కోస్తాలో ఇప్పటికే ఓసారి కరోనా భయాలు ముసురుకున్నాయి. వింత వైరస్ సోకి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుంటే అంతా కరోనా అనుకున్నారు. దీంతో తణుకు పరిసర ప్రాంతాల్లో చికెన్-మటన్ అమ్మకాలపై గతంలో వారం రోజులు నిషేధం విధించారు. ఇప్పటికీ అక్కడ అమ్మకాలు అంతంతమాత్రమే. ఇలాంటి పరిస్థితుల మధ్య కోస్తాలో ఓ వ్యక్తికి కరోనా సోకిందనే అనుమానాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. దీనికి కారణం అతడు ఈమధ్య సౌత్ కొరియా వెళ్లి రావడమే. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు ఇతడ్ని కూడా టెస్ట్ చేశారు. కానీ ఎలాంటి పాజిటివ్ నమోదు కాలేదు. అలా తన గ్రామానికి వచ్చిన ఈ వ్యక్తి కొన్నాళ్లుగా తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో వైద్యులు అతడికి కరోనా వచ్చినట్టు అనుమానించారు.
అయితే ఇక్కడే బాధితుడు తప్పుచేశాడు. తనకు కరోనా సోకిందనే అనుమానం వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించాల్సిన ఈ వ్యక్తి, తన గ్రామం నుంచి పరారయ్యాడు. ముమ్మిడివరంలో ఉన్న అత్తగారింటికి వెళ్లి తలదాచుకున్నాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, అతడ్ని వెదికి పట్టుకున్నారు. ప్రస్తుతం అతడ్ని ప్రత్యేక వార్డులో ఉంచారు.
అయితే అతడికి కరోనా వచ్చిందా లేదా అనేది ఇంకా నిర్థారణ కాలేదు. అతడి టెస్టులు ఇంకా రాలేదు. ఈ గ్యాప్ లో అతడు ఏఏ ప్రాంతాల్లో తిరిగాడో పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనతో కోస్తాలో కరోనా భయాలు మరింత పెరిగాయి.