చంద్రబాబు.. పవన్ బాబు.. దొందూ దొందే

రాజకీయాల్లో మార్పు తెస్తాను, పాతికేళ్ల ప్రస్థానం కొనసాగిస్తానంటే.. పవన్ కల్యాణ్ ఏదో చేస్తారని ఊహించారు జనాలు. అభిమానులు కూడా ఆ ఉద్దేశంతోటే ఆయన వెంట నడిచారు. ఓట్లు పడ్డాయా లేదా అనే విషయం పక్కనపెడితే..…

రాజకీయాల్లో మార్పు తెస్తాను, పాతికేళ్ల ప్రస్థానం కొనసాగిస్తానంటే.. పవన్ కల్యాణ్ ఏదో చేస్తారని ఊహించారు జనాలు. అభిమానులు కూడా ఆ ఉద్దేశంతోటే ఆయన వెంట నడిచారు. ఓట్లు పడ్డాయా లేదా అనే విషయం పక్కనపెడితే.. దారుణ పరాభవం తర్వాత కూడా కొంతమంది పవన్ ని నమ్ముకునే ఉన్నారు. మరి పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు?

అడపాదడపా ప్రెస్ నోట్లు విడుదల చేయడం, టెలి కాన్ఫరెన్స్ ల ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడటం. తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు గంటన్నర నిడివిగల ఇంటర్వ్యూలు పార్ట్ లు పార్ట్ లుగా విడుదల చేయడం. కనీసం వరద లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడైనా నాయకులు ముందుకు రావాలి కదా?

చంద్రబాబు అంటే వయసు మీద పడింది, బైటకొస్తే కరోనా భయం. అధికారంలో ఉన్నా కూడా ఆయన చేసింది పెద్దగా ఏమీ లేదు కాబట్టి జనం ఆయననుంచి ఏమీ ఆశించడంలేదు. అందుకే బాబు, సీఎం జగన్ కి లేఖాస్త్రాలు సంధిస్తున్నా అంతకుమించి ఏం చేయలేరని జనం అర్థం చేసుకున్నారు. మరి పవన్ కూడా అదే బాపతు అనుకోవాలా?

వరద బాధితుల్ని ఆదుకోండి అంటూ జనసేనాని కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఓ సూచన చేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దానిలో కూడా కేంద్ర జల సంఘం హెచ్చరించింది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కలుపుకొనే ప్రయత్నం చేయడం మరింత నీఛ రాజకీయం. ఆ ప్రెస్ నోట్ బైటకొచ్చి కూడా 3 రోజులవుతోంది, ఇప్పటి వరకూ మరో ప్రకటన లేదు, ఎవరికీ పరామర్శ లేదు.

ఓ వైపు బీజేపీ వీర్రాజు జనాల్లోకి చొచ్చుకుపోతున్నారు, ఇటు పవన్ కల్యాణ్ అడ్రస్ లేరు. దీంతో జనసైనికులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎంతసేపు కింది స్థాయి నేతలు సహాయ కార్యక్రమాలు చేస్తే.. వాటికి రీట్వీట్లు వేయడమేనా, నేరుగా రంగంలోకి దిగేదేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. వీటికి సేనాని ప్రెస్ నోట్లో ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.

జగన్ ని ఎలా దెబ్బ కొట్టాలి