నేత‌ల‌ను బజారుకీడ్చిన సొంత ప‌త్రిక‌లు

ఒక్కో సారి రాజ‌కీయ నేత‌లు అదుపు త‌ప్పి నోరుజారితే మీడియా సంస్థ‌లు విచ‌క్ష‌ణ‌తో వాటిని జ‌నం దృష్టికి తీసుకెళ్లేవి కావు. అభ్యంత‌ర‌క‌ర లేదా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారని జ‌ర్న‌లిస్టులు రాసేవాళ్లు. ఇప్పుడు ప్ర‌తిదీ ప్ర‌త్య‌క్ష…

ఒక్కో సారి రాజ‌కీయ నేత‌లు అదుపు త‌ప్పి నోరుజారితే మీడియా సంస్థ‌లు విచ‌క్ష‌ణ‌తో వాటిని జ‌నం దృష్టికి తీసుకెళ్లేవి కావు. అభ్యంత‌ర‌క‌ర లేదా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారని జ‌ర్న‌లిస్టులు రాసేవాళ్లు. ఇప్పుడు ప్ర‌తిదీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతుండ‌డంతో అదుపు చేయ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. అయినప్ప‌టికీ నేత‌ల నోట బూతు మాట‌లు దొర్లితే, ఆ త‌ర్వాతైనా ఎడిట్ చేసేవాళ్లు.

రాజ‌కీయ నేత‌లే కాదు, మీడియా కూడా తన హ‌ద్దులు దాటి, బూతుల‌ను య‌థాత‌ధంగా క్యారీ చేస్తోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుల‌పై పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు శ్రుతిమించి నోరు పారేసుకోవ‌డాన్ని ఆ రెండు పార్టీల సొంత ప‌త్రిక‌లు ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. 

త‌మ నాయ‌కుల‌పై ప్ర‌త్య‌ర్థుల దూష‌ణ‌ల‌ను జ‌నానికి తెలియ‌జేయ‌డం ద్వారా క్షేత్ర‌స్థాయిలో సానుభూతితో పాటు రెచ్చ‌గొట్ట‌డ‌మే ప్ర‌ధాన ఎజెండాగా ఆయా మీడియా సంస్థ‌ల ఉద్దేశంగా క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ విష‌యంలో ఈనాడు ప‌త్రిక పాటించిన సంయ‌మ‌నాన్ని ప్ర‌శంసించాలి.

ముందుగా ఆంధ్ర‌జ్యోతి విష‌యానికి వ‌ద్దాం. అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని విలేక‌రుల స‌మావేశంలో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దానిపై ఆంధ్ర‌జ్యోతి ఇచ్చిన వార్త ఏంటో చూద్దాం.

ఒరే చంద్ర‌బాబూ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో’ అనే శీర్షిక‌తో మొద‌టి పేజీలో ఇచ్చారు. మంత్రి కొడాలి నాని తిట్ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక క‌థ‌నంలోకి వెళితే…

‘కుక్క బతుక్కి చంద్రబాబు బతుక్కీ ఏమైనా తేడా ఉందా? అడుక్కు తినేవాళ్లు మెట్ల మీద కూర్చొన్నట్లు కూర్చున్నాడు. ప్రజలు బట్టలూడదీసినా బుద్ధిలేకుండా వ్యవహరిస్తున్నాడు. ఒరేయ్‌ చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకో. సీఎంను ఇష్టానుసారం మాట్లాడితే తాట తీస్తాం’ అని కొడాలి తీవ్ర పదజాలంతో హెచ్చరించారని రాసుకొచ్చారు. ఇదే స‌మావేశాన్ని సాక్షి కూడా క్యారీ చేసింది. అందులో మాత్రం ‘ఒరేయ్ చంద్ర‌బాబు’ అన్న ప‌దాన్ని ఎడిట్ చేసింది.  ఇక పేర్ని విష‌యానికి వ‌స్తే …

‘ఏరా చంద్రబాబు.. అనడానికి మాకెంత సేపు కావాలి?’ అని  మంత్రి పేర్ని నాని ప్ర‌శ్నించారు. తాటి చెట్టుకు… పెద్దాయనకూ వయసొచ్చిందన్నట్లు చంద్రబాబు ఇంగిత జ్ఞానం కోల్పోయారంటూ మండిపడ్డారు. ఆడూ వీడూ అని చంద్రబాబు జ్ఞానం లేకుండా మాట్లాడతారా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. 

పేర్ని మాట‌ల‌ను మాత్రం సాక్షిలో మ‌రింత ఘాటుగా రాసుకొచ్చారు. ‘ఏరా చంద్ర‌బాబుగా అన‌డానికి మాకెంత‌సేపో ప‌ట్ట‌దని, కానీ మేము సంస్కారంగా వెళుతున్నాం’ అని మంత్రి నాని అన్న‌ట్టు  రాసుకొచ్చారు. మంత్రులు తిట్ట‌డం సంగ‌తేమో గానీ, వాటికి అక్ష‌ర రూపం ఇవ్వ‌డం బాబుకు గౌర‌వం తెచ్చేదా?  లేక త‌గ్గించేదా? అని ఒక‌సారి ఆలోచిస్తే మంచిది.

అధికార ప‌త్రిక సాక్షిలో కూడా తిట్ల వార్త‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు అభ్యంత‌ర‌క‌ర ప‌ద‌జాలాన్ని హైలెట్ చూశారు.

‘ఏమ‌నాలి వీణ్ణి ..ఇంగిత జ్ఞానం ఉందా?’ అనే శీర్షిక‌తో సాక్షి ఫ‌స్ట్ పేజీలో ఇండికేష‌న్ ఇచ్చారు. సీఎం జ‌గ‌న్‌ను నోటికి వ‌చ్చిన‌ట్టు దూషించిన చంద్ర‌బాబు అనే స‌బ్ హెడ్డింగ్‌తో వార్త ఉద్దేశాన్ని ప్ర‌తిబింబించారు. క‌థ‌నాన్ని మాత్రం లోప‌లి పేజీలో ఇచ్చారు.

‘ఇది బాబు స్కీమ్‌, ఇది జ‌గ‌న్ స్కీమ్ అంట‌. ప్ర‌భుత్వంలో బాబు స్కీమ్ …జ‌గ‌న్ స్కీమ్ ఉంటాయా? మ‌ళ్లీ వీటిపై ప్ర‌భుత్వ డ‌బ్బుతో యాడ్స్ ఇచ్చుకుంటారు. ఆడి పేప‌ర్‌కి, మ‌ళ్లీ ఇంకో పేప‌ర్‌కి. ఏమ‌నాలి వీన్ని. ఇంగిత జ్ఞానం ఉందా?’ అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు అన్న మాట‌లివి.

అలాగే ‘రుణ‌మాఫీకి మేము రూ.15 వేల కోట్లే ఇచ్చామ‌ని ఆ మంత్రి అంటాడు. వెన‌కాల ఎవ‌డో కాదు రూ.12 వేల కోట్లే అంటాడు. వాడి బ‌డ్జెట్‌లోనే రూ.15 వేల కోట్ల‌ని చెప్పాడు. వీడు అదే చెబుతాడు’ అని మంత్రుల‌ను కూడా చంద్ర‌బాబు విడిచిపెట్ట‌లేదు. 

ఇక్క‌డ తేడా ఏంటంటే టీడీపీ విష‌యంలో ఏకంగా అధినేత చంద్ర‌బాబే సంయ‌మ‌నం కోల్పోయి నోటికి ప‌ని చెబుతూ, త‌న‌స్థాయిని తానే దిగ‌జార్చుకున్నారు. ఇదే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డా నోరు జార‌లేదు.

రాజ‌కీయ నేత‌ల బూతు పురాణానికి ప‌త్రిక‌ల్లో ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక ఉద్దేశం ఏదైనా కావ‌చ్చు కానీ, ఇది తాము ఆధారించే నాయ‌కుల ప‌రువును మాత్రం బ‌జారుకీడ్చింద‌నే వాస్త‌వాన్ని మీడియా గ్ర‌హించాలి. ఇలా పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల నిజ‌స్వ‌రూపాన్ని రెండు పార్టీల మ‌ద్ద‌తు మీడియా ఆవిష్క‌రించ‌డంతో త‌మ ఎజెండా నెర‌వేర‌లేద‌ని గ్ర‌హించాలి. 

మొత్తానికి రాజ‌కీయ నేత‌లు నేల‌బారు భాష మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో అభాసుపాల‌వుతున్నారు. ఇలాంటి వారినా మ‌నం ఎన్నుకున్న‌ద‌ని ప్ర‌జ‌లు త‌ల‌దించుకునేలా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్త్తుండ‌డం సిగ్గుచేటు.