Advertisement

Advertisement


Home > Politics - Political News

దెబ్బకు దారికొచ్చిన జనసైనికులు

దెబ్బకు దారికొచ్చిన జనసైనికులు

ఒక్క అరెస్ట్.. ఒకే ఒక్క అరెస్ట్.. జనసైనికులందర్నీ సోషల్ మీడియాలో క్యూలో నిలబెట్టింది. క్రమశిక్షణ నేర్పించింది. మంచి మాటలు రాయిస్తోంది. అవును.. కన్నాభాయ్ అనే యూజర్ ఎకౌంట్ ను నిర్వహించిన ఫణి అనే జనసైనికుడ్ని పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే, మిగతా జనసేన కార్యకర్తలంతా సెట్ అయ్యారు. సోషల్ మీడియాలో జగన్ పై అసభ్యంగా, పరుష పదజాలంతో పెట్టిన పాత పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఎకౌంట్లను డీ-యాక్టివేట్ చేస్తుంటే, మరికొంతమంది బహిరంగంగా ముఖ్యమంత్రి జగన్ కు క్షమాపణలు చెబుతున్నారు.

మొన్నటివరకు తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోయారు జనసైనికులు. ముఖ్యమంత్రిపై, మంత్రులపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే తమ అధినాయకుడు పవన్ కల్యాణ్ స్వయంగా సన్నాసి అనే పదం వాడారో, ఇక అప్పట్నుంచి జనసైనిక్స్ మరింత రెచ్చిపోయారు. పవన్ కల్యాణే ఓ మంత్రిని పట్టుకొని సన్నాసి అన్నప్పుడు, తామెందుకు తగ్గాలని అనుకున్నారు. రాయడానికి కూడా వీల్లేని బూతులతో రెచ్చిపోయారు.  

ఈ మొత్తం ఎపిసోడ్ ను పరాకాష్టకు తీసుకెళ్లాడు ఈ 'కన్నాభాయ్'. ఏకంగా మానవబాంబ్ గా మారి జగన్ ను హతమారుస్తానంటూ పెట్రేగిపోయాడు. దీంతో అప్పటివరకు సంయమనంతో ఉన్న ప్రభుత్వం, పోలీసులు ఇక రంగంలోకి దిగక తప్పలేదు.

'కన్నాభాయ్'కి జరిగిన ట్రీట్ మెంట్ ఏంటో జనసైనికులంతా తెలుసుకున్నారు. వాళ్లను బాధపెట్టిన అంశం ఇది మాత్రమే కాదు. ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు తమకు సంబంధం లేదని స్వయంగా పార్టీ ప్రకటన విడుదల చేయడం వీళ్లను దిక్కుతోచని స్థితిలో పడేసింది.

దీంతో ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఉగ్ర జన సైనికులంతా కాళ్లబేరానికొచ్చారు. చాలామంది వైఎస్ జగన్ ను ట్యాగ్ చేస్తూ క్షమాపణలు చెబుతున్నారు. మరికొంతమంది తమ ఎకౌంట్లను క్లోజ్ చేసుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన క్షమించేది లేదని, ఎకౌంట్ల డీ-యాక్టివేట్ చేసి దాక్కుంటే వదిలేది లేదని క్లియర్ గా చెబుతున్నారు.  

కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ ను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కూడా ఏమాత్రం సిగ్గుపడరు పవన్ కల్యాణ్. ఇప్పుడు తనకు సంబంధం లేదంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పవన్.. కొన్ని రోజుల తర్వాత తన జనసైనికులపై జగన్ కక్షసాధింపు చర్యలకు దిగారంటూ కచ్చితంగా ఆరోపణలు చేస్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ప్రస్తుతానికైతే జనసైనికులు దారికొచ్చారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?