Advertisement

Advertisement


Home > Politics - Opinion

సినిమాల్లో మాయ‌మ‌వుతున్న 'కుటుంబం'

సినిమాల్లో మాయ‌మ‌వుతున్న 'కుటుంబం'

సినిమా అయినా, సాహిత్య‌మైనా చ‌రిత్ర‌ని రికార్డ్ చేస్తాయి. ఆయా కాలాల్లోని సామాజిక‌, ఆర్థిక సంబంధాలు సినిమాల్లో క‌నిపిస్తాయి. కుటుంబ సంబంధాల్లో వ‌చ్చిన మార్పులు సినిమాల్లో ప్ర‌తిబింబిస్తాయి. కుటుంబ‌మ‌నేది సినిమా స‌క్సెస్‌కి కీ వ‌ర్డ్‌. అయితే ఇప్పుడు అర్థాలు మారిపోయాయి. ఫ్యామిలీకి పెద్ద ఇంపార్టెంట్ లేని సినిమాలే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి.

1960-70 సినిమాలు గ‌మ‌నిస్తే అది ఉమ్మ‌డి కుటుంబాల కాలం. గొడ‌వ‌లొచ్చి విడిపోయినా చివ‌రికి త‌ప్పు తెలుసుకుని క‌లిసిపోవ‌డం. అన్న‌ద‌మ్ములు వేరు పోతున్న రోజులు ప్రారంభ‌మ‌య్యాయి. కానీ ఎమోష‌న్స్ బ‌లంగా వున్నాయి. ఇంకా ప‌ట్ట‌ణీక‌ర‌ణ ప్రారంభం కాలేదు.

1967లో వ‌చ్చిన ఉమ్మ‌డి కుటుంబం చూస్తే న‌లుగురు అన్న‌ద‌మ్ములు క‌లిసే వుంటారు. ఆడ‌వాళ్ల మ‌ధ్య స‌హ‌జంగానే పొస‌గ‌దు. వాళ్లు వేరు ప‌డ‌టానికి ప్ర‌య‌త్నిస్తూ వుంటారు. దాంతో ఆఖ‌రి వాడైన హీరో ఎన్టీఆర్ త‌న అన్న‌ల కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డి అంద‌ర్నీ ఒక‌టి చేస్తాడు. జ‌నాల‌కి న‌చ్చింది హిట్‌.

1970లో వ‌చ్చిన కోడ‌లుదిద్దిన కాపురంలో పెద్ద కోడ‌లు సావిత్రి సంసారాన్ని స‌రిదిద్దుతుంది. కుటుంబం దారి త‌ప్పినా కోడ‌లుగా అది ఆమె బాధ్య‌త‌. ఆడ‌వాళ్ల వ‌ల్లే కుటుంబాలు వేరు ప‌డ‌తాయి, బాగుప‌డ‌తాయి అని న‌మ్మే కాలం. పండంటి కాపురం (72) క‌థ కూడా ఇదే.

80-90 నాటికి క‌థ‌లు మారిపోయాయి. ప‌ల్లెల నుంచి ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స పెరిగింది. ఆడవాళ్ల‌లో చ‌దువు పెరిగింది. ఉమ్మ‌డి కుటుంబంలో ఇరుకు గ‌దుల్లో వుంటూ సొంత నిర్ణ‌యాలు, వ్య‌క్తిత్వం లేకుండా అత్త పెత్త‌నం కింద బ‌త‌క‌డానికి కోడ‌ళ్లు ఇష్ట‌ప‌డ‌ని కాలం. క‌లిసి వుండి క‌ల‌హాల‌తో కొట్టుకు చావ‌డం కంటే, విడిపోయి ప్రేమ‌గా, స్నేహంగా వుండ‌డ‌మే క‌రెక్ట్ అనే అభిప్రాయం సొసైటీలో ఏర్ప‌డింది. దాంతో సినిమాల్లో కుటుంబ క‌థ‌ల స్థానంలో క్రైమ్ క‌థ‌లు మొద‌ల‌య్యాయి. కుటుంబ‌మంటే భార్యాపిల్ల‌లు మాత్ర‌మే. అన్న‌లు, వ‌దిన‌లు, బాబాయ్‌, పిన్నిలు కాదు. కుటుంబం కోసం క‌ష్టాలు ప‌డి, త్యాగాలు చేసే క‌థానాయ‌కుడు మాయ‌మ‌య్యాడు.

2000-20 నాటికి సీన్ మొత్తం మారిపోయింది. కుటుంబ‌మంటే పెళ్లిళ్ల‌కి, పండుగ‌ల‌కి మాత్ర‌మే క‌ల‌వ‌డం. భార్యాభ‌ర్త‌లు, పిల్ల‌లు మాత్ర‌మే ఇంట్లో వుంటారు. అమ్మానాన్న‌లు ప‌ల్లెలో వుంటారు. అన్న‌ద‌మ్ములు, అక్క‌చెల్లెళ్లు ఎవ‌రి కుటుంబాల‌తో వాళ్లు. సినిమా క‌థ‌లు కూడా ప‌ల్లెని మ‌రిచి, సిటీకి వ‌చ్చేశాయి. వ్య‌వ‌సాయం, రైతు అనే ప‌దం మాయం కావ‌డంతో ఉమ్మ‌డి కుటుంబం అనే మాటే లేదు. ఎపుడైనా ప్యాష‌న్ కోసం మ‌హ‌ర్షి, శ్రీ‌మంతుడు లాంటి సినిమాలు వ‌స్తాయి. అవి చూడ‌డానికి త‌ప్ప ఆచ‌రించ‌డానికి కాదు. సినిమా అంటే న‌గ‌రంలోని క‌థే. ప‌ల్లె క‌థ కాదు. కుటుంబ‌మంటే హీరో కుటుంబ‌మే. వాళ్లు కూడా తెర‌మీద క‌నిపిస్తారు కానీ ఎలాంటి ప్రాధాన్య‌త వుండ‌దు.

ఇప్పుడు మ‌నుషుల్లో మాన‌సిక ఒత్తిడులు ఎందుకంటే చెప్పుకోడానికి ఎవ‌రినీ లేకుండా చేసుకున్నాం. (మే 15 అంత‌ర్జాతీయ కుటుంబ దినోత్స‌వం)

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?