ఏపీలో కుల రాజకీయాలు అసహ్యించుకునే హీనస్థితికి దిగజారుతున్నాయి. కులాల విద్వేష పునాదులపై అధికార సౌధాన్ని నిర్మించుకోవాలనే తపనలో రాజకీయ పార్టీలు అన్ని హద్దులూ దాటి ప్రవర్తిస్తున్నాయి. ఒకే కులంలో పార్టీలుగా విడిపోయి తన్నుకు చస్తున్నాయి. ఈ నేపథ్యంతో తాజాగా క్షత్రియ వర్సెస్ క్షత్రియ అనే రీతిలో కుల రాజకీయం చిచ్చు రేపింది. కుల రాజకీయ వేడి “రాజు”కుంటోంది.
నిన్న తెలుగుదేశం అనుకూల పత్రికల్లో , అది కూడా ఆ సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో “రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్షత్రియ సమాజం” పేరుతో ఓ ప్రకటన (అడ్వర్‌టైజ్‌మెంట్) వెలువడింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, విజయనగర రాజవంశీయుడు పూసపాటి అశోక్ గజపతిరాజు విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు అసభ్య పదజాలంతో దూషణకు పాల్పడుతున్నారని సీఎం జగన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. దీంతో తమ క్షత్రియుల హృదయాలు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి నోటిని అదుపులో ఉంచాలని సుతిమెత్తని హెచ్చరిక చేశారు. ఈ ప్రకటన రాజకీయ దుమారం రేపింది.
దీనికి కౌంటర్‌గా క్షత్రియ సామాజిక వర్గం నేత, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓ ప్రకటన (అడ్వర్‌టైజ్మెంట్) ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్నటి లేఖలోని అంశాలకు దీటైన సమాధానం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే రాజకీయ, సామాజిక, న్యాయ వివాదాల్లో ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాల్లో కుల సంఘాలు జోక్యం చేసుకోవడం మర్యాద కాదని హితవు చెప్పారు. “క్షత్రియ సోదర సోదరీమణులకు వినమ్ర విజ్ఞప్తి” అనే శీర్షికతో రాసిన లేఖలో ఐదు అంశాలను ప్రస్తావించారు. వాటిలోని ప్రధాన సారాంశం ఏంటో తెలుసుకుందాం.
“తెలుగు రాష్ట్రాల్లోని క్షత్రియుల పేరిట నిన్న కొన్ని దినపత్రికల్లో వచ్చిన ప్రకటన ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ ఇది ఒక రాజ కీయ పార్టీకి పూర్తిగా కొమ్ము కాస్తూ ఇచ్చిన మద్దతుగా కనపడింది. రాజకీయ అంశాలకు కులపరమైన రంగులు పులుము కుంటూ ఇచ్చిన ఆ ప్రకటన సరికాదని భావిస్తూ కొన్ని అంశాలను విజ్ఞులైన క్షత్రియ సోదరసోదరీమణుల దృష్టికి తీసుకొస్తున్నాం.
అశోక్ గజపతిరాజు తన సొంత అన్న కూతురు అయిన క్షత్రియురాలైన సంచయితకు ఎందుకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారో స్పష్టం చేయాలి. క్షత్రియ సమాజంలోని మహిళలను అశోక్ గజపతిరాజు గుర్తించకపోగా ఇంతగా అవమానించడం కరుడు గట్టిన దురంహకారానికి చిహ్నంగా భావించాలి. మన క్షత్రియ సామాజిక వర్గంలో మహిళలకు ఎలాంటి హక్కులు ఉండవనే చెప్పడమే అశోక్ గజపతిరాజు ఉద్దేశమైతే అలాంటి వాదనను ఏ ఒక్కరూ సమర్థించొద్దు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానానికి చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు ఉండవల్ల కలిగిన లాభం ఏంటి? అలాగే సంచయిత ఉండడం వల్ల కలిగిన నష్టం ఏంటి?
ఇప్పుడు అశోక్‌గజపతిరాజును సమర్థిస్తున్న ఒక వర్గం వారి పూర్వీకులే అశోక్ గజపతిరాజు తండ్రి ఒక పెద్ద దోపిడీదారని చిత్రీకరించలేదా? మాన్సాస్ ట్రస్ట్ భూములను ఏపీఎండీసీకి అప్పగించక ముందు ఆ ఇసుక అంతటినీ లెక్కా పత్రం లేకుండా దోచుకున్నదెవరు? అలాగే మాన్సాస్ విద్యా సంస్థలకు రావాల్సిన రూ.35 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు కూడా చేయకుండా నాశనం చేసిందెవరు? ఇవే కాకుండా మాన్సాస్ భూములను కోర్టుకు తెలియకుండా వేలం వేయించెదరు? ఈ నేరాలన్నింటినీ ప్రశ్నిస్తుంటే కులం చాటున దాక్కోవాలని అశోక్ గజపతిరాజు ప్రయత్నిస్తున్నారు. ఈ నేరాలన్నీ చేయాలని ఆయనకు కులం ఆయనకు అనుమతి ఇచ్చిందా?
వివాదాలను సంబంధిత ప్రభుత్వ సంస్థలకు, న్యాయ స్థానాలకు విడిచి పెట్టాలి. చట్టం తన పని తాను చేసుకునేందుకు అనుమతించాలని క్షత్రియ సోదరసోదరీమణులకు వినమ్రంగా విజ్ఞప్తి”
కరుడు గట్టిన దురంహకారానికి అశోక్ గజపతిరాజు వైఖరి చిహ్నమని, అలాగే నేరాలను ప్రశ్నిస్తుంటే కులం చాటున దాక్కో వాలని అశోక్ గజపతిరాజు ప్రయత్నిస్తున్నారని మరోసారి సాటి క్షత్రియుడిగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు తీవ్రస్థాయిలో విరుచుకు పడడం గమనార్హం. ముల్లును ముల్లుతోనే తీయాలనే చందాన క్షత్రియ సమాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నా యనే పేరుతో ప్రధాన ప్రతిపక్షం లోపాయికారిగా వేసే ఎత్తులను చిత్తు చేసే క్రమంలో, అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రిని వైసీపీ రంగంలోకి దింపడం గమనార్హం.