ఇష్టారీతిన వ్యవహరించడం, ఫెయిలైతే ప్రజల మీద నెపం నెట్టడం పవన్ కల్యాణ్ కు కొత్తేం కాదు. మొన్నటికిమొన్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతే, ప్రజాతీర్పు సరిగ్గా లేదనే విధంగా స్పందించారు జనసేనాని. కార్యకర్తలతో మాట్లాడుతూ.. ప్రజలు తమ తప్పు తెలుసుకునే రోజు వస్తుందని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశంలో కూడా ప్రజలదే తప్పు అంటున్నారు పవన్.
తాజాగా తిరుపతిలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఏకైన వ్యక్తిని తానేనని చెప్పుకున్నారు. కానీ స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయానని, దానికి కారణం ప్రజలే అంటున్నారు. తను నిలబడినంత గట్టిగా తనతో పాటు ప్రజలు నిలబడలేకపోయారనేది పవన్ వాదన.
నిజంగా పవన్ కు ప్రత్యేకహోదా మీద అంత చిత్తశుద్ధి ఉంటే గడిచిన ఐదేళ్లు ఏం చేశారు. తను ఎప్పుడు అడిగితే అప్పుడు మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారని గొప్పలు చెప్పుకునే పవన్, గడిచిన ఐదేళ్లలో ఎప్పుడైనా హోదా డిమాండ్ తో వెళ్లి మోడీని కలిశారా? హోదా వస్తే రాయితీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలొస్తాయని ఎంతసేపు ఇక్కడ డప్పు కొట్టడమే తప్ప, ఐదేళ్లలో ఎప్పుడైనా మోడీని కలిసి హోదా అడిగారా? మోడీని తనకు క్లోజ్ ఫ్రెండ్ గా చెప్పుకునే పవన్, కనీసం ఫోన్ చేసి ఈ విషయం అడిగారా?
ఐదేళ్లలో హోదా దిశగా ఒక్క ప్రయత్నం కూడా చేయని పవన్, ఇప్పుడు తన ఫెయిల్యూర్ ను కూడా ప్రజలపై రుద్దేస్తున్నారు. తనతో పాటు ప్రజలు నిలబడలేదంటున్నారు. తను ఎక్కడికెళ్తే అక్కడకు లక్షలాది మంది వస్తున్నారని, పూల వర్షం కురిపిస్తున్నారని సొంత డబ్బా కొట్టుకునే పవన్.. ప్రత్యేక హోదా దగ్గరకొచ్చేసరికి మాత్రం తన వెంట ఒక్కరు కూడా లేరని చెప్పడం ఈ ఏడాది పెద్ద జోక్.
ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం జనసేనానికి వెన్నతో పెట్టిన విద్య. హోదా విషయంలో కూడా ఇదే పనిచేశారు. బీజేపీతో తన బంధాన్ని ఇప్పుడిప్పుడే బయటపెడుతున్న పవన్, కమలానికి ఇష్టంలేని స్పెషల్ స్టేటస్ అంశాన్ని కూడా ఇలా వదిలించుకుంటున్నారన్నమాట.
అయినా ప్రజల్ని, ప్రజాతీర్పును హేళన చేయడం పవన్ కు అలవాటే. మొన్నటికిమొన్న జగన్ కు 151 సీట్లు రావడం తన భిక్ష అన్నట్టు మాట్లాడారు. అంతకంటే ముందు మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఇంత హీనంగా అంచనా వేస్తున్నారు కాబట్టే పవన్ కు కేవలం ఒక్క సీటిచ్చి మూలన కూర్చోబెట్టారు పవన్.