రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అనిపించుకున్నారు పవన్. గ్రేటర్ ఎన్నికల వేదికగా పవన్ చేసిన యాక్టింగ్ నిజంగా సూపర్. ఏదో ఉంది, ఇంకేదో చేసేస్తున్నాం అంటూ 2 రోజులుగా సినిమా చూపించిన పవన్, లాస్ట్ మినిట్ లో తుస్సుమనిపించారు. ఓవైపు నామినేషన్ల గడువు ముగుస్తుంటే.. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదంటూ పవన్ పండించిన డ్రామా నభూతో అనిపించుకుంది.
గ్రేటర్ లో పోటీ చేయడానికి సరిపడేంత సమయం కానీ, అభ్యర్థులు కానీ, వనరులు కానీ జనసేన వద్ద లేవు. అయినప్పటికీ ఆర్భాటంగా కమిటీలు ప్రకటించారు. వకీల్ సాబ్ గెటప్ లో ఫొటోలకు పోజులిచ్చారు. సినిమా స్టయిల్ లో అభ్యర్థుల జాబితాపై టీజర్ వదిలారు. అవినీతిరహిత అభ్యర్థులంటూ కలరింగ్ ఇచ్చారు. కట్ చేస్తే, ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీకి, జనసేనకు మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన మాట నిజమేనని అంగీకరించారు పవన్. అయితే ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
“ఏపీలో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి, తెలంగాణలో కూడా కలిసి పనిచేస్తామని అనుకున్నాం. కానీ మేం మాట్లాడుకునే టైమ్ లో కరోనా, బిహార్, దుబ్బాక ఎన్నికలొచ్చాయి. అన్నీ సర్దుకొని కూర్చుందామనుకునే టైమ్ కు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చిన్న కన్ఫ్యూజన్ వచ్చిన మాట వాస్తవం. మేం ముందే మాట్లాడుకొని ఉండుంటే ఇలాంటి గ్యాప్ వచ్చేది కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తప్పలేదు.”
ఇలా చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందని చెబుతూనే, ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు భేషరతుగా ప్రకటించారు పవన్. ఓవైపు నామినేషన్ల గడువు ముగుస్తున్నప్పటికీ.. మరోవైపు కిషన్ రెడ్డి, లక్షణ్ తో కలిసి పవన్ ఇలా చర్చల డ్రామా నడిపించడానికి కారణం, కేవలం పరువును నిలుపుకునే ప్రయత్నమే.
మొత్తానికి పవన్ మరోసారి తెలంగాణ రాజకీయ క్షేత్రానికి దూరమయ్యారు. ఈ విషయం ఆయనకు ముందే తెలుసు. కాకపోతే తెలంగాణలో ఉన్న తన ఫ్యాన్స్ బాధపడకూడదు. అందుకే ఇదంతా.
తన నిర్ణయంపై తెలంగాణ క్యాడర్ కు కోపం వస్తుందనే విషయం తనకు తెలుసని, వాళ్లందర్నీ కూర్చోబెట్టి మాట్లాడతానంటూ పవన్ ప్రకటించడం కొసమెరుపు.