దేశమంతా ఒమిక్రాన్ భయంలోకి జారుకున్న వేళ.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అందర్నీ కంగారు పెట్టించాడు. అధికారుల్ని ఉరుకులుపరుగులు పెట్టించాడు. దీనంతటికీ కారణం అతడు దక్షిణాఫ్రికా నుంచి రావడమే.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆ దేశం నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. శ్రీకాకుళం వాసి కూడా దక్షిణాఫ్రికా నుంచే వచ్చాడు. అయితే శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో అతడికి నెగెటివ్ వచ్చింది. దీంతో అతడ్ని విడిచిపెట్టారు.
అక్కడ్నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని తన గ్రామానికి చేరుకున్నాడు అతడు. అయితే గత నెలలో విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు మరోసారి పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో, అతడికి మరోసారి కరోనా టెస్ట్ చేశారు. ఈసారి అతడికి పాజిటివ్ వచ్చింది.
దీంతో అధికారులు టెన్షన్ పడ్డారు. అతడ్ని ఐసొలేషన్ లో ఉంచారు. అతడితో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు అతడి శాంపిల్స్ ను జెనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. దీంతో అతడికి ఒమిక్రాన్ సోకిందంటూ ప్రచారం మొదలైంది. కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా ఇచ్చేశాయి.
అయితే అతడికి ఒమిక్రాన్ సోకలేదని అధికారులు ప్రకటించారు. కేవలం కరోనా పాజిటివ్ మాత్రమే వచ్చిందని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తమ్మీద దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చిన సదరు వ్యక్తి మాత్రం, ఓ సెక్షన్ మీడియా చేసిన తప్పుడు ప్రచారం కారణంగా నిన్నంతా జిల్లా మొత్తాన్ని కంగారు పెట్టించాడు.