కరకట్ట మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసం విషయంలో ఆ పార్టీ పరిస్థితి తేలుకట్టిన దొంగల్లే తయారైందని అంటున్నారు పరిశీలకులు. దొంగతనానికి వెళ్లిన ఒక దొంగకు తీరా సొరుగులోకి చేయి పెట్టాకా తేలు కుడుతుంది, గట్టిగా అరవలేడు, అలాగని నొప్పినీ భరించలేడు.. ఇప్పుడు కాస్త అటూ ఇటుగా తెలుగుదేశం పార్టీ అధినేత నివాసం ఉంటున్న ఇంటి విషయంలో ఆ పార్టీ కథ అలానే అగుపిస్తూ ఉంది.
చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసం అక్రమ నిర్మాణం అని ఏ ఆధారాలూ అవసరంలేకుండా కృష్ణానది తేల్చింది. చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాస సముదాయంలో ఔట్ హౌస్ వరకూ నీళ్లు వచ్చాయి. అందుకు ఆధారాలతో సహాచూపిస్తే, 'చంద్రబాబు నాయుడు ఔట్ హౌస్ లో ఉంటారా?' అని తెలుగుదేశం వాళ్లు ప్రశ్నిస్తున్నారంటే వారి పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
ఇక చంద్రబాబు నాయుడు ఇంటిని వరద ముప్పు నుంచి కాపాడటానికి కూలీలు మూడు రోజుల కిందటే రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు కూడా ధ్రువీకరిస్తూ ఉన్నాయి. భారీగా ఇసుక సంచులను అడ్డుగా వేశారని, ఇరవైమంది కూలీలు, భారీ ఎత్తున ఇసుక తరలించి సంచుల్లో కూరి వాటితో దడి కట్టారని, ఆ దడిని దాటుకుని నీరు లోపలకు వచ్చే అవకాశం లేదని తెలుగుదేశం అనుకూల మీడియానే విశ్లేషిస్తూ ఉంది!
ఇక్కడే దొరికిపోతూ ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోకపోతే తప్ప చంద్రబాబు నాయుడు నివాసంలోకి నీరు ప్రవేశించకుండా ఉండదనమాట. ఇసుక నింపిన గోతాలు అడ్డుగా వేయకపోతే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీరు ప్రవేశిస్తుంది. ఆ గోతాల మధ్యన నీరు లీకైనా ఇంట్లోకి నీరు వస్తుందని కూడా టీడీపీ మీడియానే చెబుతూ ఉంది. ఇదీ చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పరిస్థితి. తెలుగుదేశం వాళ్లు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. అందుకే ఎదురుదాడికి రెడీ అయిపోతున్నారు.
ఇష్యూను డైవర్ట్ చేయడానికి తమ శతథా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా డ్రోన్ ల మీద రాజకీయం జరుగుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు. వరద ముప్పులో తను ఉంటున్న ఇళ్లు చిక్కుకోవడంతో ఆ ఇంటిపై ఇదివరకూ జరిగిన రచ్చ నేపథ్యంలో తను కార్నర్ అయ్యేసరికి చంద్రబాబు నాయుడు డ్రోన్లు ఎగరేశారంటూ ఆ అంశం మీద రాజకీయాన్ని మొదలుపెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
తనకు భద్రత లేకుండా పోయిందంటూ చంద్రబాబు నాయుడు ఇందులో కూడా సానుభూతిని పొంది, రాజకీయం చేస్తూ ఉన్నారని.. అయితే జనాలు ఏమీ అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదని, ఈ ఎదురుదాడి రాజకీయాలు చెల్లవని చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.