ సంభూతుడా? నేరం జరిగితే ఎలాంటి వారినైనా అరెస్టు చేసి తీరుతారు కదా. దానికి ఇంత దీర్ఘాలు తీసి, అక్కడికేదో తన అరెస్టు వారు చేయగల మహాపరాధం అయినట్టుగా ప్రల్లదనంతో పలకవలసిన అవసరం ఏమిటి? అనేది గమనించాలి. అలా ముందుగానే తాను ప్రజల ఎదుట మాట్లాడడం వలన అరెస్టు ఆలోచనను వాయిదా వేసుకుంటారని చంద్రబాబు భ్రమ పడ్డారో ఏమో తెలియదు గానీ.. మొత్తానికి తన అరెస్టు గురించి ముందుగానే ఆయనకు సమాచారం ఉన్నదనేది స్పష్టం.
సరే, ఇక్కడే అసలు సంగతి ఆలోచించాలి. తనను అరెస్టు చేస్తారని తెలుసు. మరి, తాను జైల్లోకి వెళ్లగానే పార్టీ నిర్వహణ బాధ్యతను ఎవరు చూడాలో ఆయన ఒక ప్రణాళిక ప్లాన్ చేసుకుని ఉండాలి కద. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒక్క చిన్న అరెస్టుతో, ఇంకా శిక్ష కూడా పడని కేసుకు, తెలుగుదేశం పార్టీ యావత్తూ కంగారెత్తిపోతోంది.
అసలిది నలభయ్యేళ్ల పార్టీనేనా?
నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పార్టీ అంటే వారినుంచి చాలా పరిణతిని ఆశిస్తాం. ఎంతో మంది ఉద్ధండులు, మహామహులు అనదగిన నాయకులు ఆ పార్టీ నుంచి తయారై ఉంటారని కూడా అనుకుంటాం. అలాంటి వారెవ్వరూ ఈ సంక్షోభ సమయంలో పార్టీని ఆదుకోవడానికి లేకుండా పోయారా? అనేది పెద్ద ప్రశ్న!
చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత పార్టీ ఒక్కసారిగా దిక్కులేనిది అయిపోయింది. అనాథ అయిపోయింది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారే తప్ప.. విగ్రహం లాగా ఆయన ఉండాల్సిందే తప్ప పార్టీని ఇలాంటి క్లిష్ట సమయంలో యుద్ధరంగంలోకి నడిపించలేకపోతున్నారు.
రాష్ట్రమంతా, వీలైతే ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, కొవ్వొత్తులు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ప్రదర్శనలు ఎంత పలచగా కనిపిస్తున్నాయంటే.. తెలుగుదేశం ఇంతటి దౌర్భాగ్యస్థితిలో పడిపోయిందా? వారు తమ ప్రధాన బలంగా చెప్పుకునే కార్యకర్తల సత్తా ఎక్కడకు పోయింది? అనే అనుమానాలు కలుగుతాయి. నలభయ్యేళ్ల పార్టీ మొత్తం షేక్ అయిపోయింది. పార్టీకి ఉండవలసిన అసలైన బలం ఇప్పుడు కనిపించడం లేదు.
ఎందుకంటే, ఇది నలభయ్యేళ్ల ప్రాయం ఉన్న అసలైన తెలుగుదేశం కాదు. ఆ ముసుగును కప్పుకున్న చంద్రదేశం. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, పార్టీని హస్తగతం చేసుకున్న తర్వాత.. అసలైన తెలుగుదేశం ఆనాడే చచ్చిపోయింది. ఆ పేరుతో ఒక దొంగ పార్టీ, మాయల మరాఠీ పార్టీ మాత్రమే మనుగడలో ఉంది. ఇది ‘బలం ఉండే’ పార్టీ కాదు, ‘ఉన్నట్టుగా కనిపించే’ పార్టీ. ప్రజలకోసం కష్టించే పార్టీ కాదు, అలా కనిపించే పార్టీ! సొంతంగా నెగ్గే పార్టీ కాదు, ప్రతిసారీ ఎవరి భుజాలమీదనైనా సవారీ చేయాలనుకునే స్వార్థపూరిత పార్టీ! పైకి చంద్రబాబు ఎంత బలమైన పార్టీ అని చెప్పుకున్నప్పటికీ ఉన్నదంతా డొల్లే డొల్ల! ఆ విషయం ఇప్పుడు తేలిపోయింది.
సాధారణంగా తన వారసుడిగా నారా లోకేష్ ను అర్జంటుగా ముఖ్యమంత్రిని చేసేయాలని, అర్జంటుగా పార్టీ సారథ్యం అప్పగించేయాలని చంద్రబాబుకు ఒక దురాశ. అయితే ఆ కొడుకు- ఈ క్లిష్ట సమయంలో జైల్లో తండ్రి కుములుతుండగా.. పార్టీని పోరాటయోధుడిలాగా నడిపించాల్సిన సందర్భాన్ని కాలదన్నుకుని అరెస్టులకు భయపడి పారిపోయి ఢిల్లీలో కూర్చున్నారు.
అహంకారమే కాదు.. స్వార్థమూ కారణమే!
తెలుగుదేశం పార్టీ ఇలాంటి దీనస్థితిలో కడతేరుతుండడానికి కేవలం చంద్రబాబునాయుడు అహంకారం, చేతగానితనం, మాయలు తప్ప సత్తా లేకపోవడం మాత్రమే కారణం కాదు. ఆయనలోని స్వార్థం కూడా ఒక ప్రధాన కారణం. చంద్రబాబునాయుడు తన కొడుకు నారా లోకేష్ ను తెరపైకి తెచ్చి తర్వాతి ముఖ్యమంత్రిగా ప్రొజెక్టు చేయాలనుకున్నారు. అందుకే పార్టీలో తతిమ్మా సమర్థులు అందరినీ తొక్కుతూ వచ్చారు. అలాంటి దుర్మార్గపు పార్టీనిర్వహణ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. నమ్ముకున్న కొడుకు పరారీలో ఉన్నాడు. తతిమ్మా వాళ్లంతా పనికిరాని తాలు సరుకుగా నిరూపణ అయ్యారు.
నందమూరి వంశం చేతిలోకి కనీసం పార్టీ సారథ్యం వెళితే బాగుపడతాం అనే భావన చాలాకాలంగా పార్టీ వర్గాల్లో, ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంలో వినిపిస్తూనే ఉంది. గతంలో జూ. ఎన్టీఆర్ పార్టీకోసం ప్రచారం చేసినప్పుడు ఒక ఊపు వచ్చింది. దాన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు.. చాలా దుర్మార్గంగా ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడు అరెస్టు అయిన తర్వాత.. ఒక్కరోజు బాలకృష్ణ పూనిక తీసుకుని పార్టీ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తూ వ్యూహరచనలో భాగమయ్యేసరికి ఆయన ఓర్వలేకపోయారు.
బాలయ్యను కూడా లూప్ లైన్ లోకి పంపారు. చంద్రబాబులో స్వార్థం ఎంతగా జడలు విప్పుకుని వికటనృత్యం చేస్తున్నదంటే.. నారా చంద్రబాబు అరెస్టు అయితే, నారా లోకేష్ పరారీలో ఉంటే, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి నిత్యం మీడియా ముందు మాట్లాడాలే తప్ప.. మరొకరు ప్రొజెక్టు కావడానికి వీల్లేదు అని కోరుకుంటున్నట్టుగా ఉంది.
పార్టీ భవిష్యత్తును కూడా పణంగా పెడుతూ.. ఇంతటి స్వార్థ చింతనతో చంద్రబాబునాయుడు ఉంటే ఇక ఆ పార్టీని ఎవరు బాగు చేయగలరు? అందుకే అది అనాథ పార్టీగా మారుతోంది. సాధారణంగా అవసాన దశ వచ్చినప్పుడు.. అంపశయ్య మీద ఉన్నప్పుడు మనుషుల్లో పశ్చాత్తాపం వస్తుందని పెద్దలు అంటారు. 73 ఏళ్ల వయస్సు, 44 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం తర్వాత.. ఇప్పుడు అవినీతి కేసులో అరెస్టు అయి జైల్లో గడుపుతున్నప్పుడు కూడా ఆయనలో పశ్చాత్తాపం వస్తున్నట్టుగా లేదు. అందుకే ఇలాంటి వ్యూహరచన చేస్తున్నారు.
ఎంతసేపూ పవన్ కల్యాణ్ ను బోయీగా పెట్టుకుని పల్లకీ సవారీ చేయాలనే కోరిక తప్ప.. పవన్ చీల్చగల ఓట్లను, తన సైకిలు గుర్తుకు వేయించుకుని, పవన్ ద్వారా కాపుకులం మొత్తాన్ని మాయచేసి వారి మద్దతు కూడగట్టి జగన్ ను ఓడించగలననే దుగ్ధ తప్ప.. అరెస్టు వంటి ఇలాంటి వ్యవహారాన్ని సానుకూలాంశంగా మార్చుకుని ఒక పోరాటం ద్వారా ప్రజల్లో తమ ఆదరణ పెంచుకుని గెలవాలనే ఆలోచనే ఆయనకు లేకపోవడం ఆ అనాథ పార్టీ ఖర్మ!
చినబాబు భయాలు జాలిగొలుపుతున్నాయ్..
నారా లోకేష్ వయసు చాలా తక్కువ. యువ నాయకుడు. ఈ వయసులోనే ఒక టర్మ్ మంత్రిగా కూడా చేశాడు. రాజకీయం ఎలాంటి మలుపులు తిరిగినా, ఇప్పటి పరిణామాలు వారి పార్టీని ఎంతగా ఇబ్బంది పెట్టినా.. సుదీర్ఘమైన భవిష్యత్తు ఉన్న నాయకుడు లోకేష్. అలాంటి చినబాబు.. అరెస్టులకు ఇంతగా భయపడుతున్నారు ఎందుకు? రాజకీయాల్లో అరెస్టులు అనేవి ఉండనే ఉండవని ఊహించి ఆయన ఈ రంగంలోకి అడుగు పెట్టారా? మన దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీదనైనా కేసులు లేకుండా, అరెస్టులు జరగకుండా వారీ జీవితాలు కడతేరాయా? ఆయన ఈ ఎపిసోడ్ లను ప్రాక్టికల్ గా చూడలేక ఎందుకు పరారీలో ఉన్నారో తెలియదు.
అరెస్టు అయినంత మాత్రాన పోయేదేం లేదని, ప్రజల్లో ఇంకా సానుభూతి వస్తుందని కొందరు అనుకోవచ్చు. కానీ అలా భావించకుండా.. లోకేష్ భయపడిపోతున్నాడని కనిపిస్తుంది. ఇంత భయం ఎందుకు? విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసే సమాచారం ఏంటంటే.. ఏదో బెదిరింపు అరెస్టులు అయితే మళ్లీ బయటకువచ్చి ప్రభుత్వం మీద విమర్శలు కురిపించవచ్చు.
కానీ.. ప్రభుత్వంలో ఉండగా తాము చేసిన పాపాలకు, ఒకసారి అరెస్టు అయితే ఇక బయటకు రావడం ఉండదని, ఒకదాని వెంట ఒకటి కేసులు ముప్పిరిగొని తన జీవితాన్ని పూర్తిగా ముంచేస్తాయని ఆయన అనుకుంటున్నారుట. ముందే చెప్పినట్టు.. జరిగిన పాపమేంటో అందరికంటె బాగా చంద్రబాబుకే తెలిసి ఉంటుంది. అలాగే.. తాను చేసిన పాపాలు అందరికంటె బాగా లోకేష్ కు తెలిసే ఉంటాయి. అన్ని పాపాలు, నేరాలు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారు గనుకనే.. ఇవాళ అరెస్టుకు ఇంతగా భయపడుతున్నారని, ఒకసారి వారి చేతికి చిక్కితే తన పాపాలకు బెయిలు దొరకడం కూడా సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నట్టుగా పలువురు భావిస్తున్నారు.
కనీసం ఒక బస్సుయాత్ర!
ఊర్లలో పదులసంఖ్యలో ప్రజలు కొవ్వొత్తులతో కాసేపు తిరిగి.. ఇళ్లకు చేరుకుంటున్నారు సరే.. ఈ అరెస్ట్ ఎపిసోడ్ పై రాష్ట్రాన్నంతా ఒక్కటి చేసేయగల అవకాశాన్ని ఆయన ఎందుకు మిస్ చేసుకుంటున్నారు. బాలయ్య లాగా దూకుడుగా మాట్లాడగల నాయకుడిని ముందుంచి.. ఆయన వెంట కొందరు నాయకులను జట్టుగా తయారుచేసి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఎదుటకు వెళ్లేలా కనీసం ఒక బస్సుయాత్రను కూడా ఆయన ఎందుకు చేపట్టలేకపోతున్నారు? అనేది ఎవ్వరికీ అర్థం కాని సంగతి.
స్థూలంగా చెప్పాలంటే చంద్రబాబునాయుడు స్వార్థం పార్టీని కబళిస్తున్నది. పార్టీని గతిలేని స్థితిలోకి నెడుతున్నది. పార్టీని అనాథగా మారుస్తున్నది. ఆయన తన వారసుడిగా ఏ లోకేష్ నైతే ప్రొజెక్టు చేయాలనుకుంటున్నారో అతని చేతగానితనం కూడా వారికి శాపంగా మారుతున్నది. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఎంత త్వరగా గుర్తిస్తే అది అంతగా పార్టీకి మేలు చేస్తుంది. చంద్రబాబునాయుడు స్వార్థాన్ని తట్టుకోగల ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకోవాలి. కాకపోతే అనాథ పార్టీ కాస్తా.. అదృశ్యం అయిపోతుంది.
..ఎల్ విజయలక్ష్మి