రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవశాలి, 14 ఏళ్ల పరిపాలనానుభవం …ఇలా అనేకానేక గొప్పలను ఆభరణాలుగా అలంకరించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఓ విషయం అసలు అర్థం కావడం లేదు. జగన్ తీసుకున్న ఆ సంచలనం నిర్ణయం వెన కున్న మతలబు ఏంటో ఛేదించేందుకు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కావడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేయొద్దని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన్ను ప్రత్యర్థులు కూడా అనుసరించక తప్పలేదు. అయితే జగన్ వ్యూహం వెనుక ఎత్తుగడ ఏమై ఉంటుందో చంద్రబాబుకు అంతుచిక్కడం లేదు.
సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం, ప్రతిపక్షాల భాషలో చెప్పాలంటే దుర్వినియోగం చేసుకుని భారీ మెజార్టీ సాధించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఉప ఎన్నికల్లో ఈ ధోరణి మొదటి నుంచి కనిపించేదే. అయితే తిరుపతి ఉప ఎన్నికలో జగన్ నేతృత్వంలోని అధికార పార్టీ అందుకు పూర్తి విరుద్ధంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేయకపోవడంపై ప్రతిపక్షాలకు ఇప్పటికీ అంతుబట్టడం లేదు.
అసలు జగన్ ఉద్దేశం ఏమై ఉంటుందని టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ అనుభవానికి, మేధస్సుకు జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యం అంతుబట్టడం లేదని పార్టీ ముఖ్యులతో చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఇదే విషయమై పార్టీ అంతర్గత సమావేశాల్లో తిరుపతి ఓటర్లకు నోట్లు పంపిణీ చేయకపోవడంపై చర్చ జరిగినట్టు తెలిసింది.
తాజాగా తిరుపతిలో దొంగ ఓట్ల అంశం తెరమీదకు రావడంతో టీడీపీ నేతల మధ్య సీరియస్ చర్చ సాగుతోంది. ఓటుకు నోటు పంపిణీ చేయకపోవడం వల్ల మెజార్టీ ఓటర్లు అసంతృప్తితో అసలు ఓటింగ్‌కే రారని, అప్పుడు వాటిని తాము యథేచ్ఛగా వేసు కోవచ్చనే ఎత్తుగడలో భాగమే ఇదంతా అని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
ఇదే విషయమై చంద్రబాబుతో కూడా చర్చిస్తున్నట్టు తెలిసింది. ఒక వైపు ఓటుకు నోటు ఇవ్వని నేతగా వైఎస్ జగన్ ఆదర్శం, మరో వైపు డబ్బు ఖర్చు కాకుండా ఓట్లు… ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా అన్నీ సరిపోయాయని టీడీపీ నేతలు లోలోన మధనపడుతున్నారని తెలిసింది.
తిరుపతి పోరులో ఓటర్లకు డబ్బు పంపిణీ చేయని విషయాన్ని ఎమ్మెల్యేలకు జగన్ ముందే చెప్పేయడంతో, అందుకు తగ్గ ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకున్నట్టు …ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రత్యర్థులకు తెలిసొచ్చింది. వైఎస్ జగన్ నిర్ణయాలు ఒక పట్టాన అర్థం కాకపోవడంతో చంద్రబాబు ప్రతిసారి ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
సొదుం రమణ