అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌శాంత్ కిషోర్ అంచ‌నా ఇదే!

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న యూపీ, పంజాబ్ ఇత‌ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకే ఎడ్జ్ ఉంటుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్. పొలిటిక‌ల్ ట్రెండ్ గురించి పీకే…

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న యూపీ, పంజాబ్ ఇత‌ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకే ఎడ్జ్ ఉంటుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్. పొలిటిక‌ల్ ట్రెండ్ గురించి పీకే స్పందిస్తూ… ఇలా బీజేపీ అనుకూల వాదాన్ని వినిపించారు. అయితే ఇది వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కూ క్యారీ అవుతుంద‌ని మాత్రం పీకే అన‌డం లేదు. 

అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ క‌మ‌లం పార్టీకే అనుకూల‌త ఉన్నా.. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం భిన్నంగా ఉండ‌వ‌చ్చ‌ని పీకే అంచ‌నా వేస్తున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా 2012 నాటి ప‌రిస్థితిని ప్ర‌స్తావించారు పీకే.

2012 యూపీ ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. అనూహ్య‌మైన స్థాయిలో సీట్ల‌ను సంపాదించుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2014 నాటికి యూపీలో ప‌రిస్థితి పూర్తిగా మారిపోయిన వైనాన్ని పీకే ప్ర‌స్తావిస్తున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యూపీలో స‌మాజ్ వాదీ హ‌వా సాగగా, ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు జ‌రిగిన లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం 90 శాతం సీట్ల‌ను బీజేపీ నెగ్గిన సంగ‌తి తెలిసిందే.

అలాగే ఆ స‌మ‌యంలో ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ ల‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పంజాబ్ లో అకాళీద‌ల్ విజ‌యం సాధించింది. అయితే 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చిత్త‌వ్వ‌డంతో పాటు, ఆ త‌ర్వాత అకాళీద‌ల్ కూడా అడ్ర‌స్ లేకుండా పోయింది.

స‌రిగ్గా ప‌దేళ్ల కింద‌టి ప‌రిణామాల‌తో ప్ర‌స్తుత ప‌రిస్థితిని పోలుస్తున్నారు పీకే. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీనే ముందు నిలిచినా, అది జాతీయ స్థాయిలో బీజేపీ హ‌వా సాగుతోంద‌ని అన‌డానికి రుజువు కాబోద‌ని పీకే అంచ‌నా వేస్తున్నారు.