కొన్ని రోజుల కిందటి సంగటి.. స్వయంగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో జెండా ఎగరేశారు తెలుగుదేశం కార్యకర్తలు. ఆ తర్వాత కొన్ని రోజులకు చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల ఎన్టీఆర్ ఫొటోతో జెండాలు ఎగరేసే కార్యక్రమాలు వరుసగా జరిగాయి. అలా పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కువైంది.
నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్న ఆ అంశాన్ని మరల్చేందుకు, కార్యకర్తల్ని తనవైపు తిప్పుకునేందుకు లోకేష్ రకరకాల కుయుక్తులు పన్నుతున్నారని, అందులో భాగంగా జగన్ ను ఇష్టమొచ్చినట్టు తిట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు మంత్రి పేర్ని నాని.
“రావాలి జూనియర్ ఎన్టీఆర్.. కావాలి జూనియర్ ఎన్టీఆర్ అంటూ తెలుగుదేశంలోని ప్రతి కార్యకర్త గోల గోల చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, నేనే సరిపోతానని చెప్పుకోవడానికి లోకేష్ తిప్పలు పడుతున్నాడు. అందుకే జగన్నోహన్ రెడ్డిగార్ని నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, లోకేష్ పనికొస్తాడని అనిపించుకునే తాపత్రయంలో ఉన్నాడు. బాగా పిచ్చి పట్టి ఉన్నాడు. అలాంటి వెర్రిలో ఉన్నోడ్ని మనమేం చేయలేం.”
సరిగ్గా లేచి నిల్చోలేని వ్యక్తి కూడా నేను లేస్తే మనిషిని కాదంటూ డైలాగులు చెబుతుంటాడు. లోకేష్ పరిస్థితి కూడా అలానే ఉందంటూ ఎద్దేవా చేశారు మంత్రి. ఇప్పుడు లోకేష్ ఉన్న పరిస్థితి చూసి కోపం కంటే, జాలి కలుగుతోందన్నారు పేర్ని నాని.
“లోకేష్ తెగ తాపత్రయ పడుతున్నాడు. అతడ్ని చూస్తుంటే జాలేస్తోంది. పెద్ద ఎన్టీఆర్ ను కస కస కస వెన్నుపోటు పొడిచి వాళ్ల నాన్న పదవి లాక్కొచ్చాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కస కస పొడిచి లాక్కుపోతాడేమో అనే భయంతో తండ్రికొడుకులు వణికిపోతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న చంద్రబాబు, లోకేష్ ను చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేం.”
ఎవరు చేసిన కర్మను వాళ్లు ఈ జన్మలోనే అనుభవిస్తారని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన పాపం బాబు-లోకేష్ ను వదలదని అన్నారు నాని. కార్యకర్తలంతా కలిసి జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తెచ్చి, తండ్రికొడుకుల్ని బయటకు తోసే టైమ్ త్వరలోనే వస్తుందన్నారు.