జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రెస్‌నోట్ రూపంలో జనం ముందుకొచ్చాడు. రాజకీయాలపై తన మార్క్ హితవచనాలు పలికాడు. వ్యక్తిత్వం, ప్రజాస్వామ్యం, క్షమాపణలు లాంటి పెద్దపెద్ద మాటలు వల్లించాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శలకు అతీతమనే రీతిలో పవన్ పేర్కొన్నాడు. మరో అడుగు ముందుకేసి కన్నాకు విజయసాయి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు.
పవన్ ప్రకటన చూసిన తర్వాత ఈయనకు పిచ్చి పీక్‌కు చేరిందనే అనుమానం రాక మానదు. బీజేపీ నేతలకు మాత్రమే ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేసే హక్కు ఉన్నట్టు, వాళ్లపై ఏ ఒక్కరూ చిన్న ఆరోపణ కూడా చేయకూడదనే రీతిలో పవన్‌కల్యాన్ విడుదల చేసిన ప్రకటన ఉంది.
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ను సైతం విడిచిపెట్టలేదని, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారని ప్రకటనలో పవన్ పేర్కొన్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని పవన్ విమర్శించాడు. ఓహో పవన్ దృష్టిలో బీజేపీ మాట్లాడితే మాత్రం తప్పులు ఎత్తి చూపడమవుతుంది. అదే బీజేపీ విమర్శలపై స్పందిస్తే మాత్రం పవన్ దృష్టిలో బురదజల్లుతున్నట్టుగా కనిపిస్తోందన్న మాట.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని, అలాగే ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో విజయసాయి తప్పు చేశాడని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఇంకా నయం పనిలో పనిగా తనకు కూడా విజయసాయి క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయలేదు. సినిమాలు తీసుకునే వాడికి ఎందుకయ్యా ఈ రాజకీయాలు? “నేనూ ఉన్నా ఏపీ రాజకీయాల్లో” అని ఉనికి చాటుకునేందుకా ఇలాంటి ప్రకటనలు చేసేది? అయినా కన్నా లక్ష్మినారాయణకు వ్యక్తిత్వం ఏందయ్యా…వింటే ఎవరైనా నవ్వుతారని కూడా లేకుండా!