తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఆసక్తిదాయకమైన సలహాను ఇచ్చారు. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన పెద్దిరెడ్డి టీడీపీ అధినేత శ్రేయస్సును ఆకాంక్షించారు.
ఇక చంద్రబాబు నాయుడు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుని, విశ్రాంతి తీసుకుంటే ఆయనకే మంచిదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహా ఇచ్చారు. ఎలాగూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారని.. ఆయన టీడీపీ బాధ్యతలను ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించి తప్పుకుంటే మంచిదని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడును పూర్తిగా తిరస్కరించారని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇక కుప్పం ఎన్నికల ప్రచారానికి వచ్చి… తన విషయంలో ఇష్టానుసారం మాట్లాడిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విషయంలో కూడా పెద్దిరెడ్డి స్పందించారు. *పెద్దిరెడ్డి గాడు..* అంటూ లోకేష్ బహిరంగంగా తనను సంబోధించాడని.. నవ్వుతూ ప్రస్తావించారు పెద్దిరెడ్డి. లోకేష్ సంస్కారం గురించి ఇలా స్పందించారాయన.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే.. కుప్పం నుంచి పోటీ చేయలేని పక్షంలో చంద్రబాబు నాయుడు పుంగనూరుకు వచ్చి పోటీ చేయవచ్చని కూడా పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చేతిలో ఓడినా, ఆయనపై గెలిచినా.. అది తనకు మంచిదే అని.. కావాలనుకుంటే పుంగనూరుకు వచ్చి పోటీ చేయాలని కూడా చంద్రబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహా ఇచ్చారు.
కుప్పంలో గెలిచామనే అహం లేకుండా పెద్దిరెడ్డి స్పందించారు. కుప్పానికి ప్రచారానికి వెళ్లి.. వయసులో పెద్దవాడనే సంస్కారం కూడా లేకుండా లోకేష్.. పెద్దిరెడ్డి గాడు, వాడూ, వీడూ.. అంటూ బహిరంగ వ్యాఖ్యానంతో తన అహంకారపూర్వక ధోరణిని చాటుకున్నాడు.
కుప్పంలో చంద్రబాబు ఆటను కట్టించిన పెద్దిరెడ్డేమో.. చంద్రబాబు కావాలనుకుంటే పుంగనూరు నుంచి పోటీ చేయవచ్చని.. ఆయన చేతిలో ఓడినా, గెలిచినా ఫర్వాలేదని.. అదో గౌరవమే అంటున్నారు! ఈ మాటలు విన్నావా లోకేషా!