అమెరికాలో తెలుగు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అమెరికా అంటేనే కలలప్రపంచం. త్వరితగతిన జీవితంలో ఎదగాలన్నా, ఇండియాలో మధ్యతరగతి జీవితం నుంచి పైస్థాయికి చేరుకోవాలన్నా అమెరికాలో అడుగుపెట్టడమే లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తోంది తెలుగు యువత.  Advertisement ఎంత కేవలం విద్యార్థులుగా అడుగుపెట్టినా కూడా…

అమెరికా అంటేనే కలలప్రపంచం. త్వరితగతిన జీవితంలో ఎదగాలన్నా, ఇండియాలో మధ్యతరగతి జీవితం నుంచి పైస్థాయికి చేరుకోవాలన్నా అమెరికాలో అడుగుపెట్టడమే లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తోంది తెలుగు యువత. 

ఎంత కేవలం విద్యార్థులుగా అడుగుపెట్టినా కూడా అమెరికాలో జెండా పాతి డాలర్లు సంపాదించాలన్నదే మనవాళ్ల ధ్యేయం. తప్పు లేదు. అయితే అమెరికా అయినా, ముంబాయి అయినా, హైద్రాబాదైనా..ఒక్కసారి ఇంటినుంచి దూరంగా వెళ్లగానే రెక్కలొచ్చినట్టు ఫీలౌతారు యువతీయువకులు. తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు చెప్పి ఫ్లైటెక్కించినా, అమెరికాలో దిగాక కొన్ని రోజుల్లో ఏర్పడ్డ స్నేహాలు వాళ్లని తల్లిదండ్రులు చెప్పిన మాటలని పెడచెవిన పెట్టేలా చేస్తాయి. ఫలితంగా ప్రమాదాల్లో పడడానికి, ఒక్కోసారి ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి కూడా పరిస్థితులు ఏర్పడతాయి. స్వదేశంలో ఉన్న పిల్లలు ప్రమాదం బారిన పడితేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఇక విదేశంలో జరిగితే వారి బాధ వర్ణనాతీతం. 

అమెరికా అనగానే రోడ్లు విశాలంగా ఉంటాయి..గంటకి 120 మైళ్ల వేగంతో కారు నడిపినా పర్వాలేదనే అభిప్రాయం చాలామంది యువతలో ఉండొచ్చు. కానీ అది నిజం కాదు. “అతివేగం ప్రమాదానికి మూలం” అనేది అన్ని దేశాల్లోనూ కామన్ రూల్. 

చుట్టు పక్కల ఎప్పుడూ పోలీసుల్ని చూడలేదు కనుక డ్రింక్ చేసి కారు నడిపినా పర్వాలేదని కొంతమంది ధైర్యం చేస్తారు. కానీ అమెరికాలో చాలా చోట్ల పోలీసులు సాధారణ కార్లల్లో కూడా పహారా కాస్తుంటారు. ఎక్కడైనా పార్టీ జరుగుతున్న దాఖలాలుంటే అక్కడే కాపు కాసి బయటికి రాగానే పట్టుకుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అమెరికాలో దొరికితే అంతే సంగతులు. జైలుకెళ్లడం, ఫైన్ కట్టడం, తిరిగి ఇండియాకి పోవడం లెదా పోకపోవడం..ఇవన్నీ జరుగుతాయి. అంతా హ్యాపీగానే కనిపిస్తున్నా పరిస్థితి బెడిసి కొడితే అమెరికా అంత భయంకరమైన దేశం మరొకటి ఉండదనిపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు చేస్తున్న పనిని జడ్జ్ చేసుకుంటుండాలి. 1% రిస్క్ కూడా తీసుకోకపోవడమే శ్రేయస్కరం. 

అలాగే లాస్ వేగాస్ తర్వాత అట్లాంటిక్ సిటీలో క్యాసినోలుంటాయి. అలా మరి కొన్ని ఇతర పట్టణాల్లో కూడా అక్కడక్కడ క్యాసినోలుంటాయి. అక్కడ తెల్లవారుజాము వరకు గడిపి కార్లల్లో తిరిగుప్రయాణమైనప్పుడు యాక్సిడెంట్లకి చాన్సులెక్కువుంటాయి. కనుక అలాంటి సరదాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముందు విద్యార్థిగా వచ్చిన లక్ష్యం నెరవేరాక కాస్త వయసుకూడా వస్తుంది కనుక బాధ్యత కూడా వస్తుంది. బాధ్యత వల్ల భయం, భయం వల్ల జాగ్రత్త వస్తాయి. అవే కాపాడతాయి. కనుక అప్పటివరకు ఆచితూచి అడుగులు వెయ్యాలి.  

అయినప్పటికీ అమెరికాని అన్ని విషయాల్లోనూ సేఫ్ అనుకోవద్దు. ఈ మధ్యన ఒక కుటుంబం “హైకింగ్” అని కొండ ఎక్కారు. అక్కడ సేఫ్టీ రైలింగ్ లేక ఇంటి యజమాని కాలుజారి లోయలో పడి మరణించాడు. పబ్లిక్ సేఫ్టీ విషయంలో అమెరికా పూర్తిస్థాయిలో పకడ్బందీగా ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండడం ఇక్కడ మరింత తప్పనిసరి. 

ఇక మళ్లీ విద్యార్థుల విషయానికొస్తే డాలర్లకి ఆశపడి ఇల్లీగల్ జాబ్స్ చేయడం చాలా ప్రమాదకరం. శిక్షపడితే బయటికి రావడం కూడా కష్టం. అసలే ఆస్తులు తాకట్టు పెట్టి తల్లిదండ్రులు అమెరికా యూనివెర్సిటీ వరకు పంపించగలుగుతున్నారు. జైల్లో పడ్డ బిడ్డని బయటికి తెచ్చుకోవలంటే కోర్టు ఖర్చులకే కోట్లు అవుతాయి. అంత ఖర్చు చేసినా ఫలితముండకపోవచ్చు. కనుక అస్సలు గీత దాటవద్దు. ఏది లీగలో, ఏది కాదో అడుగడుగున తెలుసుకోవాలి. 

అలాగే ఫేక్ టొఫెల్, జీ.ఆర్.ఈ స్కోర్స్ పట్టుకుని కూడా కొందరు అమెరికన్ యూనివెర్సిటీల్లో చేరుతున్నారు. ఎప్పుడు దొరికినా వెనక్కి పంపడమే కాదు, కోర్టు మెట్లు కూడా ఎక్కించి చుక్కలు చూపిస్తుంది అమెరికా. 

మొన్నటికి మొన్న సినిమా టికెట్స్ ఫ్రాడ్లో మనవాళ్ళు దొరికి దేశం పరువుతీసారు. అంతే కాకుండా కోర్టు ప్రొసీజర్స్ ని రుచి చూడడం కూడా తప్పదు వాళ్లకి. “అన్నీ అనుభవించాలి, ఫ్రాడ్ చేసైనా డాలర్స్ ఖర్చు కాకుండా ఆపుకోవాలి..” లాంటి చీప్ మెంటాలిటీని వదిలెయ్యాలి. ఆ రకంగా ఆలోచించే స్నేహితులుంటే తక్షణం వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. పొరపాటున కూడా సొంత బ్యాంక్ కార్డుతో ఏ ఫ్రాడ్ యాక్టివిటీ కూడా చేయకూడదు.

అదలా ఉంటే గతంలో మన తెలుగు విద్యార్థుల దెబ్బకి అమెరికాలో మూవీపాస్ అనే కంపెనీయే మూతపడింది. వీళ్ల కక్కుర్తి మెంటాలిటీకి అక్కడి వ్యాపారాలే బలైపోతుంటే చూస్తూ ఊరుకోరు కదా. రేసిజం కూడా పెరిగేది ఇలాంటి వెధవపనుల వల్లే. ఆ కథంతా ఇక్కడ వివరంగా రాయట్లేదు. రాస్తే అదొక పెద వ్యాసమవుతుంది. తెలుసుకోవాలనుకునే వాళ్లు గూగుల్లో వెతికి తెల్సుకోవచ్చు. 

ఎలా చూసుకున్నా అమెరికా వస్తున్న కొత్త విద్యార్థులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మనుగడ సాగించాలి. లేకపోతే తమ కలలే కాకుండా కన్నవాళ్ల కలలు కూడా పీడకలలుగా మారతాయి. 

లక్ష్మీ శరణ్య, శాంటా క్లారా