కాశ్మీర్ ఫైల్స్: చరిత్ర చూడని చీకటి గాధ

జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ యూదుల మీద చూపించిన హింస చరిత్ర పుటల్లో ఇప్పటికీ భయానకంగా బుసలుకొడుతుంటుంది.  Advertisement ఇరాక్ నియంత సద్దాం హుసేన్ పాలనలోని చీకటి కోణాన్ని ప్రపంచానికి చూపించి అమెరికా అతనిని…

జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ యూదుల మీద చూపించిన హింస చరిత్ర పుటల్లో ఇప్పటికీ భయానకంగా బుసలుకొడుతుంటుంది. 

ఇరాక్ నియంత సద్దాం హుసేన్ పాలనలోని చీకటి కోణాన్ని ప్రపంచానికి చూపించి అమెరికా అతనిని అంతమొందించింది. 

లిబ్యా నియంత గడాఫీ అకృత్యాలను ప్రపంచానికి చూపి అక్కడి తిరుగుబాటుదారులు అతనిని రోడ్డుమీదికీడ్చి కొట్టి చంపడం చరిత్రలో రికార్డయింది.  

ఇలా వేరు వేరు దేశాల్లో ప్రజలమీద జరిగిన అకృత్యాలు, ఆయా అరాచకవాదుల ముగింపు అన్నీ ప్రపంచం చూస్తూనే ఉంది. 

కానీ ఆధునిక కాలంలో 1990లో భారతదేశంలో జరిగిన ఒకానొక దమనకాండ మాత్రం భారతదేశమే చూడలేదు…కాదు చూపించలేదు. 

సోషల్ మీడియా లేకపోయినా సంప్రదాయ మీడియా వేళ్లూనుకుని ఉన్న ఆ కాలంలో అదెలా సాధ్యమయింది? చూపించకుండా ఆపిందెవరు? పైగా చూపించాల్సింది చూపించకుండా తప్పుడు వార్తలని ప్రచారం చేయించిన శక్తులెవరు? 

ఇంతకీ ఆ ప్రాంతమేది?

కాశ్మీర్. 

ఎవరా బాధితులు?

కాశ్మీరీ పండిట్స్ మరియు ఎందరో హిందువులు, సిక్కులు.

దమనకాండ జరిపిందెవరు?

ముస్లిం తీవ్రవాదులు.

ఈ కథంతా “కాశ్మీర్ ఫైల్స్” పేరుతో తెరకెక్కించారు. భారతీయ తెర మీద ఈ స్థాయి కౄరత్వాన్ని గతంలో ఎప్పుడూ చూసినట్టు గుర్తులేదు. 

అసలు సెన్సార్ బోర్డు ఈ స్థాయి దృశ్యాలకి ఎంత “ఎ” సర్టిఫికేట్ అయినా అనుమతే ఇవ్వదు. 

కానీ దేశప్రజలకి 1990లో మీడియా చూపించని దారుణాలన్నీ ఇప్పుడు 2022లో చూపించేయాలని నిర్ణయించుకున్నట్టుంది ఈ దేశం. అందుకే సెన్సార్ బోర్డు కూడా ఒక్క సన్నివేశాన్ని కూడా ముట్టుకున్నట్టు లేదు. రాతిహృదయాలున్నవారు కూడా కొన్ని సన్నివేశాలకు కళ్లు మూసుకుంటారు కచ్చితంగా…

ఏది ఏమైనా ఈ సినిమా చూపించి హిందూ ప్రేక్షకుల రక్తాన్ని మరిగించాలని డిసైడైపోయినట్టున్నారు. 

హీరో ఇచ్చే చివరి స్పీచులో, “ఒక్క హిందువుల్నే కాదు, మోడరేట్ ముస్లింస్ ని కూడా ఆ తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు…” అని చెప్తాడు. 

ఆ ఒక్కచోట తప్ప ఎక్కడా బ్యాలెన్స్ చెయ్యాలనే లెక్కలు వేసుకోలేదు మేకర్స్. తెరమీద కనిపించే యావన్మంది కాశ్మీర్ ముస్లింస్ ని కరడుకట్టిన తీవ్రవాదులుగానూ, వాళ్లకు సహాయపడేవాళ్లుగానూ చూపించారు. మచ్చుకైనా మంచి ముస్లిం ఈ సినిమాలో కనపడడు. 

“అయితే ముస్లిములుగా మారండి- లేదా పారిపోండి- కాదంటే చావండి” అనే నినాదంతో కాశ్మీర్లోని ముస్లిం తీవ్రవాదులు అక్కడి హిందువుల్ని ఎలా ఊచకోత కోసారో చూస్తే నరాల్లోని రక్తం స్థంభించిపోతుంది. 

“హిందూ మగాళ్లంతా మీ ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళిపోండి. వాళ్ళతో మేం ముస్లిముల్ని పుట్టించుకోవాలి” లాంటి నినాదాలు కూడా చేసి కాశ్మీరీ హిందువులకి నరకం చూపించినఘట్టాలు ఇందులో ఉన్నాయి. 

తీవ్రవాదులు ఆర్మీ జవాన్ల డ్రెస్సులో వచ్చి హిందూ మహిళల్ని రేప్ చేయడాన్ని కూడా ఈ చిత్రం ప్రస్తావించింది. 

ఆర్టికల్ 370 రద్దు కోసం ఇందులోని ప్రధానపాత్ర పుష్కర్నాథ్ పండిత్ (అనుపం ఖేర్) జీవితకాలపోరాటం చేస్తాడు. ఆ క్రమంలో తన కొడుకుని, కోడల్ని, మనవడిని కోల్పోతాడు. ఆ ఆర్టికల్ రద్దుకాని రోజుల్లో కాశ్మీర్ ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రమిది. 

అది కూడా దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం లేనప్పుడు అరాచకశక్తులు ఎలా విరుచుకుపడతాయో ఈ సినిమా చూస్తే అర్థమౌతుంది. 

నిజమే..ఈ చిత్ర కథ జరుగుతున్న కాలంలో వీపీ సింగ్, చంద్రశేఖర్ లాంటి వాళ్లు ప్రధానులు. ఆ టైములో దేశమెలా ఉండేదో అప్పటివారికి గుర్తుండాలి. 

ఎప్పుడూ లేనంతగా స్టార్స్ లేని ఒక హిందీ సినిమా దక్షిణభారతదేశంలో కూడా సత్తా చాటుకుంటోంది. నార్త్ లోనే కాదు, సౌత్ లోని నగరాల్లో కూడా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 

అంతా బానే ఉంది కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ఇప్పుడెలా మారుతోందో చూపించకుండా అర్థాంతరంగా ముగించిన సినిమా ఇది. 

మూడు గంటల సినిమా చూసినా ఇంకాసేపు ఉంటే బాగుండు, ఏదైనా మనసుకు స్వాంతన ఇచ్చే సన్నివేశంతో ముగిస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ గుండెల్ని పిండే ముగింపుతో, శ్మశాన నిశ్శబ్దంతో హాల్లోంచి బయటికి రావడమే ప్రేక్షకుల వంతౌతోంది. 

ఆమధ్య ఆర్టికల్ 370 రద్దవడం, మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలిగింట బీజేపీ గెలుపు సాధించడం, ఇప్పుడు “కాశ్మీర్ ఫైల్స్” సినిమా దేశవ్యాప్తంగా హిట్టవడం చూస్తుంటే అధికశాతం ప్రజల్లోని రక్తం కంటికి ఎర్రగా కనిపిస్తున్నా మనోనేత్రంతో చూస్తే కాషాయరంగులోనే ఉన్నట్టు అనిపిస్తోంది. 

శ్రీనివాసమూర్తి