“ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..” అని శ్రీశ్రీ అన్నట్టు “ఏ రాష్ట్ర పరిస్థితి చూసినా ఏమున్నది వ్యత్యాసం” అనాలనిపిస్తుంది కొన్ని విషయాలు విన్నప్పుడు.
సంయుక్త ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా పేరు పొందింది. పార్లమెంట్ సాక్షిగా వంచనకు గురైన ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా ముద్ర వేయించుకుంది.
అలాంటప్పుడు తెలంగాణ ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉండాలి కదా! ఉందా?
అన్ని రాష్ట్రాల్లాగానే తెలంగాణ రాష్ట్రం కూడా అప్పులు చేస్తోంది.
పెన్షన్లు కొంతమందికి రెండు నెలలకొకసారి పడుతున్నాయి.
రిటైరైన వారికి రావాల్సిన ఏరియర్స్ వగైరాలు రానే రావట్లేదు.
ఏకారణం చేత ఆ ఆర్ధికలోటు వస్తోంది?
అప్పులు చేసినా సంక్షేమ పథకాల్ని, జీతాల్ని టంచనుగా ఎందుకు ఇవ్వలేకపోతోంది తెలంగాణ రాష్ట్రం?
ఈ ప్రశ్నలే సామాన్య పౌరుడికి ఒక రకమైన నిస్పృహ కలిగిస్తున్నాయి.
మరో పక్క ఆంధ్రప్రదేశులో సంక్షేమ పథకాలకి పెడుతున్న ఖర్చుకి, రాష్ట్ర ఆదాయానికి పొంతన లేక అప్పుల పరంపర కొనసాగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ లోటు బడ్జెట్టుతో పరిపాలన ఎన్నాళ్లు? అభివృద్ధి అంటే ఆసుపత్రులు బాగుపడడం, కొత్త మెడికల్ కాలేజీలు రావడం, రెండు బెడ్రూముల ఇళ్లు ఇవ్వడం, అమ్మవొడి వంటి పథకాలు అందించడం తప్ప .. బిల్డింగులు కట్టడం కాదని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. దీనికి ఎంతమంది ఏకీభవిస్తారనేది చర్చనీయాంశం.
ఈ విషయంలో తెలంగాణలో కేసీయార్ అభివృద్ధి చేస్తూ సంక్షేమం కూడా నడిపారు. రెండింటినీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినా కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో మాత్రం ఆంధ్రలో జగన్ ఇచ్చినన్ని ఇవ్వలేకపోయారు. ఆ అసంతృప్తే ఇప్పుడు తెలంగాణ ఓటర్లలో ఉంది. ఇదిలా ఉంటే రైతులు మాత్రం తెలంగాణలో సుభిక్షంగానే ఉన్నారు. “రైతుబంధు” పథకం మంచి ఫలితాలనిచ్చింది.
ఇలా పథకాలిస్తూ సాగుతున్న రెండు తెలుగు రాష్ట్రాలూ అప్పులు చేస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఈ విషయం మీద వేలెత్తి చూపుతూనే ఉన్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ అప్పులు, ఖర్చులు వగైరాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాసారు.
అటు తెలంగాణలో కేసీయార్ పాలనపై, ఆర్ధికపరమైన అంశాలపై రేవంత్ రెడ్డి చేస్తున్న అభియోగాలు అన్నీ ఇన్నీ కావు.
ఇలాంటి నేపథ్యంలో తనని ముఖ్యమంత్రిని చేస్తే ప్రస్తుతమున్న పథకాలని రెట్టింపు చేస్తానని చెప్తున్నారు చంద్రబాబు. ఎలా చేస్తారు? ఎక్కడ నుంచి చేస్తారు?
దీనికి సమాధానంగా పవన్ కళ్యాణ్ నోరు విప్పాడు. రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఆ వచ్చే ఆదాయంతో పథకాలిస్తాడట.
ఇదేమన్నా చిట్టి చిలకమ్మ కథా? ఇలా నర్సరీ స్కూల్ లెవెల్లో చెబితే వినడానికి?!
అభివృద్ధి పేరుతో పెట్టుబడులు ఆకర్షించి వాటి ఫలాలు పొందాలంటే ఐదు నుంచి పదేళ్లు పడుతుంది. అంటే అప్పటి వరకు సంక్షేమ పథకాలు ఇవ్వనంటాడా?
అంతెందుకు.. చంద్రబాబు హాయాములో కియా కార్ల కంపెనీ వచ్చింది. దానికి ఇచ్చిన రాయితీలు, పన్ను మినహాయింపులు వల్ల రాష్ట్రానికి ఆదాయం రాకపోగా దాదాపు 15000 కోట్ల రూపాయల గండిపడింది. ఇప్పటికీ ఇంకా దానివల్ల రాష్ట్రానికి ఒనగూరుతున్న ఆర్ధిక ప్రయోజనం లేదు.
అలా ఆదాయం రాని కంపెనీ వల్ల అన్నేసి వేల కోట్లు నష్టపోయేకంటే ఆ డబ్బు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశులో మెడికల్ కాలేజీలు పెట్టి, స్కూళ్లు బాగుచేసి జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చూపించారన్నది కొందరు విశ్లేషకుల మాట.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ “గ్యారెంటీ సిక్స్” పేరుతో కొన్ని స్కీములు ప్రకటించింది. అందులో ఒకటి “మహాలక్ష్మి” పథకం. రాష్ట్రంలోని మహిళలకి రూ 2500 నెలకి ఇస్తారట. అసలు దీని లెక్కెంత? ఖజానాపై ఎంత భారం?
ఇలాంటి అతి పోకడలతో పథకాలు ప్రకటిస్తే కర్ణాటక ప్రజలు కాంగ్రెసుని ఎన్నుకున్నారు. తీరా పదవిలోకొచ్చాక రోడ్లేయడానికి డబ్బుల్లేవంటున్నారు. పథకాలు కూడా అందరికీ ఇవ్వలేకపోతున్నారు.
అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా పెద్ద కళ. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వై.ఎస్.ఆర్ ఒక్కరే ఇప్పటివరకు చేయగలిగారు. చంద్రబాబు ఐ.ఎస్.బి ని తీసుకొస్తే వై.ఎస్.ఆర్ తన హాయాములో ఐ.ఐ.టి, బిట్స్, ట్రిపుల్ ఐటి లాంటి విద్యాకేద్రాల్ని తీసుకొచ్చారు.
ఇక ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ ఎంత గొప్పదో, పేదల జీవితాల్ని ఎలా మార్చిందో వేరే చెప్పక్కర్లేదు.
ఇలా విద్యా, వైద్యం విషయంలో ఆయన చేపట్టిన సంక్షేమం తాలూకు ఫలాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి.
చంద్రబాబు అంటే హైటెక్ సిటీ అని చెప్తారు కానీ, ఆ ఘనత నేదురుమల్లి జనార్దన రెడ్డిదని, శంకుస్థాపన చేసింది కూడా ఆయనేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఒక ప్రెస్మీటులో హైటెక్ సిటీచరిత్రని విపులంగా చెప్పారు. ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబులో సెర్చ్ కొడితే కనిపిస్తుంది. కావాలంటే చూడొచ్చు.
ఇక అభివృద్ధి విషయానికొస్తే వై.ఎస్.ఆర్ చేసినవి ఎన్నో. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్..ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
అందుకే ఆయన రెండో సారి కూడా అధిక మెజారిటీతొ గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. అదే తీరులో కొనసాగినప్పుడే ప్రజల నుంచి ప్రభుత్వ వ్యతిరేకత చాలా నెమ్మదిగా వస్తుంది. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా యాంటి-ఇంకంబెన్సీ మీద పడే ప్రమాదముంది.
ఈ సారి ఆంధ్ర, తెలంగాణ ఎన్నికలు పెద్ద కేస్ స్టడీ. జయాపజయాలని బట్టి కొత్త పాఠాలు, సరికొత్త పాలనాసూత్రాలు అర్ధమవుతాయి.
మరో నెలలో తెలంగాణ ఎన్నికలు, ఆ తర్వాత 2024లో ఆంధ్రా ఎన్నికలు సంక్షేమం-అభివృద్ధి అంశాలపై పాఠాలు, గుణపాఠాలు చెప్పనున్నాయి.
– శ్రీనివాసమూర్తి