ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, దాని అనుకుల మీడియా టార్గెట్ వైఎస్ జగన్ కన్నా ఎక్కువ విజయసాయిరెడ్డి మీదకు మారింది. ఆ పార్టీ పునాదుల్లో వుండి, ఆ పార్టీ వల్ల విస్తరిస్తూ, ఆ పార్టీ వల్ల ప్రయోజనం పొందుతున్న సామాజిక వర్గం ఇప్పుడు విజయసాయిరెడ్డి అంటే ఒంటి కాలి మీదే లేస్తోంది.
అతని ఓ భూతంలా చూస్తోంది. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖలో తరతరాల తమ సామ్రాజ్యాన్ని విజయసాయి పెకిలించే ప్రయత్నం చేస్తున్నారని తెగ బాధపడుతున్నారు.
తెలుగుదేశం, ఎన్టీఆర్, చంద్రబాబు, పురంధ్రీశ్వరి, వెంకయ్య నాయుడు లాంటి వారి అండదండలతో విశాఖ మొత్తం తమ హస్తగతం చేసుకుని, సక్రమంగా, అక్రమంగా ఆస్తులు పెంచుకుంటూ, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు.
అలా చేయడానికి సుమారు నలభై ఏళ్లు పట్టిృంది. ఇప్పుడు ఏణ్ణర్థంలో విజయసాయిరెడ్డి ఆ అక్రమాల మూలలు కనిపెట్టి కూలగొడుతున్నారు. ప్రతి శనివారం ఓ అక్రమం నిగ్గు తేల్చుతున్నారు.
దీంతో ఆ వర్గం జనాలు విలవిల లాడిపోతున్నారు. కిందా మీదా అయిపోతున్నారు. విజయసాయి అంటే నిప్పులు చెరుగుతున్నారు. ఆ వర్గం మీడియా విజయసాయికి వ్యతిరేకంగా రోజూ పేజీలకు పేజీలు వండి వారుస్తున్నారు. అయితే జనాలకు విషయం అర్థం అయిపోయింది. ఎవరు కిట్టకపోతే వారి మీద వార్తలు వండివార్చడం ఈ మీడియాకు మామూలే అని చదివి పక్కన పడేస్తున్నారు.
విజయసాయిని ఎక్కడ టార్గెట్ చేయాలో అర్థం కావడం లేదు. వీలయితే అసమ్మతిని రేకెత్తిద్దాం అని చూస్తున్నారు. కానీ జగన్ దగ్గర అలాంటి పప్పులు ఉడకడం లేదు. ఇలాంటి టైమ్ లో ఎయిర్ పోర్ట్ మూసివేత..(ఇప్పుడు కాదు, భోగాపురం ఎయిర్ పోర్టు కట్టిన తరువాత) లాంటి అంశాలు పట్టుకుంటున్నారు.
హైదరాబాద్ లో, బెంగళూరులో ఏం జరిగింది అన్నది కన్వీనియేంట్ గా దాచేసి, విశాఖకు విజయసాయి తీరని అన్యాయం చేస్తున్నారని టముకు వేస్తూ, జనాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
అలా అయితే రాబోయే మేయర్ ఎన్నికల్లో జనం రివర్స్ అవుతారని, తెలుగుదేశం పార్టీకి మేయర్ పదవి కట్టబెడతారని చూస్తున్నారు. కానీ అది అంత వీజీ కాదని వారికీ తెలుసు. అయినా ఏదో తమ ప్రయత్నం తాము చేయాలి కదా? వైకాపాలో విజయసాయి అంటే బొత్స లాంటి కొందరికి లోలోపల మండుతోందని తెలుసు. వీలయితే దానిని ఎగసం దోయాలి.
మరోపక్క జనాలను రెచ్చగొట్టాలి. ఏదో ఒకటి చేయాలి. మొత్తం మీద విశాఖలో సడలిపోతున్న తమ గ్రిప్ ను నిలబెట్టుకోవాలి. తమ అక్రమ, ఆస్తులను కాపాడుకోవాలి. అందుకే ఇప్పుడు తమ తక్షణ కర్తవ్యం ఒక్కటే టార్గెట్ విజయసాయి.