Advertisement

Advertisement


Home > Politics - Opinion

'హార్వర్డ్ డైట్' తో షుగర్, బీపీ, కేన్సర్లు దూరం

'హార్వర్డ్ డైట్' తో షుగర్, బీపీ, కేన్సర్లు దూరం

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆ వాక్యం విలువ వయసు పెరిగే కొద్దీ మరింత బాగా అర్ధమవుతుంటుంది. 

ఎంత సంపదున్నా ఆరోగ్యం సరిగా లేకపోతే ఎంజాయ్ చేయడం కష్టం. నాలుగు చోట్ల తిరగాలన్నా, నాలుగు రకాలు తినాలన్నా ఆరోగ్యం సహకరించాలి. మనలో చాలామంది 40 దాటినప్పటి నుంచే షుగరొచ్చిందని, బీపీ వచ్చిందని చాలా రుచులకి దూరమౌతుంటారు. రోజూ వాకింగ్ చేస్తున్నా ఎందుకొచ్చిందో కానీ షుగరొచ్చిందని చెప్పేవాళ్లుంటారు. ప్రశాంతంగానే ఉంటాను..అయినా బీపీ వచ్చిందంటారు కొందరు. 

దీనికి వంశపారంపర్యాలు, జన్యుపరమైన కారణాలు ఉన్నా ఎక్కువశాతం మందిలో ఈ పరిస్థుతులు రావడానికి కారణం తినే ఆహారం మీదనే ఆధారపడుతుందని తేలింది. అందుకే సరైన ఆహారం తీసుకుంటే ఈ సాధారణ రుగ్మతలని దూరంగా నెట్టి జీవితాన్ని ఎక్కువకాలం ఆనందంగా గడపొచ్చనేది సారాంశం. 

అయితే ఇందులో రకరకాల ఆహారాల గురించి వింటున్నాం. కొందరు వీరమాచనేని ప్రచారం చేసే వి.ఆర్.కె డైట్ మంచిదంటారు. కొందరు ఖాదర్ వలి చెప్పే చిరుధాన్యాల ఆహారం సరైనదంటారు. ఇంకొందరు మంతెన సత్యనారాయణరాజు ప్రచారం చేసే ఉప్పులేని సహజ ఆహారం మంచిదంటారు. ఇలా ఎవరు ఏది చెప్పినా అది మంచిదే. అయితే ఎవరికి ఏది పడుతుందో, ఏది రుచిస్తుందో చెప్పడం కష్టం. అది ఆయా వ్యక్తుల అభిరుచుల్ని బట్టి, ఇతర ఆరోగ్యపరిస్థులను బట్టి, అహారపు అలవాట్లను బట్టి, శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. 

అయితే ఇప్పుడు తాజాగా పశ్చిమ దేశాల్లో ప్రచారం పొందుతున్నది "హార్వర్డ్ డైట్". 

గుండెజబ్బుల్ని నివారించడానికి, డైబెటీస్ ని దూరం పెట్టడానికి, పలు రకాల కేన్సర్స్ ని అడ్డుకోవడానికి ఈ డైట్ మంచిదని పలువురు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. 

క్లుప్తంగా చెప్పాలంటే ఈ డైట్లో సగం శాతం పళ్లు, కాయగూరలు ఉండి మిగిలిన సగం గింజలు, ఆరోగ్యకరమైన ప్రొటీన్స్ తో కూడి ఉంటుంది. 

అయితే కూరగాయల్లో ఆలుగడ్డ పూర్తిగా నిషిద్ధం. ఎందుకంటే అది పేరుకి కూరగాయే అయినా దానిని రక్తంలో చక్కెర శాతాన్ని గణనీయంగా పెంచే రిఫైండ్ కార్బోహైడ్రేట్ గా గుర్తించి పక్కనపెట్టేయాలంటున్నారు. 

అలాగే ఈ డైట్లో తప్పనిసరిగా తినదగ్గ గ్రెయిన్స్ ఏంటంటే ఓట్స్, కినొవా, బార్లీ, గోధుమ, బ్రౌన్ రైస్. వీటిల్లో ఏదో ఒకటి ప్లేటులో పావుభాగం మాత్రమే ఉండాలట. 

మరో పావు భాగాన్ని ఆరోగ్యకరమైన ప్రొటీన్- అంటే బీన్స్, నట్స్, చేప, చికెన్ వంటివి. ఇక్కడ రెడ్ మీట్ పూర్తిగా నిషిద్ధం. 

మరి వీటిని వండాలంటే ఆయిల్ ఏదై ఉండాలి? దానికీ చెప్పారు. ఆలివ్, కనోలా, సొయా, కార్న్, సన్ ఫ్లవర్, పీనట్ తప్ప వేరే ఏ రకమైన ఆయిల్స్ కానీ నెయ్యి కానీ వాడకూడదు. 

అలాగే పాలు తాగే బదులు, బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీకి అలవాటు పడడం మంచిదని ఈ డైట్ చెబుతుంది. ఒకవేళ పాలు తాగాలనుకున్నా రోజుకి ఒక్కసారే ఒక చిన్న గ్లాస్ మాత్రం తాగొచ్చు. అది కూడా షుగర్ లేకుండా. 

ఈ ఆహార నియమాలు పాటిస్తే వర్కౌట్స్ కూడా మరీ అతిగా చెయ్యాల్సిన అవసరం ఉండదు. శరీరంలో కరిగించాల్సిన కేలరీలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల తక్కువపాటి వ్యాయామాలైన వాకింగ్, జాగింగ్ వంటి వాటితో శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతే కాదు, ఈ ఆహారం వల్ల మనసు ప్రశాంతంగా, మెదడు చురుకుగా మారుతుందని కూడా అధ్యయనాల్లో తేలింది. తరచు మత్తుగా ఉండడం, ఎక్కువ సమయం నిద్రపోవాలనిపించడం, పుస్తకం చదువుతుంటే నిద్ర రావడం వంటివి జరగవట. అవసరమైతే రోజులో 18 గంటలు ఏక్టివ్ గా ఉండగలిగే శక్తి ఈ ఆహారం ఇవ్వగలదని ఆచరిస్తున్నవారు చెప్తున్నారు. 

ఇవన్నీ ఆచరించతగ్గవే. పెద్దగా కష్టం కూడా కాదు. కనుక డైట్ ప్లాన్ తో మంచి ఆరోగ్యాన్ని పొందాలనుకునే వారు ప్రయత్నించి చూడండి. షుగర్, బీపీ రాకమునుపే జాగ్రత్త పడాలనుకునే వారికి ఈ డైట్ పనికి రావొచ్చు. షుగర్ ఇప్పటికే ఉన్నవారు తినాల్సిన పళ్ల విషయంలో జాగ్రత్తపడాలి. లో గ్లైసెమిక్ వేల్యూస్ ఉండే జామ, ఏపిల్ వంటివి తినవచ్చు.   

- ఆర్. పద్మావతి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?