ఈ ప్రపంచకప్ ఆరంభంలో కాస్త తడబడ్డ ఆస్ట్రేలియా ఇప్పుడు మళ్లీ జూలు విదులుస్తోంది. పాకిస్తాన్ పై ఘన విజయం తర్వాత నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా పూర్తి ఫామ్ ను అందిపుచ్చుకుంది. 399 పరుగుల సాధన ద్వారా ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ తాము ఫామ్ లోకి వచ్చామనే సంకేతాలను ఇచ్చారు. వార్నర్ సెంచరీ, స్మిత్, లబుషేన్ ల హాఫ్ సెంచరీలు, ఆ పై మ్యాక్స్ వెల్ 40 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో ఐసీసీ ఈవెంట్లలో తాము పోటీలో ఎప్పుడూ ఉంటామనే సంకేతాలను స్పష్టంగా ఇచ్చారు.
ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ లో ఇండియా చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత సౌతాఫ్రికా చేతిలో కూడా ఆసీస్ కు ఓటమి తప్పలేదు. దీంతో ఆస్ట్రేలియా వెనుకబడ్డట్టుగా కనిపించింది. అయితే పాక్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌన్స్ బ్యాక్ అయ్యింది.
ఉపఖండం పిచ్ పై ఉపఖండం జట్టును ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. ఇప్పుడు నెదర్లాండ్స్ పై ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ సత్తా చూపించింది. నెదర్లాండ్స్ పైనే కదా.. అనుకునేందుకు ఏమీ లేదు. ఇంగ్లండ్ ను ఓడించిన జట్టు అది. క్వాలిఫయర్స్ లో వెస్టిండీస్ పై కూడా నెదర్లాండ్స్ విజయం సాధించింది.
మొత్తానికి ఆస్ట్రేలియా పుంజుకుంటూ ఉండటం.. ఆసక్తిదాయకమైన అంశం. వరస ఓటములతో పాక్ సెమిస్ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంటూ ఉంది. కానీ అప్పుడే అయిపోలేదు.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ లతో ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. ఆ పై బంగ్లా, ఆఫ్ఘానిస్తాన్ లనూ ఎదుర్కొనాల్సి ఉంది. ప్రత్యేకించి న్యూజిలాండ్, ఇంగ్లండ్ తో మ్యాచ్ లు ఆస్ట్రేలియా అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత బంగ్లా, ఆఫ్ఘాన్ లకు కూడా ఆస్ట్రేలియా అవకాశం ఇవ్వకుండా ఆడాల్సి ఉంది.