క‌రోనా కేసులు ల‌క్ష‌ల్లో వ‌స్తున్నాయి.. వ‌స్తే?

ఒక‌వైపు దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష‌ల్లోకి చేరిపోయింది. రోజుకు రెండున్న‌ర ల‌క్ష‌ల స్థాయిలో కేసులు వ‌స్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ప‌ద‌హారు ల‌క్ష‌ల స్థాయిలో ఉంది. క‌ర్ణాట‌క‌లో అయితే యాక్టివ్ కేసుల…

ఒక‌వైపు దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష‌ల్లోకి చేరిపోయింది. రోజుకు రెండున్న‌ర ల‌క్ష‌ల స్థాయిలో కేసులు వ‌స్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ప‌ద‌హారు ల‌క్ష‌ల స్థాయిలో ఉంది. క‌ర్ణాట‌క‌లో అయితే యాక్టివ్ కేసుల సంఖ్య మూడు రోజుల్లోనే రెట్టింపు స్థాయికి చేరాయి. రోజుకు ముప్పై వేల స్థాయిలో కేసులు వ‌స్తున్నాయి. య‌థావిధిగా మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. ఏపీలో కూడా రోజుకు నాలుగు వేల స్థాయిలో క‌రోనా కేసులు వ‌స్తున్నాయి.

ఈ స్థాయిలో నంబ‌ర్లు రావ‌డం పెద్ద వింత ఏమీ కాక‌పోవ‌చ్చు, కానీ ప్ర‌జ‌లు మాత్రం క‌రోనాను పూర్తి లైట్ తీసుకున్నారు. క‌రోనా కేసులు ఏ స్థాయిలో వ‌స్తున్నాయ‌ని చెప్పినా ప్ర‌జ‌లెవ్వ‌రూ భ‌య‌ప‌డే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. భ‌య‌ప‌డ‌మ‌ని ఎవ్వ‌రూ చెప్ప‌డం లేదు. క‌నీసం జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. ఈ జాగ్ర‌త్త చ‌ర్య‌లే ఇప్పుడు క‌ర‌వ‌వుతున్నాయి.

బ‌స్సుల్లో ప్ర‌యాణాలు కిక్కిరిసిన స్థాయిలో జ‌రుగుతున్నాయి. సంక్రాంతికి ఊళ్ల‌కు, విహారాల‌కు వెళ్ల‌డం, రావ‌డంతో ప్ర‌యాణాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా సాగుతున్నాయి. ఇక మిగ‌తా ప‌నుల‌న్నీ యాజిటిజ్ గా జ‌రుగుతూ ఉన్నాయి. ఇవ‌న్నీ జ‌ర‌గ‌డం మంచిదే కానీ, క‌నీసం మాస్కులు, భౌతిక దూరం వంటి వాటిని కూడా ఎవ్వ‌రూ సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రెండో వేవ్ లో కేసుల సంఖ్య భారీగా వ‌చ్చిన‌ప్పుడైనా కాస్త మాస్కులు ధ‌రించారేమో కానీ, ఇప్పుడు విద్యాధికులు, అనునిత్యం ఎవ‌రితో ఒక‌రితో మీట్ అయ్యే వాళ్లు కూడా మాస్కుల‌ను శ్ర‌ద్ధ‌గా ధ‌రించ‌డం లేదు. మాస్కును త‌గిలించుకునే వాళ్ల‌లో కూడా నామ‌మాత్రంగా  దాన్ని ధ‌రించ‌డ‌మే ఎక్కువ‌గా ఉంటోంది. మిగ‌తా వాళ్ల‌కు ఆ  ఆస‌క్తి కూడా లేన‌ట్టుగా ఉంది. 

ఇక భౌతిక దూరం అనే మాటే ఆచ‌ర‌ణ‌లో లేదు. ఇక శానిటైజ‌ర్లూ, హ్యాండ్ వాష్ లను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. స్థూలంగా క‌రోనాను ప్ర‌జ‌లెవ్వ‌రూ లెక్క చేయ‌డం లేదు. భారీ సంఖ్య‌లో కేసులు వ‌స్తున్నాయ‌ని అనునిత్యం వార్త‌ల్లో చూస్తున్నా.. వ‌స్తే ఏంట‌న్న‌ట్టుగానే ఉంది తీరు!