'జనసేనను విలీనం చేయమని ఒక పార్టీ వాళ్లు అడిగారు. ఈ విషయంలో తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు..' అని తన పార్టీ కార్యకర్తల మధ్యన ప్రకటించారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. తన పార్టీకి విలీనం ఆఫర్ ఉందని పవన్ కల్యాణ్ ఈ విధంగా ధ్రువీకరించారు. అయితే జనసేనను విలీనం చేయమని తనను అడిగినది ఎవరో మాత్రం పవన్ కల్యాణ్ చెప్పలేదు!
అది రహస్యం అన్నట్టుగా ఏదో గాసిప్ ను చెప్పినట్టుగా చెప్పారు పవన్. 'ఒక పార్టీ వాళ్లు అడిగారు, ఒత్తిడి తెచ్చారు, విలీనం చేయమన్నారు.. కానీ నేను చేయలేదు..' అంటూ నర్మగర్భంగా చెప్పారు పవన్. అయితే అదెవరో కూడా చెప్పి ఉంటే ఫటాఫట్, ధనాధన్ తేలిపోయేది. ఒకవేళ బీజేపీ వాళ్లు అడిగి ఉంటే ఆ విషయం మీదా వారూ స్పందించేవాళ్లు, అలాకాదు కాంగ్రెస్సో, టీడీపీనో, వైఎస్ఆర్సీపీనో.. ఎవరు అడిగారో పవన్ చెప్పేసి ఉంటే వాళ్ల బలహీనతా బయటపడిపోయేది.
అయితే పవన్ మాత్రం తనకు విలీనం ఆఫర్ ఇచ్చింది ఎవరో చెప్పలేదు. అయితే వారు విలీనం అడిగారు కానీ తను చేయలేదని చెప్పుకోవడం పవన్ ఉద్దేశం. విలీనం చేయకపోవడం తన గొప్ప దనానికి నిదర్శనం అని పవన్ కల్యాణ్ చెబుతూ ఉన్నారు. ఇక కార్యకర్తలతో పవన్ రొటీన్ డైలాగులు కొనసాగాయి.
తనను ఎవరూ భయపెట్టలేరని, తను ఎవరికీ భయపడను అని పవన్ కల్యాణ్ చెప్పారు. అయినా రాజకీయాలు అంటే భయపెట్టడం, భయపడటం అనే భావన నుంచి పవన్ కల్యాణ్ ఎప్పుడు బయటకు వస్తారో ఆయనకే తెలియాలని పరిశీలకులు అంటున్నారు. పవన్ రాజకీయ స్పీచ్ లు సినిమా డైలాగుల స్థాయి నుంచి ఎప్పటికీ బయటకు రావా? అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు.