అందరికీ శకునం చెప్పే పిల్లి కుడితిలో పడింది అన్నది సామెత. అన్ని పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకుని, తమ చిత్తానికి ఆడిస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీకి, తన పార్టీని బతికించుకోవడం, విజయం దిశగా నడిపించుకోవడం, బలోపేతం చేయడం మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రాంతీయ పార్టీల వ్యూహాలకు చిక్కుకుని లేదా ప్రాంతీయ పార్టీలతో అంటకాగుతూ తన అస్తిత్వాన్ని, ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అనుకుంటూ నిట్టూర్చాల్సిందే.
ఆంధ్రలో జనసంఘ్ రోజులు వేరు. ఆనాటి నిబద్దత కలిగిన నాయకులు వేరు. ఎమర్జన్సీలో ముందు అజ్ఙాతంలోకి, ఆపై జైలులోకి వెళ్లిన లీడర్లు వేరు. మెలమెల్లగా ‘సామాజిక జాఢ్యాలు’ భాజపాకు అంటుకున్న తీరు వేరు. వివిధ కీలక పార్టీ పదవులు, అధికారిక పదవులు చాలా వరకు ‘నాయకుడి’ సామాజిక వర్గానికే దక్కిన వైనం గుర్తున్నదే. అలా అలా సీనియర్లను, పార్టీ సిద్దాంత విశ్వాసపరులను మెల్లగా పొగపెట్టి బయటకు పంపేసారు. దాంతో ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ 2 కింద మారిపోయింది.
తెలుగుదేశం అధికారంలో వుంటే భాజపాలో వుంటూ పనులు చక్కబెట్టుకోవడం, అధికారంలో లేకపోతే సైలంట్ గా తమ వ్యాపారాలు చేసుకోవడం తప్ప మరో పని లేదు. దాంతో భాజపా పని ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. విశాఖ తొలి మేయర్ పదవిని కైవసం చేసుకున్న భాజపా తరువాత తెలుగుదేశంతో అంటకాగి ఆ బలాన్ని, స్థాయిని వదిలేసుకుంది. కేవలం సామాజిక బలంతో విశాఖ ఎంపీని గెల్చుకుంది కానీ కేవలం భాజపా బలంతో కాదన్నది స్థానిక జనాలకు తెలిసిన సత్యం.
పక్కాగా చెప్పాలంటే తెలుగుదేశం ఆవిర్భావం అన్నది భాజపాకు శాపంగా మారిపోయింది. రెండు పార్టీల నాయకులకు వున్న ‘సామాజిక’ బంధాలు ఆ పార్టీకి శాపంగా మారిపోయాయి. ఈ సంగతి గ్రహించకపోవడం పార్టీ అధిష్టాన లోపం. మధ్యలో తెలివిగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీయడం, పార్టీ పగ్గాలు అప్పగించడం చేసినా కూడా సమర్ధవంతమైన నాయకత్వం మాత్రం అందించలేకపోయింది. దాంతో మళ్లీ వెనక దారిలోకి వెళ్లింది.
పురందేశ్వరి చేతిలోకి పగ్గాలు వచ్చిన దగ్గర నుంచి మళ్లీ తెలుగుదేశం ఎజెండానే భుజాల మీదకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. దానికి తోడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేననే భాజపాకు భాగస్వామి. కానీ అసలు భాజపాతో మాట చెప్పకుండానే తెలుగుదేశంతో పొత్తు పగ్గాలు చేపట్టింది. కానీ భాజపాది మాత్రం ఏమీ అనలేని పరిస్థితి.
ఎందుకంటే జనసేన వినా భాజపా నాస్తి. తెలుగుదేశం వినా భాజపా నాస్తి. స్వంత ఐడియాలజీ నాయకులు లేరు. ఏనాడో అంతరించిపోయారు. లేదా బయటకు పంపివేయబడ్డారు. మోడీని చూసి అభిమానించే కురతరానికి ఈ పార్టీ గురించి, వ్యవహారాల గురించి పట్టదు. జై భాజపా అనడం తప్ప, మరో దృష్టి లేదు. మొత్తం మీద ఆంధ్రలో భాజపా ది అతి చిన్న లోకల్ పార్టీ స్థాయికి దిగిపోయింది.
ఆంధ్రలో పరిస్థితి ఇలా వుంటే తెలంగాణలో మరీ గమ్మత్తయిన పరిస్థితి. ఉమ్మడి రాష్ట్ర పార్టీ మీద ఆంధ్ర నాయకుల పెత్తనం సహించలేక, ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానానికి దారి తీసారు. అన్ని పార్టీలతో కలిసి అందరూ కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నారు. పార్టీకి కాస్త అస్తిత్వం వచ్చింది కానీ బలం నానాటికీ తగ్గిపోతోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవానికి ముందు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించాలంటే కాంగ్రెస్ కు భయం. ఎందుకంటే భాజపా మేయర్ సీటును తన్నుకుపోతుందని. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ లోనే భాజపాకు ఏమీ లేని పరిస్థితి. కేంద్ర. మంత్రులు వున్నారు. పార్టీలో కొట్లాటలు అంతకు మించి వున్నాయి. ఒకటి రెండు స్థానాలు గెలిస్తే చాలు కిందా మీదా లేదన్నట్లు వ్యవహారిస్తూ వచ్చారు.
కొందరు అతివాదులు.. కొందరు మితవాదులు. వీరికి వారికి తెరవెనుక నప్పదు. వెరసి ఒకటి రెండేళ్ల క్రితం తెలంగాణలో ప్రత్యామ్నాయం భాజపానే అనుకుంటే, ఇప్పుడు అసలు భాజపా ఎక్కడ? అనే పరిస్థితి వచ్చేసింది. సరైన దిశ, దశ, మార్గదర్శకత్వం అన్నది ప్రాపర్ గా లేదు. ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గం భాజపాలో బలంగా వుండేది. ఇప్పుడు అదంతా కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవుతోంది. భాజపాను నుంచి తెరాస నుంచి జరుగుతున్న వలసలు, రాజకీయ హడావుడులు అన్నీ ఈ క్లారిటీ ఇస్తున్నాయి.
నిజానికి కాంగ్రెస్ పార్టీని, దాని నాయకుడు రేవంత్ రెడ్డిని వెనుక నుంచి నడిపిస్తున్నది తెలుగుదేశం అనుకూల సెటిలర్స్ వర్గం అన్న గుసగుసలు వున్నాయి. కానీ గత్యంతరం లేని స్థితిలో రెడ్డి సామాజిక వర్గం పోలరైజ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే కొన్ని నెలల క్రితం వరకు ప్రామిసింగ్ గా కనిపించిన భాజపా ఇప్పుడు ప్రత్యామ్నాయం నుంచి థర్డ్ ప్లేస్ మీదుగా కిందకు జారిపోతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఇది భాజపా స్వయం కృతాపరాధం.
భారతీయ రాష్ట్ర సమతితో తెరవెనుక బంధాలు ఏవీ లేవు అని భాజపా క్లారిటీగా జనాలకు చెప్పలేకపోయింది. చూపలేకపోయింది. దాంతో భారసా.. భాజపా రెండూ ఒకటే అన్న భావం బలపడింది. నిజానికి ఇందులో భాజపా రాష్ట్ర నాయకుల తప్పేమీ లేదు. కేంద్ర నాయకత్వం వారి చేతులు కట్టేసిందనే అనిపిస్తుంది.
ఆంధ్రలో తెలుగుదేశంతో అంటకాగి పార్టీ ఈ స్థితికి చేరింది. తెలంగాణలో భారాస తో తెరవెనుక బంధాలు వున్నాయన్న ప్రచారంతో ఈ స్థితికి చేరుకుంది. రెండు సార్లు తప్పును కనిపెట్టి సరిచేసుకోలేకపోవడం అన్నది భారతీయ జనతా పార్టీ స్వయంకృతాపరాధం తప్ప వేరు కాదు. రెండు రాష్ట్రాల్లో ఈసారి జరిగే ఎన్నికల తరువాత భాజపా పరిస్థితి ఏమిటన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా కూడా ఆ పార్టీ అధిష్టానానికి దిగుల్లేదు. ఎందుకంటే కేవలం కేంద్రంలో అధికారం అనే బెత్తం చేత పట్టుకుని, ఎవరు గెలిచినా తమ అదుపులో వుంచుకోగలమనే ధీమా.
కానీ ఒక వేళ అదే కేంద్రంలో అధికారం చేజారితే, ఇక తెలుగురాష్ట్రాల్లో భాజపాను ఎవ్వరూ పట్టించుకోరు. అది చేదు వాస్తవం.