రాజకీయాలంటే కామెడీ చేయడం కాదని సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలిసొచ్చింది. మొదట కమెడియన్‌గా ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ బడా నిర్మాత అవతారం ఎత్తాడు.
తమ పాపులారిటీని సొమ్ము చేసుకోవాలని సినిమా వాళ్లకు, అలాగే జనాల్లో ఆ రంగంపై ఉన్న మోజును రాజకీయంగా వాడుకోవాలనే తపన రాజకీయ పార్టీలకు ఉండడం ఎప్పటి నుంచో చూస్తున్నాం.
ఈ క్రమంలో కమెడియన్, బడా నిర్మాత అయిన బండ్ల గణేష్ 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. రావడం రావడంతోనే దూకుడు ప్రదర్శించాడు. టీవీ చర్చల్లో ప్రత్యర్థి పార్టీలపై దబాయింపు ప్రదర్శించాడు. రాజకీయాలంటే సినిమా షూటింగ్‌లు కాదనే విషయాన్ని మరిచి, తన పార్టీ గెలవకపోతే బ్లేడ్‌తో గొంతుకోసుకుంటా లాంటి సినీ డైలాగ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
చివరికి కాంగ్రెస్ ఓటమి అతనికి తత్వాన్ని బోధపరిచింది. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు… మళ్లీ సినీ రంగంపై దృష్టి సారించాడు. తన ఆరాధ్య హీరో పవన్‌కల్యాణ్‌తో త్వరలో సినిమా చేయనున్నట్టు ఇటీవల బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఇదిలా ఉండగా బండ్ల గణేష్ తాజాగా ట్విటర్‌లో పెట్టిన ఓ రిక్వెస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది. గతంలో బండ్ల గణేష్ రాజకీయాలపై చేసిన విమర్శలు, డిబేట్లకు సంబంధించిన వీడియోలను కొందరు నెటిజన్లు తమ అభిమానిస్తున్న పార్టీల వైఖరులకు అనుగుణంగా మలిచి వైరల్ చేస్తున్నారు. దీనిపై బండ్ల గణేష్ ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఆ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది.
“నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన …మీ బండ్ల గణేష్” అంటూ అందరినీ రిక్వెస్ట్ చేశాడు. అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాట్లాడిన తర్వాత , అవి పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్లాక జనం తమకిష్టం వచ్చినట్టు వాడుకుంటారు. ఇప్పుడు ఏం మొత్తుకుంటే ఏం ప్రయోజనం!