జూన్ 25, 1975, భారతదేశానికి ఒక చీకటి రోజు. 47 ఏళ్లు దాటినా పాత తరం వాళ్లకి ఇంకా చేదు జ్ఞాపకాలు గుర్తున్నాయి. మన పత్రికలు ఎమర్జెన్సీ మీద ఏమైనా రాశాయా అని చూస్తే ఆంధ్రప్రభలో చిన్న ఆర్టికల్ తప్ప ఇంకెక్కడా లేదు. ఇంగ్లీష్ పేపర్లు కూడా మరిచిపోయాయి.
చరిత్రని మరిచిపోవడం అంటే సత్యాన్ని తిరస్కరించడమే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో నోటికొచ్చిన అభిప్రాయాల్ని చెబుతున్నారంటే కారణం రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛ. ఆ హక్కులన్నీ మాయమై నోరు విప్పితే జైల్లోకి తోస్తే దాన్నే ఎమర్జెన్సీ అంటారు. దేశం సంక్షోభ సమయంలో వుంటే అత్యవసర పరిస్థితి విధించొచ్చు.
1975లో ఇందిరాగాంధీ అధికారానికి సంక్షోభం వచ్చింది. జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఏకమయ్యే స్థితి. అలహాబాద్ కోర్టు ఇందిర ఎన్నికపై వ్యతిరేక తీర్పు. పదవిని సుస్థిరం చేసుకోడానికి ఎమర్జెన్సీ ఆయుధం.
1975, జూన్ 25 సాయంత్రం.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కి ప్రధాని ఇందిర, సిద్ధార్థశంకర్ రే వచ్చారు. 45 నిమిషాల సేపు ప్రెసిడెంట్ ఫకృద్దీన్ ఆలీ అహమ్మద్‌కి ఎమర్జెన్సీ గురించి రే వివరించారు. ఆర్టికల్ 352 అంటే ఏంటో స్వతాహ లాయర్ ఫకృద్దీన్‌కి తెలుసు. అది విధిస్తే మీడియా, ప్రతిపక్షాలు, న్యాయ వ్యవస్థ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి ఇందిర ఒక నియంతలా మారుతుందని కూడా తెలుసు. నిస్సహాయ స్థితిలో తటపటాయిస్తూనే సంతకం పెట్టాడు. ఆ సంతకంతో భారతదేశం స్వాతంత్ర్యం స్విచ్ఛాప్ అయిపోయింది. చీకటి.
రాత్రి 11.45 గంటలకు ప్రధాని నమ్మకస్తుడు ఆర్కే ధావన్ రంగంలోకి దిగాడు. 2 గంటలకే ఢిల్లీలోని అన్ని పత్రికలకి కరెంట్ ఆగిపోయింది. పోలీసులు నిద్ర కళ్లతో పరుగులు తీశారు.
జయప్రకాశ్‌నారాయణ్, మురార్జి, అద్వాని (జనసంఘ్ అధ్యక్షుడు), జ్యోతిబసు, రాజ్ నారాయణ్, పిలూమోడీ, చంద్రశేఖర్, మోహన్‌దారియా ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతిపక్ష నాయకులు 676 మంది తెల్లారేసరికి జైల్లో వున్నారు.
జూన్ 26 ఉదయం 7 గంటలకి ఇందిరాగాంధీ కాబినెట్ ఏర్పాటు చేశారు. మంత్రులందరికీ ఏదో జరగబోతుందని తెలుసు. కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోవడం వల్ల దేశంలోని చాలా మంది నాయకులు అప్పటికే జైల్లో వున్నారని తెలియదు.
సప్దర్‌జంగ్ రోడ్డులోని ఇందిర నివాసంలో కేవలం 10 నిమిషాల్లో ఎమర్జెన్సీ గురించి ఇందిర చెప్పింది. అందరూ షాక్. ఎవరూ మాట్లాడలేదు. డిఫెన్స్ మినిస్టర్ స్వరణ్‌సింగ్ మాత్రం ఇప్పుడు ఎమర్జెన్సీ అవసరమా? అని ప్రశ్నించాడు. ఇందిర సమాధానం చెప్పలేదు. నోరు విప్పితే జైలుకు పోతామని అందరికీ అర్థమైంది. ఇంకా జనానికే అర్థం కాలేదు.
పత్రికలకి కరెంట్ పోయినా, హిందుస్థాన్ టైమ్స్ అప్పటికే అచ్చయింది. 26వ తేదీ ఉదయం ఎప్పటిలాగే పిల్లలు రోడ్ల మీద అరుస్తూ పత్రికలు అమ్ముతున్నారు. పోలీస్ వ్యాన్లు ఆగాయి. పోలీసులు పిల్లల్ని లాఠీలతో బెదిరించి పత్రిక కాపీలన్నీ తీసుకుని వెళ్లిపోయారు.
11 గంటలకి శాస్త్రి భవన్‌లోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక ప్రకటన చేసింది. అప్పటికే ఆర్ఎస్ఎస్ వీక్లీ ఆర్గనైజర్ డెయిలీ మదర్ లాండ్, మరాఠీ డెయిలీ తరుణ్ భారత్ ఇంకా చాలా కార్యాలయాలు సీజ్ చేశారు. నోరు తెరిచిన వాళ్లంతా అరెస్ట్ అయ్యారు. లాయర్లను సంప్రదించి ప్రయత్నించిన వారిని కూడా లోపలికి తోశారు. పోలీసులు తప్ప ఇంక ఏ వ్యవస్థ లేదని అర్థమైంది.
“ఇది యుద్ధం. శత్రువుల సప్లయ్ లైన్స్ కట్ చేస్తున్నాం ” అని ఇందిరానే చెప్పింది. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని ఆమె భజనపరులు ఎత్తుకున్నారు.
జూన్ 25 రాష్ట్రపతిని ఇందిరాగాంధీ కలవడానికి కొన్ని గంటల ముందు రామ్‌లీలా మైదానంలో జయప్రకాశ్ నారాయణ్ సభకి లక్షల్లో హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో చరణ్‌సింగ్ రాజకీయ శక్తుల్ని సమీకరిస్తున్నాడు. మొరార్జీ దేశాయ్ జూన్ 29 ఇందిరమ్మని దించే ఉద్యమానికి పిలుపునిచ్చాడు. ఈ అభద్రతా భావమే ఇందిరని ఎమర్జెన్సీ వైపు నెట్టింది.
ఆమెని ఆందోళన వైపు నెట్టిన సందర్భాలు ఇంకా వున్నాయి.
జూన్ 12వ తేదీ గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. 182 సీట్లకి 75 వచ్చాయి. అంతకు మునుపు కాంగ్రెస్ బలం 140. కాంగ్రెస్‌కి గుజరాత్‌లో మొదటి ఓటమి. ఇందిర 11 రోజులు ప్రచారం చేసి 119 సభల్లో పాల్గొన్నా ఓటమి తప్పలేదు. వీటికి తోడు ఆరేళ్లు ఎన్నికల నుంచి బహిష్కరిస్తూ అలహాబాద్ కోర్టు తీర్పు.
ఇంత పెద్ద దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టేశారు. ఎమర్జెన్సీలో జరిగిన దారుణాలు లెక్కకు మించినవి.
బానిసత్వం అర్థమైతేనే స్వేచ్ఛ విలువ తెలుస్తుంది. అణిచివేతకి గురైతే ప్రజాస్వామ్యం అర్థమవుతుంది.
జీఆర్ మహర్షి