మే 23 ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. తాబేలు అనగానే “స్లో మోషన్” గుర్తొస్తుంది. ప్రజెంట్ ట్రెండ్‌కి ఇది పనికిరాదు. అంతా స్పీడ్. అయినా నిదానం వుంటేనే కదా వేగానికి గుర్తింపు. స్కూల్లో పాఠం కూడా వుండేది. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కుందేలు, తాబేలు చేతిలో ఓడిపోతుంది. రాజకీయాల్లో కూడా కుందేలు కథలు కనిపిస్తాయి. రాజ్‌నారాయణ్‌ని ఇందిరాగాంధీ, చిత్తరంజన్‌దాస్‌ని ఎన్టీఆర్ తాబేళ్లు అనుకున్నారు.
భారతీయ పురాణాల్లో ప్రతి ప్రాణిని గౌరవించే ప్రత్యేకత వుంది. తాబేలుకి ఒక అవతారం వుంది. మందర పర్వతాన్ని కూర్మం రూపంలో విష్ణువు మోస్తాడు. తెలివైన వాడు తెలివిలేని వాన్ని మోసం చేయడం అమృతం దగ్గరే మొదలైంది. దేవతలు దానవులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సాగరమధనం తరువాత అమృతం ఇస్తామన్నారు. తీరా అమృతం పుట్టిన తరువాత మోహిని వచ్చి మాయ చేసింది.
తాబేళ్ల జాతులు అంతరించిపోతున్నాయి. అందుకని 1990లో ప్రపంచ తాబేళ్ల దినోత్సవం మొదలైంది. ఈ రోజు ఏం చేస్తారంటే తాబేళ్ల బొమ్మలు గిఫ్ట్‌గా ఇస్తారు. తాబేలులా దుస్తులు వేసుకుని ప్రదర్శనలు ఇస్తారు. తాబేలుని సంరక్షించే విధానాన్ని పిల్లలకు నేర్పుతారు.
మనిషి, జీవులు, మొక్కలు కలిసి వుంటేనే జీవ వైవిధ్యం. మనిషి తాను మాత్రం ప్రత్యేకం అనుకుంటూ మిగిలిన రెండింటిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. వెనుకటికి మంచినీళ్ల బావిలో తాబేలుని ఎందుకు వదిలేవాళ్లంటే , నీటిని శుభ్రం చేసే లక్షణం తాబేలుకి ఉందని మన పెద్దవాళ్లకి తెలుసు కాబట్టి.
ఇపుడు బావులూ లేవు, తాబేళ్లు లేవు. దాన్ని చూడాలంటే నెట్‌లో పిల్లలు చూడాలి. శ్రీకాకుళం దగ్గర శ్రీకూర్మం ఆలయం చాలా ప్రసిద్ధి. కూర్మావతారానికి గుర్తుగా దేశంలో వున్న అతిపెద్ద ఆలయం ఇదొకటే.
జీఆర్ మహర్షి