ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట‌ర్వ్యూ పార్ట్-1 ప‌స లేదే!

చాలా కాలం త‌ర్వాత త‌న జ‌న‌సైనికుల‌ను పల‌క‌రించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. గ‌త ఐదారు నెల‌లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రెస్ మీట్లు, ప‌ర్య‌ట‌న‌లు ఏమీ లేవు. క‌రోనా భ‌యాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్…

చాలా కాలం త‌ర్వాత త‌న జ‌న‌సైనికుల‌ను పల‌క‌రించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. గ‌త ఐదారు నెల‌లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రెస్ మీట్లు, ప‌ర్య‌ట‌న‌లు ఏమీ లేవు. క‌రోనా భ‌యాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తిగా ఇంటికే ప‌రిమితం అయిపోయారు. ఈ ప‌రిణామాల మ‌ధ్య‌న జ‌న‌సేన పార్టీ యాక్టివిటీస్ పూర్తిగా ఆగిపోయాయి. ట్వీట్ల రాజ‌కీయం కూడా అంత‌గా పండ‌టం లేదు. ఉన్న ఎమ్మెల్యే పార్టీలో ఉన్న‌ట్లో, లేన‌ట్లో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. చ‌ట్ట‌స‌భ‌ల్లో జ‌న‌సేన‌కు ప్రాతినిధ్యం లేని ప‌రిస్థితుల్లో దాని ఉనికి పూర్తిగా ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది. బీజేపీ ద్వితీయ శ్రేణి నేత‌ల ట్వీట్ల‌ను రీట్వీట్ చేయ‌డ‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయం అయిపోయింది.

ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిమానుల‌కు, పార్టీ నేత‌ల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. విడ‌త‌ల‌వారీగా ఇంట‌ర్వ్యూ అంటూ ఫ‌స్ట్ పార్ట్ ను విడుద‌ల చేశారు. ఇదంతా చూస్తుంటే.. గ‌తంలో అజ్ఞాతంలో ఉండే కొంత‌మంది మీడియా ప్ర‌తినిధి.. అది కూడా త‌మ‌కు న‌మ్మికైన ఒక‌రిని పిలిచి ఇంట‌ర్వ్యూలు ఇచ్చే ప‌రిణామాలు గుర్తుకు వ‌స్తే దోషం ఎవ‌రిదో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

దాదాపు 20 నిమిషాలు సాగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట‌ర్వ్యూ పార్ట్ వ‌న్ లో క్రాస్ ఎగ్జిమిన్ ఏమీ లేకుండా పోయింది. పవ‌న్ ను ప్ర‌శ్న‌లు అడిగే యాంక‌రే, జ‌న‌సేన కార్య‌క‌ర్తలా ప్ర‌శ్న‌లు మొద‌లుపెట్టాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అయినా కాస్త సాఫ్ట్ స్పందించాడు కానీ, యాంక‌ర్ మాత్రం అన్నీ తేల్చి చెప్పాడు. మొద‌ట్లోనే ఆ కామెడీ మొద‌లైంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏ మాత్రం సీరియ‌స్ గా తీసుకోలేద‌ని వైద్య నిపుణులు అంటున్నారంటూ ఆ యాంక‌రెవ‌రో కొశ్చ‌న్ వేశాడు. 

అయితే క‌రోనా వైర‌స్ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వంపై రాళ్లు వేయ‌డానికి ఏమీ లేదు. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసిన గ‌ణాంకాల్లో కూడా త‌క్కువ స్థాయి క‌రోనా ట్రాన్స్మిష‌న్ రిస్క్ ప‌ర్సెంటేజ్ తో నిలిచింది ఏపీ. ప‌క్క రాష్ట్రాలు తెలంగాణ‌, త‌మిళ‌నాడు వంటి వాటితో పోలిస్తే ఏపీలో ప‌రిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది ఇప్ప‌టికి కూడా. దేశంలో అత్య‌థిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తూ ఉంది. అయినా జ‌న‌సేన ఏదో బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేసింది. ఆ ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కాస్త సాఫ్ట్ గా స్పందించాడు. ఏపీ ప్ర‌భుత్వం మ‌రి కొంత శ్ర‌ద్ధ చూపాల‌నే సూచ‌న చేశాడు. అది బాగానే ఉంది.

ఇక రెండో పాయింట్ గా ఇళ్ల కేటాయింపు అంశం గురించి ప‌వ‌న్ చెప్పుకొచ్చాడు. ఇళ్ల కేటాయింపు అంతా కేంద్ర బ‌డ్జెట్ తోనే జ‌రిగిపోతుంద‌ని ప‌వ‌న్ తేల్చాడు! అందులో రాష్ట్ర ప్ర‌భుత్వ వాటానే లేద‌న్న‌ట్టుగా ప‌వ‌న్ మాట్లాడారు. అది ఆయ‌న‌కు తెలియ‌క‌పోవ‌చ్చు పాపం! అలాగే కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు కాద‌ని వారికి ఇళ్ల‌ను ర‌ద్దు చేశార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. మ‌రి కొన్ని చోట్ల ఇళ్ల స్థ‌లాల కేటాయింపుల‌కు ప్రైవేట్ భూముల‌ను ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేశార‌నే ఆరోప‌ణ‌నూ చేశారు. అది త‌న దృష్టికి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ చెప్పారు.

మ‌రి అదే నిజ‌మైతే.. జ‌న‌సేన చేయాల్సింది ఏదో ఆరోప‌ణ‌లు కాదు, ఆధారాల‌ను చూపించి, ఫ‌లానా చోట వైసీపీ కార్య‌క‌ర్త‌లు కాద‌ని ఫ‌లానా వాళ్ల‌కు ఇళ్ల కేటాయింపును ర‌ద్దు చేశారు, ఫ‌లానా చోట్ల‌లో ప్రైవేట్ భూముల‌ను ఎక్కువ ధ‌ర‌కు కొన్నారు అంటూ ఆధారాల‌ను చూపిస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది. అలా కాకుండా ఏదో ఆరోప‌ణ‌లు చేసేస్తే అయిపోతుంద‌న్న‌ట్టుగా ఉంది ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రసంగం. అధినేత స్థాయి వ్య‌క్తి మాట్లాడితే ఏదైనా ప‌స ఉంటే బాగుంటుంది.

ఇక రాజ‌ధాని అంశం గురించి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిప్రాయాన్ని సూటిగా చెప్ప‌లేక‌పోయారు. గ‌త ప్ర‌భుత్వం ఎక్కువ స్థాయిలో భూముల‌ను సేక‌రించి త‌ప్పు చేసింద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం! అప్పుడు చంద్ర‌బాబుతో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చారు ప‌వ‌న్. అమ‌రావ‌తి ప్రాంతంలో రైతులు భూ సేక‌ర‌ణ‌ను వ్య‌తిరించిన‌ప్పుడు అక్క‌డ‌కు వెళ్లి, ఆ త‌ర్వాత చంద్ర‌బాబును క‌లిశారు ప‌వ‌న్. 40 వేల‌కు పైగా ఎక‌రాలు ఎందుకు సేక‌రించారు? అంటూ ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్న ప‌వ‌న్, అప్పుడెందుకు ప్ర‌శ్నించ‌లేదు అనేది ప్ర‌శ్న‌!

సింగ‌పూర్ త‌ర‌హా రాజ‌ధాని అంటూ గ‌త ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని ప‌వ‌న్ ఇప్పుడు చెబుతున్నారు! నాలుగేళ్ల పాటు తెలుగుదేశంతో ప‌వ‌న్ దోస్తీ చేశారు,  అప్పుడు ఈ అవ‌గాహ‌న లేదేమో పాపం. ఇక మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసం చేస్తోంద‌ని ప‌వ‌న్ అంటున్నారు. మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి అయిపోద‌ని తేల్చారు! అమ‌రావ‌తి రైతుల ఆందోళ‌న‌లు హింసాత్మ‌కం అవుతాయ‌న్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించ‌డం విశేషం. ఒక సంఘ‌ట‌న జ‌రిగేంత వ‌ర‌కూ ప్ర‌భుత్వానికి అర్థం కాద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు! నందిగ్రామ్ అవుతుంద‌ని, హింసాత్మ‌కం అవుతుంది అంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల మ‌ర్మం ఏమిటో మ‌రి!

ఇక ద‌ళితుల‌పై దాడులు జరుగుతున్నాయ‌ని, డాక్ట‌ర్ సుధాక‌ర్ పై పోలీసుల వైఖ‌రిని ప‌వ‌న్ ఖండించారు! ద‌ళిత హోంమంత్రి ఉన్నా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌టాన్ని బ‌ట్టి.. ద‌ళితుల పై దాడుల‌కు ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ఉంద‌ని అనుకోవాల్సి వ‌స్తోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. ఏతావాతా..  చాన్నాళ్ల త‌ర్వాత మాట్లాడిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ప‌స‌లేని ఆరోప‌ణ‌ల‌తోనే తొలి పార్టును ముగించారు.

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే