ఓట్లను చీల్చడానికి.. కూడటానికి.. నువ్వు ఎవరు పవన్ కల్యాణ్! సొంతంగా పోటీ చేయలేను అని చెప్పుకోవడమే నువ్వు చేయాల్సింది, చేస్తున్నది కూడా! ఓటును చీల్చను.. అనేది స్థాయికి మించిన మాట! కేవలం తమ చేతగాని తనాన్ని కవర్ చేసుకునేందుకు చెబుతున్న మాట కాదా!
రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమి పాలైనా పవన్ కల్యాణ్ తన డైలాగులను మాత్రం మార్చడం లేదు. ఎవరు రాసిస్తున్నారో కానీ, ఈ మేకపోతు గాంభీర్యపు పలుకులు ప్రహసనంగా మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. సినిమాల్లో పవన్ చెప్పే డైలాగులు సీరియస్ అనుకుంటే, రాజకీయంలో మాత్రం కామెడీ. ఇదే సీరియల్ కొనసాగుతూ ఉంది.
ఓట్లను చీల్చను, ప్రజలపై ఎన్నికల ఖర్చును పడనివ్వను.. అని కాదు రాజకీయ పార్టీల అధినేతలు చెప్పాల్సింది. అలా చెబితే ప్రజల తిరస్కరమే తప్ప, సత్కారం ఉండదు. వెనుకటికి చిరంజీవి ప్రజలపై ఎన్నికల భారం పడనివ్వను అంటూ తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపారు. దాని ఫలితం ఏమిటో పవన్ కు తెలిసే ఉండాలి!
రాజకీయ పార్టీ అన్నాకా.. ఎన్నికలను ఎదుర్కొనాలి. ఎన్ని ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనడానికి సై అనాలి. పొత్తులు ఎత్తులే అయి ఉండొచ్చు కానీ, నిర్మాణమే లేని పార్టీ పొత్తులకు వెళితే .. దాని వల్ల సాధించేది ఏమీ ఉండదు.
ఏదో రెండు మూడు శాతం ఓట్లతో ఏదో ఒక పార్టీకి తొత్తుగా ఉండటమే తప్ప.. పవన్ చెప్పే పాతికేళ్ల రాజకీయం మాత్రం ఇలాంటి తీరుతో ఛాన్స్ లేని అంశమే. ఈ విషయం పవన్ కూ తెలియక కాదు.
పాతికేళ్ల రాజకీయం చేయాలని వచ్చిన వాడు.. సోలోగా ఒక్కసారి ఎన్నికల్లో నిలబడాలి. తన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. నియోజకవర్గ స్థాయిలో, ప్రతి పల్లెటూరి స్థాయిలో పార్టీ నిర్మాణం జరగాలి.
అది పాతికేళ్ల రాజకీయం అంటే. ఓట్లను చీల్చను అని చెప్పడం కన్నా.. రెండు మూడు శాతం ఓట్లను క్యాష్ చేసుకుంటాను అని డైరెక్టుగా చెబితే పద్ధతిగా ఉంటుందేమో!