తన పుట్టినరోజుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. చిన్నప్పట్నుంచి పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవడం తనకు ఇష్టంలేదని, పుట్టినరోజు సందర్భంగా అమ్మా-నాన్న డబ్బులిస్తే పుస్తకాలు కొనుక్కునేవాడినని అన్నారు. అంతేకాదు.. పుట్టినరోజు పేరిట కేక్ కట్ చేసి నోట్లో పెడితే అదోలా ఉంటుందంటున్నారు జనసేనాని.
“నాకు పుట్టినరోజులు జరుపుకోవడం అలవాటు లేదు. నేను పట్టించుకునేవాడ్ని కాదు. ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయేవారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లు, ఫ్రెండ్స్ 2-3 సార్లు నా పుట్టినరోజు జరిపే ప్రయత్నం చేశారు. కేక్ కట్ చేయడం, ఆ కేకు ముక్క తెచ్చి నా నోట్లో పెట్టడం లాంటివి ఎబ్బెట్టుగా అనిపించి నేనే ఆపేయమని చెప్పాను.”
తనను తాను ఎక్కువగా ఊహించుకోనంటున్నారు పవన్. నెల్లూరులో పెరిగినప్పుడు ఎలా ఉన్నానో… ఇప్పటికీ అదే మానసిక స్థితి, దిగువ మధ్యతరగతి స్థాయి దగ్గరే తన మనసు ఉండిపోయిందన్నారు.. అందుకే హీరోగా ఎదిగినప్పటికీ పుట్టినరోజు వేడుకలు చూస్తుంటే తనకు సంబంధం లేని విషయంగా మనసుకు తోస్తుందంటున్నారు.
ఎప్పట్లానే జనసేన ప్రతినిథి ఓ రెండు ప్రశ్నలు అడిగితే.. తన ఫామ్ హౌజ్ లో కూర్చొని పవన్ వాటికి సమాధానాలిచ్చారు.