అవును.. ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడే.. బీజేపీకి బినామీనే. మొన్నటివరకు ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. తెరవెనక వాస్తవాలుగా ఉన్న కామెంట్స్ ను మెల్లమెల్లగా నిజం చేస్తున్నాడు జనసేనాని. తనపై ఉన్న ముసుగును మెల్లమెల్లగా తొలిగిస్తున్నాడు. గట్టిగా అడిగితే టీడీపీతో క్లోజ్ గా ఉంటే తప్పంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా బీజేపీకి తను దూరంగా జరగలేదని స్పష్టంచేశారు.
“ప్రజల కోరిక మేరకు ప్రత్యేక హోదా కోసం భారతీయ జనతా పార్టీతో, ప్రధాని మోడీతో విభేదించాల్సి వచ్చింది. నాతో పాటు ప్రజలు నిలబడలేకపోయారు. అది వేరే సంగతి. బీజేపీకి నేను ఏ రోజూ దూరం అవ్వలేదు. కేవలం హోదా విషయంలో గొడవపెట్టుకున్నాను. అంత గొడవ పెట్టుకున్న తర్వాత మళ్లీ కలిస్తే బాగోదని, కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేతప్ప, బీజేపీతో నాకు గొడవల్లేవు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం విబేధించాల్సి వచ్చింది తప్ప బీజేపీకి నేను ఎప్పుడూ దూరంగా లేను.”
ఈ వెర్షన్ ఒక్కటి వింటే చాలు, చంద్రబాబు తరహాలోనే పవన్ నాలుక కూడా ఎలా మడతలు పడుతుందో తెలిసిపోతుంది. మొన్నటివరకు మోడీ, అమిత్ షాను ఇష్టమొచ్చినట్టు తిట్టిన పవన్.. ఇప్పుడు వాళ్లను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. కొన్ని రోజుల కిందట పవన్ ఢిల్లీ వెళ్లారు. ఆ పర్యటన తర్వాతే పవన్ స్వరంలో మార్పు వచ్చింది.
జనసేన, బీజేపీ, టీడీపీ మరోసారి కలవబోతున్నాయనే విషయాన్ని పరోక్షంగానైనా స్పష్టంగానే చెప్పారు పవన్. ఎన్నికల టైమ్ లో ఎన్నో అనుకుంటామని, ఇప్పుడు తమ మధ్య అలాంటి బేదాభిప్రాయాలు లేవంటున్నారు జనసేనాని. మరీ ముఖ్యంగా ఇప్పుడు బీజేపీని, టీడీపీని మళ్లీ కలిపే బాధ్యతను పవన్ నెత్తికెత్తుకున్నాడనే విషయాన్ని కూడా అతడి మాటల్లో అర్థం చేసుకోవచ్చు.
అంతా బాగానే ఉంది. వాళ్లు వాళ్లు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా జగన్ కు లింక్ పెడుతూ మరోసారి తన శాడిజం చూపించుకున్నారు పవన్. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలవలేదు కాబట్టే జగన్ గెలిచారని విమర్శించారు పవన్. అయితే ఈ మూడు పార్టీలే కాదు, మరో 3 పార్టీలతో కలిసొచ్చినా జగన్ ను ఎదుర్కోవడం కష్టమనే విషయం జనసేనాని అంతరంగానికి తెలుసు.